పంచాయతీ చిన్న.. ప్రగతి మిన్న

10/25/2018
చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబం  
ఇది కుటుంబ నియంత్రణ నినాదం 
చిన్న పంచాయతీ.. ప్రగతికి చిరునామా  
ఇది తాజా విధానం 
అవును.. 
చిన్న పంచాయతీలు త్వరగా అభివృద్ధి  చెందుతున్నాయని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) తేల్చిచెప్పింది. 
అది కూడా ఒకే గ్రామం ఉన్న పంచాయతీల్లో సత్వర ప్రగతి 0సాధ్యమవుతోందని పేర్కొంది. ఇతర అంశాలనూ వెల్లడించింది.

ఎలా చెప్పగలిగారు? 
మిషన్‌ అంత్యోదయ పథకంపై  నిర్వహించిన సర్వే ఆధారంగా

ఏమిటీ మిషన్‌ అంత్యోదయ? 
గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి పరచడం ఈ పథకం లక్ష్యం. 2020 అక్టోబరు నాటికి గ్రామాల్లో దారిద్య్ర నిర్మూలన దీని ధ్యేయం. గత సంవత్సరం కేంద్రప్రభుత్వం దీనిని  ప్రవేశపెట్టింది.

సర్వే ఎలా చేశారు? 
మొదటి దశలో 50 వేల పంచాయతీలను ఎంపిక చేసి వాటిలో గత ఏడాది ఆగస్టులో తొలిసారి సర్వేను నిర్వహించింది. సాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, ప్రజా పంపిణీ వంటి 37 అంశాలకు మొత్తం 100 మార్కులు నిర్ణయించింది.  ఈ గ్రామానికి ఎన్ని మార్కులు వచ్చాయో  పంచాయతీల వారీగా లెక్కగట్టింది. ఒకే జిల్లాలో 80 కంటే ఎక్కువ, 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన పంచాయతీలలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ సంస్థ గత ఆగస్టులో మళ్లీ క్షేత్రస్థాయి సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని 120 పంచాయతీలలో ఈ సర్వే చేశారు.

రాష్ట్రంలో పురోగతి ఎలా ఉంది? 
అంత్యోదయ కింద తెలంగాణలో 1,620 పంచాయతీలు ఎంపికయ్యాయి. వీటిలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన తెల్లాపూర్‌, వడక్‌పలి, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన కొనైమాకుల, షాపూర్‌, యాదాద్రి జిల్లాకు చెందిన కొండమడుగు, ఉప్పలపహాడ్‌ పంచాయతీలను ఎన్‌ఐఆర్‌డీ తాజాగా విశ్లేషించింది.  తొలి సర్వేలో అధిక  మార్కులు వచ్చిన పంచాయతీలను అదే జిల్లాలోని తక్కువ మార్కులు వచ్చిన వాటితో సరిపోల్చటం ద్వారా ప్రగతిని ఏవిధంగా సాధించవచ్చో సులువుగా తెలియజేయవచ్చని ఎన్‌ఐఆర్‌డీ వివరించింది.

ఏం తేల్చారు? 
ఏడాది క్రితం సర్వేలో వచ్చిన మార్కులను, ప్రస్తుత సర్వేలో మార్కులతో సరిపోల్చి అక్కడి ప్రగతికి కారణాలను విశ్లేషించింది.  ఏడాది కాలంలో మంచి మార్కులను పొందిన పంచాయతీలను సమీక్షిస్తూ.. ప్రధానంగా ఒకే గ్రామంతో ఉన్న పంచాయతీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని గుర్తించినట్టు వెల్లడించింది. ఒక గ్రామంలో రోడ్డు వేయడానికి ఖర్చు తక్కువ అవుతుండగా, ఎక్కువ గ్రామాలున్న పంచాయతీల్లో వాటి నిడివి పెరిగి ఆ ఖర్చు ఎక్కువవుతోందని పేర్కొంది.

ఎందుకు ప్రాధాన్యం? 
చిన్న పంచాయతీలు నిలదొక్కుకోవటం కష్టమంటూ కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమిత్‌ బోస్‌  కేంద్రానికి  నివేదిక అందజేసిన సమయంలోనే  రాష్ట్రంలో పలు చిన్న పంచాయతీలు ఏర్పడటంతో ఇప్పుడు ఎన్‌ఐఆర్‌డీ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో తెలంగాణలో 8685 పంచాయతీలు ఉండగా ఇటీవల వీటి సంఖ్య 12,751కు చేరింది.

గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తున్న ఇతర కారణాలు

అధికారులు, ప్రజా ప్రతినిధులు బాగా పనిచేయటం ఉపాధి హామీ వంటి వివిధ పథకాల మేళవింపు
బయటి సంస్థల సాయాన్ని పొందగలగటం * ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా 
వినియోగించుకోవటం
ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహనఏర్పడటం ప్రముఖులు, ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోవటం
గ్రామాలు సొంత రాబడులను పెంచుకోవటం * ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించుకోవడం
Back to top