2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-VI వాహనాలే అమ్మాలి

10/25/2018
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-IV వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్లపై వాహన కంపెనీలు, వినియోగదార్లలో నెలకొన్న గందరగోళ స్థితికి సుప్రీంకోర్టు తెరదించింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచీ బీఎస్‌-IV వాహనాలు విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు నుంచి బీఎస్‌-జుఖి ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారైన వాహనాలను మాత్రమే విక్రయించాలని న్యాయమూర్తి, జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌-VI ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, కోర్టు ఈ స్పష్టత ఇచ్చింది.. మోటార్‌ వాహనాలు విడిచే పొగ కారణంగా వాతావరణంపై పడే దుష్ప్రభావాన్ని, కాలుష్య స్థాయిని నియంత్రించే ఉద్దేశంతో భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) ఉద్గార నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2017 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-IV నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే బీఎస్‌-5ని వదిలిపెట్టి నేరుగా 2020 నుంచి బీఎస్‌-VI నిబంధనలను అమల్లోకి తెస్తామని 2016లో కేంద్రం ప్రకటించింది. తదనుగుణంగా బీఎస్‌-VI వాహనాల తయారీని 2020 మార్చి తర్వాతే అనుమతినిస్తామని వెల్లడించింది. దీంతో బీఎస్‌-IV వాహనాలను ఆ తేదీ తర్వాత విక్రయించవచ్చా, లేదా స్పష్టం చేయాలంటూ వాహన తయారీదార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ కూడా 2020 జూన్‌ వరకు బీఎస్‌-IV వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతినివ్వాలని అడిగింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పై విధంగా స్పష్టత ఇచ్చింది.

Back to top