బ్యాంకులపై కొత్తగా నిరర్థక ‘ముద్ర’

02/08/2019
బ్యాంకులపై కొత్తగా నిరర్థక ‘ముద్ర’ 

పేరుకుపోతున్న బకాయిల భారం

‘ముద్ర’ పథకం కింద ఇప్పటి వరకు రూ.7.23 లక్షల కోట్ల రుణాలను అందించినట్లు తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ‘ఇది పేదల జీవితాలను మార్చేసింది. వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసింది’ అని ప్రధాని మోదీ గతంలో వ్యాఖ్యానించారు. ఈ పథకం అమలు తీరుతెన్నులపై గత నెల రెండో వారంలో రిజర్వుబ్యాంకు ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ రుణాలు సమీప భవిష్యత్తులో భారీ నిరర్థక ఆస్తులుగా పరిణమించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖను హెచ్చరించింది. అంతకు మూడు నెలల ముందు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఇలాంటి ఆందోళనే వ్యక్తంచేశారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులపై లోక్‌సభ అంచనాల కమిటీకి సెప్టెంబరు, 2018లో ఆయన సమాచారపత్రాన్ని అందజేశారు. బ్యాంకింగ్‌ సంక్షోభానికి ఈ రుణాలు కారణం కావచ్చని అందులో హెచ్చరించారు. పథకం అమలు తీరును మరింత లోతుగా పరిశీలించాలని సూచించారు. 2008నాటి ఆర్థిక సంక్షోభాన్ని మూడేళ్ల ముందే పసిగట్టిన వ్యక్తిగా రాజన్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు ఉంది. ఆయన హెచ్చరికలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం! దీనికి తగ్గట్టు కేంద్రాన్ని ఆర్బీఐ అప్రమత్తం చేయడంతో ‘ముద్ర’ మీద ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది.

ప్రభుత్వరంగ బ్యాంకులు మంజూరు చేస్తున్న రుణాల్లో నిరర్థక ఆస్తులుగా మారుతున్న ‘ముద్ర’ వాటా వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. డిసెంబరు 21, 2018న లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన సమాచారం మేరకు- నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మారిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ‘ముద్ర’ రుణాలు గడచిన మూడేళ్లలో పన్నెండు రెట్లు పెరిగాయి. 2015-16లో నమోదైన ఆ ఎన్‌పీఏల విలువ రూ.596 కోట్లు; అవి 2017-18లో రూ.7277 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 2018 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు విడుదల చేసిన ‘ముద్ర’ రుణాల విలువలో ఎన్‌పీఏల వాటా 3.43 శాతమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘మేం 2017లో రూ.28,500 కోట్ల విలువైన ముద్ర రుణాలను మంజూరు చేశాం. వాటిలో 5.2 శాతం ఎన్‌పీఏలుగా మారాయి’ అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ ఇటీవల వెల్లడించారు. కేంద్రం మాత్రం ఈ విషయమై పెద్దగా ఆందోళన చెందడం లేదు. ‘రుణగ్రహీతలు బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేయరు. బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకునే రుణాలు పంపిణీ చేస్తున్నాయి. కాబట్టి ఎన్‌పీఏలపై ఆందోళన అక్కర్లేదు’ అని కేంద్ర ఆర్థికసేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వ్యాఖ్యానించడం విశేషం!

స్వల్ప రుణాలతోనే పెద్ద సమస్య 
ఈ పథకంలో అందుతున్న రుణాలు స్వల్పమైనవి. ‘ముద్ర]’ కింద ‘శిశు’ (రూ.50 వేల వరకు), ‘కిశోర్‌’ (రూ.50 వేల నుంచి అయిదు లక్షల వరకు), ‘తరుణ్‌’ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు) విభాగాల్లో ఎలాంటి పూచీకత్తూ లేకుండా రుణాలు ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి 18 నాటికి దేశవ్యాప్తంగా 15.56 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.7.23 లక్షల కోట్లను రుణాలుగా అందజేశారు.  లబ్ధిదారుల్లో దాదాపు తొంభై శాతానికి అందింది ‘శిశు’ రుణాలే! ‘ముద్ర’ వార్షిక నివేదికల ప్రకారం 2015- 18 మధ్యలో 12.27 కోట్ల మందికి రుణాలిస్తే వాళ్లలో 11.15 కోట్ల మంది ‘శిశు’ లబ్ధిదారులే!  వారికి రూ.2.50 లక్షల కోట్ల విలువైన రుణాలను అందజేశారు. అంటే, ఒక్కొక్క లబ్ధిదారుకు అందిన సగటు రుణం రూ.22,420 మాత్రమే! టీ కొట్టు, బడ్డీ కొట్టు లాంటివి పెట్టుకోవడానికీ ఈ సొమ్ము సరిపోదు! ఏకమొత్తంగా చూస్తే, ఇచ్చిన ‘ముద్ర’ రుణాల విలువ భారీగా కనపడుతోంది- పాలకులూ ఆ సంఖ్యనే తరచూ ఉటంకిస్తున్నారు. కానీ, ఆదాయ సృష్టికి అక్కరకు రాని అతితక్కువ మొత్తాలనే ఎక్కువ మందికి అందిస్తున్నారు!‘ముద్ర పథకం కింద ఇస్తున్న రుణ మొత్తాల్లో తొంభై శాతం రూ.50 వేల కంటే తక్కువే. దీంతో ఏ వ్యాపారాన్నీ ప్రారంభించలేం. లబ్ధిదారుల ఆదాయవృద్ధి మీద ఈ పథకం ఎలాంటి ప్రయోజనమూ చూపించడంలేదు’ అని డిసెంబరు 28, 2018న లోక్‌సభలో ఎంపీ ధ్రువనారాయణ పేర్కొన్నారు. దీనికి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానమిస్తూ, ‘ముద్ర’ రుణాల్లో అత్యధిక శాతం చిన్న మొత్తాలేనని అంగీకరించారు. మరోవైపు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల మాట్లాడుతూ ‘ముద్ర’తో నాలుగు కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. ‘ఈ పథకం కింద ప్రభుత్వం 12 కోట్ల మంది చిన్న వ్యాపారవేత్తలకు ఆర్థిక సాయం చేసింది. సమ్మిళిత, సుస్థిర వ్యాపార సంస్కృతిని సృష్టించడం ద్వారా దేశంలోనే ఉపాధికల్పనకు ఊతమిస్తోంది’ అని మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు.

‘ముద్ర’ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణాలిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ప్రత్యేక నిధి అంటూ ఏదీ లేదు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం తరఫు నుంచి వేరే కేటాయింపులూ ఏమీ లేవు. ‘ముద్ర’ ప్రత్యేకత అయిన పునర్‌ ఆర్థికసాయానికి (రీ ఫైనాన్స్‌) కేటాయించిన మొత్తమూ చాలా తక్కువే. మరోవైపు రుణాల మంజూరుకు మాత్రం బ్యాంకులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. దాంతో  ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య రుణాల మంజూరు ఓ పరుగుపందెంలా మారుతోంది. లక్ష్యాలను చేరుకోవాలనే ఒత్తిడిలో హడావుడిగా అనర్హులకు రుణాలను మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి. ‘మా దగ్గరికి వచ్చిన వాళ్లందరికీ రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. దరఖాస్తుదారుల్లో చాలామంది దగ్గర ఎలాంటి వ్యాపార ప్రణాళికలూ ఉండటం లేదు... ముద్ర రుణాల్లో అత్యధికం బ్యాంకింగ్‌ నియమాలకు విరుద్ధంగా మంజూరవుతున్నాయి’ అని ఎస్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు చేటుచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘శిశు’ విభాగంలో మంజూరవుతున్న రుణాల తిరిగి చెల్లింపు సక్రమంగా జరగడంలేదని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘మూడేళ్ల తరవాత ముద్ర లెక్కలను పరిశీలిస్తే మా ప్రాంతంలో 60 శాతం రుణాలు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయని అర్థమైంది’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజర్‌ ఒకరు చెప్పారు. ‘ఈ రుణాల గురించి మాకేం తెలియదు. అవి ఎవరికి అందాయో, ఏయే వ్యాపారాలకు వాటిని ఇచ్చారో, రుణాల మంజూరు ఎలా జరుగుతోందో మాకేం తెలియదు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మరుణ సంస్థల నుంచి రుణాల గణాంకాలను సేకరించే సంస్థ మాత్రమే మాది’ అని ‘ముద్ర’ ఏజెన్సీలోని ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు.

‘ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ముద్ర రుణాలను కేంద్రం మాఫీ చేయవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం మనం టైంబాంబు మీద కూర్చున్నాం’ అని చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) అధికారి ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. ‘ముద్ర’ ఏజెన్సీ సిడ్బీకి అనుబంధంగా ఏర్పాటైన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థే! నిజానికి ‘ముద్ర’ కింద ఇస్తున్నవి ఉచిత రుణాలనే భావన ఇప్పటికే లబ్ధిదారుల్లో నెలకొంది. ఇచ్చిన రుణాల గురించి తప్ప వాటి ద్వారా సాధించిన ఆదాయ వృద్ధి ఊసెత్తని పాలకుల ప్రకటనలు దీనికి ఊతమిస్తున్నాయి. అందుకే చాలామంది అప్పు తీర్చడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరుగుతున్నాయి.

అవినీతిపరులకు అవకాశం 
పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ విధానం అవినీతిపరులకు కలిసివస్తోంది. 2018 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బర్మేర్‌కు చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సీనియర్‌ అధికారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. రూ.62 లక్షల విలువైన 26 రుణాలను మోసపూరితంగా అనర్హులకు మంజూరుచేశారన్నది ఆయన మీద అభియోగం! ముందస్తు తనిఖీలు చేయకుండా, దరఖాస్తుదారుల వ్యాపార/నివాస ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా, రుణ మొత్తాన్ని ఎలా వినియోగిస్తారో, దాంతో ఎంతమేరకు సంపదను సృష్టిస్తారో తెలుసుకోకుండా రుణాలు మంజూరు చేసినట్టు ఈ కేసులో దర్యాప్తు సంస్థ గుర్తించింది. నిజానికి ముద్ర రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు బ్యాంకు మేనేజర్లు ‘60-40 సూత్రం’ పేరిట అక్రమాలకూ పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన రుణంలో లబ్ధిదారుడికి 40 శాతం ఇస్తారు. మిగిలిన 60 శాతాన్ని తమవద్దే ఉంచుకుంటారు. ఈ సొమ్ముతో ఓ సంవత్సరం కిస్తీలు కడతారు. మిగిలింది తమ జేబుల్లో వేసుకుంటారు. ఏడాది పాటు కిస్తీలు కట్టడంతో ఆ రుణ ఖాతా తొందరగా నిర్వీర్యం కాదు. నిరర్థక ఆస్తుల జాబితాలోకీ ఎక్కదు. కిస్తీలు కట్టడం ఆపేశాక లబ్ధిదారుడికి వ్యాపారంలో నష్టం వచ్చిందని దస్త్రాల్లో నమోదు చేస్తారు. దీనివల్ల పై అధికారుల సమీక్షలో వీళ్లు తప్పించుకుంటారు. లబ్ధిదారుల మీదా ఎలాంటి చర్యలూ ఉండవు. ఈ పరిస్థితుల్లో పథకం అమలు తీరును కేంద్రం పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలను నిర్దేశించి తక్కువ మొత్తంలో రుణాలను ఇప్పించడం కన్నా, సుస్థిర ఆదాయ సాధనకు ఊతమిచ్చే రుణాల మంజూరుపై దృష్టి సారించాలి. ఇప్పటివరకు మంజూరు చేసిన రుణాల వల్ల జరిగిన సంపద సృష్టి మీద, తద్వారా పెరిగిన ఉపాధి అవకాశాల పైన అధ్యయనం చేయించాలి. అప్పుడే ‘ముద్ర’ పథకం మేలు చేయగలదు!

Back to top