వికసించని విద్యారంగం

03/01/2019

విద్యావ్యవస్థ మౌలిక లోపాలతో సతమతమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని నిధులు కేటాయిస్తున్నా పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో మార్పులు రావడం లేదు. ఫలితంగా పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందాన ఉంది. అసర్‌ (ఏఎస్‌ఈఆర్‌- వార్షిక విద్యా నివేదిక)- 2018 నివేదిక విద్యావ్యవస్థలోని లోపాలను వెలుగులోకి తీసుకువచ్చింది. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలు మెరుగుపడటం లేదని, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలు కొరవడుతున్నాయని నివేదిక ఎండగట్టింది.

దేశవ్యాప్తంగా 596 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులపై సర్వే నిర్వహించారు. బడిలో చేరని వారి సంఖ్య  తగ్గుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇది మంచి పరిణామమే. మరోపక్క 15-16 సంవత్సరాల బాలికల్లో 13.5 శాతం మంది బడికి దూరంగానే ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గత రెండు సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నవారి విద్యార్థుల సంఖ్య తక్కువేనని తేలింది. 2016లో 30.6 శాతం మేర విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. 2018లో సైతం దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చదవడం, రాయడం, విషయ సూచికలను అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక విషయాల్లో విఫలం అవుతున్నారని అసర్‌ నివేదిక విశ్లేషించింది.

బోధన అనేది ప్రత్యేక నైపుణ్యంతో కూడిన విధానం. ఉపాధ్యాయులు బోధించే తీరుపైనే విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించడం, వారిని చదువుపై పట్టు సాధించేలా చేయడం ఆధారపడి ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో లక్షల మంది ఉపాధ్యాయులు ఎలాంటి శిక్షణ లేకుండానే బోధన చేస్తున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు దేశవ్యాప్తంగా శిక్షణ లేని ఉపాధ్యాయులు సుమారు 14.97 లక్షల మంది ఉన్నారు. బిహార్‌లో అత్యధికంగా 2.85 లక్షలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.95, పశ్చిమ్‌బంగలో 1.69, అసోమ్‌లో 1.51 లక్షల మంది దూరవిద్యలో ఉపాధ్యాయ శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. దీనినిబట్టి ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. గతంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు పటిష్ఠంగా ఉండేవి. రానురాను ఉపాధ్యాయ శిక్షణపై విద్యార్థులకు మక్కువ తగ్గుతోంది. శిక్షణ కోసం ప్రవేశం పొందిన విద్యార్థులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరు కాకపోయినప్పటికి వార్షిక పరీక్షలు రాసే వెసులుబాటు కొన్ని చోట్ల కల్పిస్తున్నారు. దీంతో శిక్షణ పూర్తిచేసి బయటికి వస్తున్న విద్యార్థుల్లో చాలా మందికి బోధన సామర్థ్యాలు కొరవడుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారిలో చాలామంది గురుతర బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. రోజూ సుమారు 15 శాతం మేర ఉపాధ్యాయులు గైర్హాజరు అవుతున్న తీరు చూస్తే వారి అంకితభావం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు పనిచేసే పరిసర ప్రాంతంలోనే నివసించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని చాలా మంది పాటించడం లేదు. దీనివల్ల వారు సకాలంలో పాఠశాలలకు రాలేకపోవడం, దూరప్రాంతాల నుంచి రావడం వల్ల అలసి పోవడంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పలు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవడం, మౌలిక వసతుల కల్పనలో విఫలం అవుతున్న కారణంగా విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోంది. సర్కారు పాఠశాలల్లో ఏకోపాధ్యాయ టీచర్లు బోధనతో పాటు పాలనపరమైన బాధ్యతలను వారు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటిలో వారు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. దేశంలో 92,275 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండగా ఆంధ్రపదేశ్‌లో 7483, తెలంగాణలో 4587 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.

పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యాన్ని విడనాడాలి. అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా సరైన ఫలితాలు రావడం లేదు. బయోమెట్రిక్‌ హాజరు నమోదును పూర్తిస్థాయిలో అమలు చేయాలి. తల్లితండ్రుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పాఠశాల సంఘాలు సమన్వయంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. ఉపాధ్యాయుల పనితీరుపై ప్రతి మూడు నెలలకొకసారి పర్యవేక్షణ అవసరం. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాల్సి ఉంది. కేవలం పిల్లలను పాఠశాలలకు పంపడమే కాక, వారు ఏ విధంగా చదువుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. అన్ని వైపుల నుంచి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు జరిగినప్పుడే విద్యావ్యవస్థ వికసిస్తుంది!

Back to top