కష్టార్జితానికి కొత్త భరోసా

03/02/2019
కష్టార్జితానికి కొత్త భరోసా 

అనియంత్రిత డిపాజిట్‌ పథకాలపై అత్యవసరాదేశం

చట్టబద్ధత లేని డిపాజిట్‌ పథకాల మాటున అధిక రాబడి ఎరవేసి అమాయకపు ప్రజలను మోసగించే సంస్థల ఆటకట్టించే దిశలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రజలనుంచి వివిధ పథకాల కింద డిపాజిట్ల రూపంలో నిధుల సమీకరణను నిషేధిస్తూ ఇటీవల ప్రభుత్వం ‘అనియంత్రిత డిపాజిట్‌ పథకాల నిషేధ ఆర్డినెన్స్‌-2019’ను తీసుకువచ్చింది. ఈ అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) ప్రకారం సంబంధిత సంస్థల (ఆర్‌బీఐ, సెబీ, ఎన్‌హెచ్‌బీ, ఐఆర్‌డీఏఐ, కార్పొరేట్‌ వ్యవహారాల మంతిత్వ్రశాఖ, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వంటివి) నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మోసపూరితంగా ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించడం నిషేధం. గతంలో చోటుచేసుకున్న పలు కుంభకోణాలవల్ల, మదుపరులు పెద్దయెత్తున నష్టపోయారు. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పలు రకాల ఆర్థిక మోసాలు ఒక్కొక్కటిగా నేటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా అత్యవసరాదేశం మోసపూరిత డిపాజిట్‌ పథకాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, సామాన్య ప్రజానీకాన్ని ఆర్థిక కుంభకోణాలబారిన పడకుండా కొంతమేర కాపాడగలుగుతుంది.

అధిక రాబడి ఆశ 
తాజా అత్యవసరాదేశంలో పొందుపరచిన కొన్ని నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, అవి కొంతమేర అనుమానాలకు తావిచ్చేవిగా ఉండటంతో గందరగోళం నెలకొన్న మాట నిజమే. మరికొన్ని నిబంధనల్లో సందిగ్ధత, అస్పష్టతలుండటంతో అపోహలు ఏర్పడుతున్నాయి. ఇప్పటిదాకా చట్టబద్ధంగా కొనసాగుతున్న కొన్ని రకాల ఆర్థిక లావాదేవీలూ నిషేధానికి గురవుతాయన్న అనుమానాలూ చెలరేగాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తమ సమీప బంధువు నుంచి తీసుకొన్న రుణాన్ని సెక్షన్‌ 2(4) ఎఫ్‌ కింద ఈ ఆర్డినెన్స్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే, అదే వ్యక్తి ఇతర మిత్రుల నుంచి తీసుకొనే రుణాలకు (స్వల్పకాలిక) ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. దాంతో ఈ తరహా లావాదేవీలు అనియంత్రిత డిపాజిట్‌ పథకం పరిధిలోకి వస్తాయన్న అనుమానాలు తలెత్తాయి. అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా తీసుకునే రుణాలు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలు  కూడా ఈ ఆర్డినెన్స్‌ పరిధిలోకి వస్తాయని, ఫలితంగా అటువంటి లావాదేవీలు నిషిద్ధమన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇవన్నీ ఆర్డినెన్స్‌ పరిధిలోకి రావని, వీటికి మినహాయింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయినా ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చిట్‌ఫండ్‌ చట్టం-1982 కింద నమోదైన సంస్థలు ఈ ఆర్డినెన్స్‌ పరిధిలోకి రావన్నది గమనార్హం. అదేవిధంగా వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, స్నేహితులు, బంధువుల మధ్య జరిగే రుణసంబంధిత లావాదేవీలు సైతం ఈ పరిధిలోకి రావు. చిన్న వ్యాపారస్తులు; చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీలకూ మినహాయింపు ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలి. చట్టబద్ధత లేని డిపాజిట్‌ పథకాలకు అడ్డుకట్టవేసి చిన్న మదుపరులు మోసపోకుండా చూసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఆర్డినెన్స్‌- భవిష్యత్తులో సత్ఫలితాలు ఇవ్వాలంటే మరిన్ని చర్యలు చేపట్టాలి. గతంలో ఎఫ్‌ఆర్‌డీఐ (ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌) ముసాయిదా బిల్లు విషయంలోనూ అనాలోచితంగా ‘బెయిల్‌-ఇన్‌’ నిబంధన పొందుపరచడంతో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ముసాయిదా బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఆర్డినెన్స్‌ చట్టరూపం దాల్చేలోపు అవసరమైన మార్పులు చేర్పులు చేసి అనిశ్చితిని తొలగించాల్సిన అవసరం ఉంది.

గడచిన రెండు దశాబ్దాల కాలంలో దేశంలో పలు భారీ ‘డిపాజిట్‌ పథకాల’ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. అధిక రాబడి ఉచ్చులో పడి, కోట్ల సంఖ్యలో చిన్న మదుపరులు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన సంపదను కోల్పోయారు. ఇవన్నీ అనియంత్రిత డిపాజిట్‌ పథకాల మోసాల వల్ల జరిగినవే. వీటిని అరికట్టడానికి పలుచట్టాలు అమలులో ఉన్నప్పటికీ, సకాలంలో మోసాలను గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. సామాన్య ప్రజానీకానికి ఉన్న ‘అధిÅక రాబడి’ ఆశే పెట్టుబడిగా, మోసపూరిత డిపాజిట్‌ పథకాల ద్వారా వేలకోట్ల రూపాయలు దండుకొని కనుమరుగైన సంస్థలు, వ్యక్తులు కోకొల్లలు. శారదా కుంభకోణం మొదలు రోజ్‌వ్యాలీ, పీఏసీఎల్‌, సహారా పరివార్‌ కుంభకోణాలు కోట్లమంది జీవితాలను చిదిమేశాయి. గతంలో టేకు మొక్కల పెంపకం మొదలు, గొర్రెల పెంపకం, ఈము పక్షుల పెంపకం, కరక్కాయల పొడి దాకా వివిధ పథకాల పేర్లతో మోసపూరితంగా డిపాజిట్లు సమీకరించి ఆపై బోర్డులు తిప్పేసి అమాయకపు ప్రజానీకాన్ని నట్టేట ముంచిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

అగ్రిగోల్డ్‌ సంస్థ 1995 నుంచి ‘కలెక్టివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పథకం’ పేరిట దాదాపు 32 లక్షల మందిని ఏడు వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన చిన్నమదుపరులను ఈ సంస్థ నట్టేట ముంచింది. రిజర్వుబ్యాంకు, ‘సెబీ’ల అనుమతి లేకుండా ఏకధాటిగా 18 ఏళ్ళపాటు ఈ సంస్థ మోసం చేయగలిగిందంటే ప్రభుత్వ వైఫల్యం ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. శారదా కుంభకోణంలోనూ 17 లక్షల మంది రూ.20 వేల కోట్ల మేరకు నష్టపోయారు. రెండు వందలకు పైగా అనుబంధ సంస్థలను ప్రారంభించి పలురకాల పథకాలతో మోసాలకు పాల్పడ్డారు. ఇలా చెప్పుకొంటూ పోతే దేశంలో చోటుచేసుకున్న అక్రమ డిపాజిట్‌ పథకాలకు అంతే ఉండదు. దేశంలో ఏ సంస్థ డిపాజిట్లు సమీకరించాలన్నా రిజర్వు బ్యాంకు, ‘సెబి’ (లిస్టెడ్‌ కంపెనీ అయినట్లయితే) అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఆయా డిపాజిట్‌ పథకాలు, సంస్థల కార్యకలాపాలనుబట్టి రాష్ట్రప్రభుత్వాల అనుమతులూ పొందాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా డిపాజిట్లు సమీకరించిన సంస్థలు, వ్యక్తులను నిలువరించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి మోసపూరిత డిపాజిట్‌ పథకాలు తలెత్తకుండా పలు కఠిన నిబంధనలను ఈ అత్యవసరాదేశంలో పొందుపరచారు.

అవగాహన పెరగాలి 
‘అనియంత్రిత డిపాజిట్‌ పథకాల నిషేధ ఆర్డినెన్స్‌-2019’ గత నెల 21 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దేశంలోని అన్ని అనియంత్రిత డిపాజిట్‌ పథకాలపై నిషేధం అమలవుతుంది. అత్యవసరాదేశంలో మొదటి షెడ్యూలులో పేర్కొన్న డిపాజిట్‌ పథకాలతోపాటు దేశంలో ఉన్న పలు నియంత్రణ సంస్థల (ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ వంటివి) అనుమతి పొందినవాటిని నియంత్రిత డిపాజిట్‌ పథకాలుగా గుర్తిస్తారు. అదేవిధంగా ఆర్డినెన్స్‌లో మొదటి షెడ్యూల్‌లో లేని పథకాలతో పాటు ‘ప్రైజ్‌ చిట్స్‌ అండ్‌ మనీసర్కులేషన్‌ స్కీమ్‌ (నిషేధం) చట్టం- 1978’ కింద నిషేధిత పథకాలన్నీ అనియంత్రిత డిపాజిట్‌ పథకాల కిందకు వస్తాయి. గొలుసుకట్టు మార్కెటింగ్‌ పథకాలతోపాటు ఎటువంటి అనుమతులు లేకుండా చిట్‌ఫండ్‌ చట్టం, 1982కు విరుద్ధంగా సమీకరించే డిపాజిట్లు ఈ కోవకు చెందుతాయి. అనియంత్రిత డిపాజిట్‌ పథకాల గురించి అటు ప్రత్యక్షంగా కాని, ఇటు పరోక్షంగా కాని ఎటువంటి ప్రచారం చేయరాదు. డిపాజిట్లు స్వీకరించడం, వాటిని ప్రోత్సహించడం పూర్తిగా నిషిద్ధం. నియంత్రిత డిపాజిట్‌ పథకాల్లో నిబంధనల ప్రకారం సకాలంలో డిపాజిట్‌ సొమ్మును తిరిగి చెల్లించకపోయినా లేదా ఏదైనా అవకతవకలకు పాల్పడినా కఠిన శిక్షలతోపాటు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అనియంత్రిత పథకాల కింద డిపాజిట్లను సమీకరించినట్లయితే రెండు నుంచి ఏడేళ్ల దాకా జైలుశిక్షతోపాటు మూడు లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షల దాకా జరిమానా విధిస్తారు. నియంత్రిత డిపాజిట్‌ పథకాల కింద డిపాజిట్‌ సొమ్మును తిరిగి చెల్లించకపోతే కనిష్ఠంగా అయిదు లక్షల రూపాయలు, గరిష్ఠంగా డిపాజిట్‌ చేసిన సొమ్ముకు రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలి. మూడు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షా పడుతుంది. మోసపూరిత పథకాల అమలుకు పాల్పడినవారికి రూ. 10 లక్షల నుంచి రూ.50 కోట్ల దాకా జరిమానాతోపాటు అయిదు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.

మోసపూరితంగా అధిక రాబడి ఎరతో డిపాజిట్లు సేకరించే వ్యక్తులు, సంస్థలపై ఉక్కుపాదం మోపడం ఎంత అవసరమో ప్రజల్లో ఇటువంటి మోసపూరిత పథకాలపై అవగాహన కల్పించడమూ అంతే అవసరం. కఠిన చట్టాలు, శిక్షలతోపాటు పటిష్ఠ యంత్రాంగాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎన్ని చట్టాలు చేసినా అధికవడ్డీ, అధిక రాబడి బలహీనతలను అడ్డుపెట్టుకొని మోసపూరిత పథకాలతో సామాన్య ప్రజానీకాన్ని నట్టేట ముంచే ఆర్థిక నేరగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అందువల్ల ప్రజలూ అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ నేపథ్యంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సమన్వయంతో రిజర్వుబ్యాంకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అనుమానాస్పద డిపాజిట్‌ పథకాలను ముందుగానే గుర్తించే పరిజ్ఞానాన్ని ప్రజల్లో పెంపొందించాలి. ఏ సంస్థయినా డిపాజిట్లు లేదా పెట్టుబడులపై అత్యధిక వడ్డీ/రాబడి ఇస్తామని అంటుంటే వెంటనే అనుమానించాలి. ఆయాసంస్థల డిపాజిట్‌ పథకాల వివరాలను సంబంధిత నియంత్రణ సంస్థల ‘వెబ్‌సైట్‌’లో సరిచూసుకోవడం అవసరం. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఈ తరహా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, వాటిని పకడ్బందీగా అమలుపరచగలిగితే సామాన్యుడి కష్టార్జితాన్ని అక్రమార్కులు పథకాల పేరిట ఎగరేసుకుపోకుండా నియంత్రించడం సాధ్యపడుతుంది!

Back to top