మారాలి మన చదువులు

03/04/2019
మారాలి మన చదువులు

ఉపాధి చూపే విద్యే నేటి అవసరం

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన సవాలుగా మారింది. ప్రభుత్వాల పరంగా ఉద్యోగ నియామకాలు నత్తనడకన సాగుతోంది. ప్రైవేటు రంగంలో నియామకాల పరిస్థితి ఒకింత ఆశాజనకంగా ఉంది. అయితే పట్టా పుచ్చుకొని వచ్చే యువకుల్లో ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యం కొరవడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ముందు విద్యావిధానంలో గుణాత్మక మార్పు రావాలి. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా చదువులు సాగాలి. దీనివల్ల కొంతవరకైనా నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చు. గడచిన నాలుగు సంవత్సరాల్లో నిరుద్యోగిత రేటు ఏడు శాతానికి మించి ఉంది. ఉద్యోగ కల్పన మందకొడిగా సాగడానికి కారణం తగినంత ఆర్థిక వృద్ధిరేటు సాధించలేకపోవడమా, లేక లక్ష్యం లేకుండా సాగుతున్న విద్యావిధానమా అన్నది చర్చనీయాంశం. ప్రపంచవ్యాప్తంగా చైనా తరవాత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్‌ ఒక్కటే. అయినప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన సవాలుగానే మిగులుతోంది. విద్యావిధానంలో లోపమే ఈ పరిస్థితికి కారణమన్నది విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయం.

విద్యావిధానం ‘చదువు- ఉపాధి’ అనే చట్రంలో ఇరుక్కొని ఉంది. యువకులు ముందు చదువుకొని, అనంతరం ఉద్యోగాన్వేషణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చదువులు ఉద్యోగానికి అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం అందజేయగలుగుతున్నాయా అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. తాము నాణ్యమైన విద్యనే అందిస్తున్నామని విద్యాసంస్థలు చెబుతుండగా, మరోపక్క అది ఎందుకూ పనికిరాదన్నది కొన్ని ప్రైవేటు సంస్థల వాదన. ‘నాస్కామ్‌’ అభిప్రాయం ప్రకారం ఏటా పట్టాలు అందుకొని బయటకు వస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో దాదాపు 85 శాతం ఉద్యోగార్హులు కారు. ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు వారిలో కొరవడుతున్నాయి. ఉద్యోగంలోకి తీసుకోగానే మళ్ళీ వారికి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యావ్యవస్థను ‘నూతన ఆలోచనా సరళి’ వైపు మళ్లించడం అవసరం. ‘చదువు-ఉపాధి’ నినాదానికి బదులుగా ‘ఉపాధి-చదువు’ అనే నినాదంతో ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు సమకూరుతాయి. ‘కింది స్థాయి కార్యాలయ సిబ్బందిని’ మాత్రమే తయారుచేయడానికి పనికివస్తున్న ప్రస్తుత విద్యా విధానం దేశానికి ఉపయోగపడదు. బతుకుతెరువుకు అవసరమైన తెలివితేటలు, నైపుణ్యాన్ని ఇవి అందజేయడం లేదు.
‘ప్రయోగశాల నుంచి వ్యవసాయ భూమికి’ అనే కార్యక్రమాన్ని 1997లో చైనా ప్రారంభించి మెరుగైన ఫలితాలను సాధించింది. ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ‘ల్యాబ్‌ టు లాండ్‌’ పేరుతో 1979లో కేంద్రం ఇదే మాదిరి పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సాధించిన ఫలితాలు పరిమితం. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు ఉపాధి, తరవాత చదువు అనే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. ఈ పద్ధతిలో యువకుడికి ఉపాధి కల్పనకు ఎంతమేరకు ‘పాఠ్యాంశాల విజ్ఞానం’ అవసరమో అంతవరకే బోధిస్తారు. అనంతరం అదే పనిలో కొనసాగుతూ ఉన్నత ప్రమాణాలు సాధించడానికి అవసరమైన విజ్ఞానాన్ని అదనంగా నేర్పుతారు.

వివిధ వృత్తుల్లో ఉన్నవారికి, ఆయా వృత్తులకు సంబంధించి అదనపు విద్య అందించే ప్రణాళిక అమలు చేసినట్లయితే మంచి ఫలితాలు సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలామంది వృత్తి పనివారు ఎప్పుడో నేర్చుకొన్న నైపుణ్యాలతో నెట్టుకొస్తున్నారు. కాలానుగుణంగా వస్తున్న సాంకేతికాంశాలతో కూడిన శిక్షణ ఇచ్చినట్లయితే, వారి సామర్థ్యాలు మెరుగవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిలో ముందుకు సాగుతారు. ప్రస్తుత వృత్తి పనివారి నైపుణ్యాలను మదింపు వేసి, సామర్థ్యాల మేరకు ‘ధ్రువీకరణ పత్రాలు’ అందజేసినట్లయితే, వారు మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది జాతీయస్థాయిలో ప్రామాణికంగా ఉన్న సంస్థల ద్వారా మాత్రమే జరగాలి. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వశాఖ 2013లో ‘జాతీయ నైపుణ్య అర్హతల పథకం’ (నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌) ప్రారంభించింది. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తి నిర్దేశించిన నైపుణ్యాన్ని వ్యవస్థీకృతమైన సంస్థల నుంచి గాని, వ్యవస్థీకృతం కాని సంస్థల నుంచి గాని కలిగి ఉంటే, దాన్ని మదింపువేసి ఆ నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తారు. ఈ పథకం ఆశించిన ఫలితాలు అందించలేదు. ఇంతవరకు నైపుణ్యం పొందినవారికి ధ్రువపత్రం జారీచేసి, వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగ కల్పన జరిగే విధంగా తోడ్పడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నైపుణ్య కేంద్రాలకు, వాటి అర్హతల ఆధారంగా అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ పథకం ప్రారంభమై అయిదేళ్లు గడిచినా పురోగతి శూన్యం. 1986నాటి జాతీయ విద్యావిధాన ప్రకటన ఉద్యోగాలకు, డిగ్రీ పట్టాలకు ముడిపెట్టని విద్యావిధానం రావాలని ఆశించింది. ఇప్పుడైనా దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలకు ప్రతి సంస్థ స్వయంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యాలయాలు ప్రదానం చేసే ‘గ్రేడులు’, ధ్రువపత్రాలను ఏ సంస్థా అంతగా పరిగణనలోకి తీసుకోవడంలేదు. యూజీసీ నిర్వహించే ‘అధ్యాపక అర్హత పరీక్ష’లో కనీసం 15 శాతమైనా ఉత్తీర్ణులు కావడం లేదు. దీన్నిబట్టి విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాల్సిన అవసరం ఉంది!

Back to top