శౌర్యత్యాగాలకు నిలువెత్తు ప్రతీక

03/05/2019
శౌర్యత్యాగాలకు నిలువెత్తు ప్రతీక

‘జై జవాన్‌’ స్ఫూర్తిగా జాతీయ యుద్ధస్మారకం
కావాలి అమర వీరుల స్మరణకు ప్రత్యేక దినం

ఇంటా బయటా ఎదురయ్యే సవాళ్లు, సంక్షోభాల నుంచి భారతావనిని కాపాడుతున్న వీర జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. సైనిక వీరుల సాహసాల ఫలితంగానే ఈ గడ్డ క్షేమంగా మనగలుగుతోంది. వీర జవాన్ల త్యాగాలకు గుర్తుగా దేశ రాజధాని దిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని నేను రెండు రోజుల క్రితం సందర్శించాను. ఆ సందర్భంగా అనిర్వచనీయమైన భావోద్విగ్నత నన్ను ఆవరించింది. జాతి రక్షణలో ప్రాణాలొదిలిన అమరులకు- భారమైన హృదయంతో అంజలి ఘటించడం, ప్రాణత్యాగానికీ వెరవక సరిహద్దులు కాచిన వారి సాహసాన్ని తలచుకొని భారతీయుడిగా గర్వపడటం, ఇలాంటి చిచ్చర పిడుగుల చేతిలో భారతావని సుభద్రంగా ఉంటుందన్న ఆశావీచికలు... ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. జాతి రక్షణ అనే మహోన్నత లక్ష్య సాధనకోసం అసువులుబాసిన వీరులకోసం నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకం మున్ముందు ఎందరో భారతీయ యువకులు సైన్యంలో చేరేందుకు స్ఫూర్తిగా, ప్రేరకంగా నిలుస్తుందనిపిస్తోంది.

స్వప్నం సాకారమైన వేళ
దేశ భౌగోళిక సమగ్రతను కాపాడే క్రమంలో కన్నుమూసిన వీర జవాన్లకోసం ఏర్పాటు చేసిన స్మారకం దశాబ్దాల కల. స్వాతంత్య్రానంతరం ఏడు దశాబ్దాలకు ఆ స్వప్నం సాకారమైంది. 1962 భారత్‌-చైనా యుద్ధంలో; 1947, 1965, 1971 పాకిస్థాన్‌తో యుద్ధాల్లో; 1999లో కార్గిల్‌ సమరంలోనూ అమరులైన జవాన్లకు గుర్తుగా ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించే శాంతిస్థాపక కార్యక్రమాల్లో, విపత్తులు విరుచుకుపడినప్పుడు మానవతా సహాయ కార్యక్రమాల్లో, తిరుగుబాట్లను అణచివేసే ఆపరేషన్లలోనూ పాల్గొని నిహతులైన వీర సైనికులకు గుర్తుగానూ ఈ యుద్ధస్మారకం ఏర్పాటైంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు చెలరేగినప్పుడు, విపత్తులు చుట్టుముట్టినప్పుడు భారతీయ సైనికులు తిరుగులేని నిబద్ధతతో సేవలు అందించారు. పదిహేడో శతాబ్దంలోనే ప్రపంచ స్థూల ఆర్థికోత్పత్తిలో భారత్‌ 27శాతం వాటా కలిగి ఉంది. ఆర్థికంగా దుర్నిరీక్ష్య శక్తిగా ఉన్నప్పటికీ, భారత్‌ ఏనాడూ ఇతర దేశాలపై యుద్ధభేరి మోగించలేదు. ‘వసుధైవ కుటుంబకం’ అన్న సిద్ధాంతాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న సమాజం మనది. కాబట్టే దేశం ఎప్పుడూ శాంతియుత పంథాకే కట్టుబడింది. బ్రిటిష్‌ జమానాలోనూ భారతీయ జవాన్లు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో కీలకపాత్ర పోషించారు. అప్పట్లో దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఈ వైఖరిని సమర్థించాయి. అంతర్జాతీయ ప్రాంగణంలో బ్రిటిష్‌వారి తరఫున భారతీయ సైనికులు చేసిన త్యాగాల ఫలితంగానైనా స్వేచ్ఛాభారతి సత్వరం ఆవిష్కరమవుతుందని నాటి నాయకులు ఆశపడ్డారు. కానీ ఆంగ్లేయులు ఏ దశలోనూ భారతీయుల విజ్ఞప్తులను లక్ష్య పెట్టలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సేనావాహిని ఫ్రాన్స్‌, బెల్జియం, అరేబియా, ఉత్తర-తూర్పు ఆఫ్రికా, గల్లిపొలి, ఈజిప్ట్‌, మెసపటోమియా, పాలస్తీనా, పర్షియా, సలొనిక వంటి ప్రాంతాల్లో చురుగ్గా పాలుపంచుకొంది. 15 లక్షలమంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన నేపథ్యంలో నికరంగా ఎనిమిది లక్షలమంది భారతీయ జవాన్లు వివిధ దేశాల్లో తమ పోరాట పటిమను కనబరచారు. ఈ పోరాటంలో 47,746మంది జవాన్లు కన్నుమూయగా; 65వేల మంది గాయాలపాలయ్యారు. ఫ్రాన్స్‌లోని విల్లెర్స్‌-గిస్లెన్‌ పట్టణంలో 2018 నవంబరులో భారతీయ సైనికుల స్మారకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. స్వాతంత్య్రానంతరం ఫ్రాన్స్‌లో భారత్‌ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన యుద్ధవీరుల స్మారకమది. మనదేశంలోనూ ఏనాడో ఆ తరహా స్మారకం ఏర్పాటు చేసుకుని ఉండాల్సిందని ఆ క్షణంలో నాకు అనిపించింది. నిజానికి ఆరో దశకంలోనే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రతిపాదన వినిపించిన ఆరు దశాబ్దాల   తరవాతగానీ యుద్ధ వీరుల స్మారకాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ ప్రశంసార్హమైనది.

ప్రపంచ దేశాలన్నీ శాంతియుత సహజీవనం కోరుకుంటున్న దశ ఇది. సంప్రదాయ యుద్ధాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అయితే దారితప్పిన కొన్ని దేశాలు గడచిన మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ సంక్షోభాలకు అంటుకడుతున్నాయి. సీమాంతర ఉగ్రవాదం బారినపడి భారత్‌ దీర్ఘకాలంగా తీవ్ర మూల్యం చెల్లించుకుంటోంది. ముంబయిపై ఉగ్రమూకలు దాడికి పాల్పడటం, ఏకంగా భారత పార్లమెంటుపైనే టెర్రరిస్టులు పంజా విసరడం, జమ్ము-కశ్మీర్‌లో తరచూ ఉగ్రమూకలు చేస్తున్న వికటాట్టహాసం వంటివన్నీ దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఘటనలే. ఈ ఉన్మాద దాడులనుంచి దేశాన్ని కాపాడే క్రమంలో సైనికులతోపాటు పారా మిలిటరీ దళ సభ్యులూ వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దేశాన్ని ప్రాణ సమానంగా ప్రేమించిన వీరంతా జాతి కథానాయకులు. అందుకే వివిధ సందర్భాల్లో పిడికిళ్లు బిగించి, గుండెలనిండా ఉద్విగ్నత నిండగా భారత ప్రజలు ‘జై జవాన్‌- జై కిసాన్‌’ అని నినదిస్తుంటారు. భారతావనికి రేపటి రోజును పదిలంగా ఉంచే క్రమంలో మహోన్నత త్యాగాలకు సిద్ధపడిన వీరపుత్రులకోసం జాతీయ యుద్ధ స్మారకం నెలకొల్పడం భేషైన చర్య. విశిష్ట భారతీయ కళాకృతి, నమూనాలతో నిర్మితమైన ఈ స్మారకం 40 ఎకరాల్లో సువిశాలమై విస్తరించింది. మహాభారతంలో ప్రధాన యుద్ధతంత్రమైన ‘చక్రవ్యూహ’ పేరిట- అమర్‌ చక్ర, వీర్త చక్ర, త్యాగ్‌ చక్ర, రక్షక్‌ చక్ర అనే నాలుగు వలయాకారపు గోడలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశ రక్షణలోనూ, అంతర్జాతీయంగా వివిధ ఆపరేషన్లలోనూ అమరులైన జవాన్ల నామధేయాలను ఈ వలయాకారపు గోడలపై ఎంతో పద్ధతిగా చెక్కారు. జాతీయ యుద్ధ స్మారకం మధ్య భాగంలో ఎత్తయిన స్థూపం నిర్మించారు. దానికి అనుసంధానంగా సర్వకాల సర్వావస్థల్లో వెలుగులు విరజిమ్మే జ్యోతిని ఏర్పాటు చేశారు. వీర జవాన్ల త్యాగాలకు ఈ మహా జ్యోతి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అత్యున్నతమైన పరమ వీర చక్ర పురస్కారాలు అందుకున్న జవాన్ల విగ్రహాలనూ ఈ స్మారకంలో నెలకొల్పారు. జాతీయ యుద్ధ స్మారక సందర్శనాన్ని పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనంతో సమానంగా భావించి, ప్రజలంతా తరలివెళ్ళాలన్న ప్రధాని మోదీ సూచన అనుసరించదగినది. అమర జవానులే ఈ దేశానికి అసలు సిసలు కథానాయకులు. సమున్నత గౌరవాభిమానాలకు ఆ వీరులను మించి అర్హమైనవారెవరు? సైనికుల త్యాగాల వల్లే జాతి ఏకత, సమగ్రత పదిలంగా ఉన్నాయని గుర్తించడం ఎంత అవసరమో- భారతీయ సేనావాహిని నైతిక   స్థైర్యం ఏ దశలోనూ దెబ్బతినని పద్ధతిలో మసలుకోవడమూ అంతే కీలకం. దేశం తరవాతే ఏదైనా అన్న స్పృహ జాతి జనులందరిలోనూ పాదుకొనాలి.

కదలివస్తున్న ప్రపంచం
పుల్వామా పాశవిక దాడికి స్పందనగా భారత్‌ నిర్వహించింది ఉగ్ర మూకల స్థావరాలను ఏరివేసి, ప్రమాదాన్ని నివారించేందుకు తలపెట్టిన ముందస్తు దాడి మాత్రమే! ఉరుముతున్న ఉగ్రవాదం దిశగా ప్రపంచ దేశాల దృష్టిని మరల్చిన పరిణామమిది. దేశాలన్నీ ఒక్కతాటిపై నిలబడి ఉగ్రవాద విష భుజంగాల ఆటకట్టించాలన్న భారత విజ్ఞప్తికి ఇటీవలి ఐక్యరాజ్య సమితి సమావేశం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకే ‘సమితి’ తుది తీర్మానమూ రూపుదిద్దుకొంది. ప్రపంచానికే సవాలు విసరుతున్న ఉగ్రవాదుల ఆటకట్టించే క్రమంలో దేశాల ఉమ్మడి స్పందనకు సరైన సందర్భమిది. ఉగ్రవాదులకు నారూ నీరూ పోసి పెంచుతున్న దేశానికి చెందిన యుద్ధ     విమానాన్ని అత్యంత నేర్పుగా నేలకూల్చిన ‘అభినందన్‌’ నిజంగా అభినందనీయుడు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత్‌ అభిప్రాయాలు, చర్యలపై అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందించడం గణనీయమైన విషయం. దేశ ప్రజలు కంటినిండా ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఆటంకాలు లేని జాతి పురోభివృద్ధికి కారణమైన అమరవీరులను గుర్తుచేసుకుంటూ నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకం భారతావనికే గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సైనిక త్యాగాల స్మరణకోసం ప్రత్యేక సందర్భాలను ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికాలో మెమోరియల్‌ డే; ఆస్ట్రేలియా,   న్యూజిలాండ్‌ దేశాల్లో రిమెంబరెన్స్‌ డే, ఫ్రాన్స్‌లో ఆర్మిస్టైస్‌ డే పేరిట వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటారు. యుద్ధాల్లో అసువులు బాసిన     సైనికులతోపాటు పౌరుల త్యాగాలనూ గుర్తు చేసుకొనేందుకు ఇటలీలో ఎన్నో ప్రత్యేక సందర్భాలు ఏర్పాటయ్యాయి. జర్మనీ, మలేసియాలు సైతం వీర సైనికులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక దినాలను కేటాయించుకున్నాయి. సైనికుల ధైర్య సాహసాలను, దేశంకోసం వారు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకోవడమన్నది జాతి సంస్కృతిలో భాగం కావాలని; అందుకోసం ఏటా ఒక రోజును కేటాయించాలని భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్‌ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాణా చిన చేసిన సూచన ఎంతో విలువైనది. దేశ రాజకీయ నాయకత్వం దీనిపై సముచిత నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా దేశ రక్షణలో అసువులుబాసిన అమర జవాన్లకు హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. దేశాన్ని పదిలంగా కాచుకోవడంలో వీర సైనికుల సాహసోపేత పాత్రను ప్రజలంతా నిరంతరం స్మరించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను!

Back to top