బహుముఖ ప్రజ్ఞానిధి

03/06/2019
బహుముఖ ప్రజ్ఞానిధి

గడియారం రామకృష్ణ శర్మ శతజయంతి నేడు

గడియారం రామకృష్ణశర్మ కవి, పండితుడు, చరిత్రకారుడు, పరిశోధకుడు, పత్రికా రచయిత, సంఘ సంస్కర్త, నిజాం సంస్థాన విమోచన, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, గ్రంథాలయోద్యమకారుడు, సారస్వత పరిషదభ్యుదయ దోహదకారి, బహుభాషావేత్త... ఇలా చెప్పుకొంటూ పోతే ఆయన సాధించిన ఘనతకు లెక్కేలేదు. ఒక్క జీవితంలో అనేక జన్మల పర్యంతం సాధించదగిన విజయాలు సాధించినవారు, విద్యాభ్యాసం అయిదో తరగతి పూర్తిచేసి అలంపురంలో ఉర్దూ మాధ్యమంలో ఆరుతోనే ఆగినా ఇన్ని విజయాలు సాధించి అసాధారణ ప్రజ్ఞానిధిగా చరిత్రలో నిలిచిపోయిన ‘శతపత్రం’- గడియారం.

చిరుప్రాయం నుంచే క్రియాశీలత
రామకృష్ణశర్మ జన్మించింది 1919 మార్చి ఆరో తేది అనంతపురం జిల్లా కదిరి తాలూకా బాబాసాహెబ్‌ పల్లెలోనైనా, చిన్ననాడే నాటి పాలమూరు జిల్లా అలంపురం వచ్చి అక్కడే యావజ్జీవితం గడిపారు. అనేక రంగాల్లో అత్యంత క్రియాశీలంగా చేపట్టిన ప్రతీ కార్యానికి ఆయనకు తెలంగాణనే కేంద్రస్థానంగా నిలిచింది. చిన్ననాడే కుటుంబాన్నంతటిని పేదరికం పీడించినా, జీవికకోసం బాబాసాహెబ్‌ పల్లె, అక్కడ నుంచి కదిరి, శింగనమల అటునుంచి అలంపురం వచ్చి అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, చేపట్టిన కార్యాల్లో సఫలీకృతుడు కావడానికి రామకృష్ణశర్మకు పేదరికం ఏనాడూ అడ్డంకి కాలేదు.

చిన్ననాడు రామ నాటకంలో కుశుడి పాత్ర ధరించాడు. ఆ కళాభిరుచి మరింత వికసించి అనేక అద్భుతాలు సృష్టించింది. 1940లో ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి కార్యదర్శిగా ఉజ్వలంగా నడిపారు. ఋష్యేంద్రమణి వంటి ప్రముఖ సినీ నటీమణులు నాయికలుగా, తాను నాయకుడుగా అనేక నాటకాలు ప్రదర్శించారు. గంభీరమైన స్వరం, మృదుమధురంగా పద్యాలు, సంభాషణలు పలికే నైపుణ్యంగల గడియారం- హరిశ్చంద్ర, శ్రీకృష్ణతులాభారం, చింతామణి వంటి అనేక నాటకాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. ఆ రోజుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఆయన ఒకరు.

పద్దెనిమిదేళ్ల వయసులో స్వతంత్ర కావ్య రచనకు పూనుకోవడం ఒక సాహసం. అదీ ఉర్దూ మాధ్యమంలో ఆరో తరగతి సైతం పూర్తిచేయని యువకుడి సాహసం. కృష్ణా జిల్లాలో చిరివాడ అనే గ్రామంలో ఉన్న చెళ్ళపిళ్ళ వారి శిష్యుడు గొప్ప పండితుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద ఆశ్రయం సంపాదించారు. గురుకుల పద్ధతిలో శుశ్రూష చేసి ఆయన మెప్పు పొందారు. సంస్కృతంలో శాస్త్ర విద్య అధ్యయనం చేశారు. ధర్మశాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు. ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, హిందీ, ఆంగ్లభాషల్లో సముచిత పాండిత్యాన్ని సముపార్జించారు. ఆయా భాషల అధ్యయనం వల్లే చారిత్రక రచనలు, శాసన పరిశోధన, సంపుటీకరణ మొదలైన సమస్త వాఙ్మయ సృష్టి చేయగలిగారు. 1943లో శర్మ జీవితంలో అనేక ముఖ్య ఘటనలు జరిగాయి. వితంతు పునర్వివాహాలు, అణగారిన వర్గాలతో సహపంక్తి భోజనాలు, మూఢవిశ్వాసాల వ్యతిరేక ప్రచారం, నిజాం వ్యతిరేక పోరాటంలో భాగంగా సాగిన ఆంధ్ర మహాసభల్లో ముఖ్య పాత్ర, ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో ప్రధాన పాత్ర వంటివి ఉన్నాయి. తన బావ దాయాది రామసుబ్బయ్య మేనకోడలు కమలకు ఎనిమిదో ఏట పెండ్లి జరిగి 10 ఏళ్ళకే భర్త చనిపోయాడు. ఆమెకు పునర్వివాహం జరగాలని రామకృష్ణశర్మ వాదించారు. నీవైతే చేసుకుంటావా అన్న వాదం రావడంతో చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసి తల్లిని, ఇతరులను ఒప్పించి తొలి వితంతు పునర్వివాహం తానే చేసుకున్నారు. అలాంటివి ఎన్నో తన చేతుల మీదుగా జరిపించారు. పెద్దల సలహాతో రాజకీయ కార్యకలాపాల్లో ప్రవేశించారు. తెలుగువారి కోసం ఏర్పాటైన ఆంధ్ర జనసంఘం అలంపూరు శాఖ కార్యదర్శిగా 22 ఏళ్ళ వయసులో ఆయన ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. వరంగల్‌ జిల్లా ధర్మవరంలో 1942లో నవమాంధ్ర మహాసభల నాటికే ఉద్యమకారుల్లో చీలిక ఏర్పడింది. రాజకీయ కార్యకలాపాలకు ప్రాధాన్యమిచ్చి భాషా సాంస్కృతికాంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సురవరం ప్రతాపరెడ్డి నేతృత్వంలోని అభివృద్ధి పక్షం ‘నిజాము రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ను ఏర్పాటు చేసింది. పరిషత్తు స్థాపక సభ్యుల్లో గడియారం ఒకరు. అలంపూరులో ఆయన కార్యదర్శిగా పరిషత్తు శాఖను ఏర్పాటు చేశారు. ఆపై సుమారు 50 ఏళ్లపాటు గడియారం పరిషత్తుకు అంకితమై ప్రచార కార్యదర్శి, పరీక్షా కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. స్టేట్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా గడియారం నిజాం విముక్తి పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. గ్రంథాలయోద్యమంలో పాలుపంచుకున్నారు. ఉద్యమ ప్రచారానికి భాగ్యనగర్‌ రేడియో నడిపారు. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం నుంచి సంస్థానం విముక్తమైంది. సెప్టెంబర్‌ 21న మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. రామకృష్ణశర్మ తాలూకా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, మిలిటరీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. చాలా మంది రజాకారులను అరెస్టు చేయించారు. రజాకారులకు మద్దతిచ్చేవారి ఆగడాలను అరికట్టారు.

సాహిత్యోపాసకుడు

సాహిత్యంలోనూ గడియారం విశేష కృషి సల్పారు. ‘వీరగాథలు’ బాలసాహిత్యం, ‘తెలుగు సిరి’ వ్యాసావళి, ‘దశరూపకసారము’ ‘నాటక లక్షణాలు’, ‘పంజాబీ సాహిత్య చరిత్ర’, ‘పాంచజన్యము’ కవితా సంపుటి వాటిలో ఉన్నాయి. ‘కన్నడ సాహిత్య సౌరభము’, ‘కన్నడ సాహిత్య చరిత్ర, ‘అలంపూరు శిథిలములు’, ‘అలంపూరు చరిత్ర’ కొన్ని ఆణిముత్యాలు. ‘దక్షిణకాశి అలంపుర క్షేత్రము’, ‘దక్షిణవారణాసి’, ‘శ్రీ బీచుపల్లి క్షేత్రము’, ‘అనిమెల సంగమేశ్వరస్వామి చరిత్ర,’ ‘శ్రీ జోగులాంబ మహాశక్తి’ వంటి క్షేత్ర రచనలు, ‘భారతదేశ చరిత్ర’, ‘ప్రపంచ రాజ్యాలు’, ‘శ్రీ నిత్యానందస్వామి చరిత్ర’, ‘శ్రీ మాధవ విద్యారణ్య స్వామి చరిత్ర’ వంటి చరిత్ర గ్రంథాలు రచించారు.

ఆధునిక భావజాలవాది
గడియారం ఎంత ప్రాచీనుడో అంత ఆధునికుడు. ఎంతటి సంప్రదాయానురక్తుడో అంతటి అభ్యుదయవాది. ఆయన జీవితంలోని సంఘటనలు ఈ విషయాలను తేటతెల్లం చేస్తాయి. దక్షిణ కాశీగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా అలరారుతున్న అలంపురం క్షేత్రాభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమైంది. తెలుగు చరిత్రకు, సంస్కృతికి సంబంధించిన ఆ ప్రాంతపు అవశేషాలతో ఒక మ్యూజియం ఏర్పాటుకు ఆయన చేసిన పరిశ్రమ ఫలించి 1952 ఆగస్టు 16న అది ప్రారంభమైంది. శాసన పరిశోధన, ప్రాచీన గ్రంథ పరిష్కరణ ఇతర చారిత్రక క్షేత్ర      మాహాత్మ్య గ్రంథాలు, అనువాదాలు మొదలైన ఎన్నో   రచనలు చేశారు. మంచెన ‘కేయూరబాహు చరిత్రము’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ గ్రంథాలను పరిష్కరించారు. శాసన పరిశోధన ఫలితంగా విక్రమాదిత్యుని ఆమిదేలపాడు తామ్ర శాసనం, వినయాదిత్యుని పల్లెపాడు తామ్ర శాసనాలను వెలుగులోకి తెచ్చారు. 85 తెలంగాణ శాసనాలతో రెండో సంపుటం తీసుకొచ్చారు. ‘సుజాత’ పత్రికను వ్యయప్రయాసలకోర్చి నడిపారు.

గడియారం ముఖ్యపాత్ర నిర్వహించని రంగమే లేదంటే అతిశయోక్తికాదు. ఒక్క మాటలో చెప్పాలంటే- తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన కృషీవలుడాయన. ఆయనకు అనేక సత్కారాలు, పురస్కారాలు లభించాయి. 1970లో గదాయుద్ధ నాటకం కన్నడ నుంచి తెలుగు అనువాదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనువాద పురస్కారం, 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, గౌరవ డాక్టరేటు, సురవరం ప్రతాపరెడ్డి వైజయంతి ట్రస్టు నుంచి సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం, వారి ‘శతపత్రము’ ఆత్మకథకు మరణానంతరం 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంటి గౌరవాలు లభించాయి. సాఫల్య, సార్థక్య జీవనులైన గడియారం తమ 87వ ఏట 2006 జులై 25న నిర్యాణం చెందారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన జీవితం తెలుగువారికి స్ఫూర్తిదాయకం!

Back to top