ఆరు సూత్రాల స్నేహబంధం

03/07/2019
ఆరు సూత్రాల స్నేహబంధం

భారత్‌తో ముస్లిం దేశాల సఖ్యత

భారత విదేశాంగ విధానంలో ఇటీవల కొన్ని గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌లో జైష్‌ స్థావరంపై భారత క్షిపణి దాడులపై జాతి దృష్టి కేంద్రీకృతమైన సమయంలోనే ఓ ప్రధాన అంతర్జాతీయ వేదికపై భారత్‌ దౌత్యపరంగా పెద్ద విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) 46వ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరుకావలసిందిగా భారత్‌కు కనీవినీ ఎరుగని రీతిలో ఆహ్వానం అందింది. పుల్వామా ఉగ్రదాడితో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సమయంలోనూ ఈ ఆహ్వానం అందడం సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. అబూదాబీ భారత్‌కు ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్‌ ఓఐసీ సమావేశాన్ని బహిష్కరించింది. అయినా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఇండొనేసియా తదితర ముస్లిం దేశాలు పాక్‌ అభ్యంతరాన్ని ఖాతరు చేయకుండా భారత్‌కు స్వాగతం పలికాయి. అంతర్జాతీయంగా భారత్‌కు గౌరవమన్ననలు పెరుగుతున్నాయని ఇది నిరూపిస్తోంది.

మారిన వైఖరి
ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆశ్రయం అందిస్తున్న దేశాల ఆటకట్టించడానికి భారత్‌, ఓఐసీ చేయీచేయీ కలపాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ అంతర్జాతీయ వేదిక నుంచి పిలుపిచ్చారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలు మతాన్ని దుర్వినియోగం చేస్తూ, మత వక్రీకరణలతో విజయం సాధించగలమని విర్రవీగుతున్నాయనీ ఆమె అన్నారు. ఉగ్రవాదంపై పోరాటమంటే మతం మీద యుద్ధం కాదని వివరణ ఇచ్చారు. మత ప్రబోధాలు, ఉగ్రవాదులప్రచారాలూ ఒకటి కావని ఉద్ఘాటించారు. భిన్నత్వంలో ఏకత్వానికి, మతవైవిధ్యానికి భారత్‌ ప్రతీక అని, ఇక్కడి 130 కోట్ల భారతీయుల్లో 18.5 కోట్ల మంది ముస్లిములేనని గుర్తు చేశారు. భారతీయ ముస్లిం సోదరసోదరీమణులు దేశ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనాలన్నారు. అన్ని మతాలసారం ఒక్కటేనంటూ భారత్‌, ఓఐసీల మధ్య సహకారానికి ఆరు సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు. అన్ని మతాల పరమార్థాన్ని, దివ్య సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేయడం అందులో మొదటిది. అన్ని మతాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడం రెండోది. విద్వేష భావజాలాన్ని సామరస్య సందేశంతో నిర్వీర్యం చేయడం మూడోది. తీవ్రవాదంకన్నా ఉదారవాదం... ఏకాకిత్వం కన్నా అందర్నీ కలుపుకొనిపోయే తత్వం మిన్న అని చాటడం నాలుగో సూత్రం. యువతను వినాశం వైపు కాకుండా సేవాపథంలో నడిపించడం అయిదోది కాగా, భిన్న సంస్కృతులు, మతాల మధ్య అడ్డుగోడలు ఛేదించి అవగాహనా వారథులు నిర్మించడం చివరిదైన ఆరో కార్యాచరణ సూత్రం.

భారత్‌, ఓఐసీల మధ్య సంబంధాలు పటిష్ఠం కావడం ఎంతో సానుకూల పరిణామం. భారత్‌ వాణి అన్ని అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించినా- ఓఐసీ వేదికపై మన గళం ప్రతిధ్వనించడం ఇదే ప్రథమం. 1969లో ఓఐసీ ఆవిర్భవించింది. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన దేశాలకు ఓఐసీలో సభ్యత్వం ఉంది. ఐక్యరాజ్య సమితి తరవాత అంతటి అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ ఓఐసీయే. నాలుగు ఖండాల్లో వ్యాపించిన ఈ సంఘం రాజకీయ, ఆర్థిక, సామాజిక వైవిధ్యానికి కూడలిగా నిలుస్తోంది. 10 రాచరికాలు, 47 గణతంత్ర రాజ్యాలతో రాజకీయ వైవిధ్యం కనబరుస్తోంది. ఆఫ్రికాలో విఫలరాజ్యంగా ముద్రపడిన సోమాలియా మొదలుకొని రాచరిక వ్యవస్థ అయిన సౌదీ అరేబియా, ప్రజాస్వామ్యమైన ఇండొనేసియా వరకు విభిన్న దేశాలు ఓఐసీలో సభ్యులు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ఆర్థిక వ్యవస్థ స్వభావం ఆధారంగా ఓఐసీ సభ్య దేశాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి- తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు, ఇంధనం ఎగుమతి చేసే దేశాలు, మధ్యాదాయ దేశాలు. ఈ దేశాల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా వ్యత్యాసాలూ ఉన్నాయి. అవి తమ తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడచుకొంటాయి. ఓఐసీలో కొన్ని దేశాలకు భారత్‌కు దగ్గర కావడం నచ్చకపోయినా, ఇతర దేశాలు భారత్‌తో సంబంధాలను పటిష్ఠ పరచుకోవడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. ఇలాంటి భేదాభిప్రాయాల వల్ల మొదట్లో భారత్‌- ఓఐసీ సంబంధాలు కాస్త అటుఇటుగా ఉండేవి. 1969లో ఓఐసీ ఏర్పడినప్పుడు మొరాకో రాజధాని రబాత్‌లో జరిగిన ప్లీనరీ సమావేశానికి భారత్‌ను ఆహ్వానించారు. కానీ, ఆ రోజుల్లో అహ్మదాబాద్‌లో జరిగిన అల్లర్లను ఉటంకిస్తూ అప్పటి పాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ యాహ్యాఖాన్‌ భారత్‌ను ఓఐసీకి ఆహ్వానించడాన్ని నిరసించారు. దాంతో భారత్‌ను రావద్దని చెప్పేశారు. 2019 వచ్చేసరికి వ్యవహారం తారుమారైంది. ఈసారి భారత్‌ ఓఐసీ సమావేశంలో పాల్గొనగా, పాకిస్థాన్‌ గైర్హాజరు అయింది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి పశ్చిమాసియా దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి అమిత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. పశ్చిమాసియాలో తాను పర్యటించి, అక్కడి దేశాధినేతలను భారత్‌కు ఆహ్వానించారు. సౌదీ అరేబియా-ఇరాన్‌, ఇజ్రాయెల్‌-ఇరాన్‌, ఖతార్‌-యూఏఈల మధ్య వైరాలు, పొరపొచ్చాలున్నా అందరితో స్నేహం చేశారు. అంతమాత్రాన ఓఐసీతో మైత్రి నల్లేరుపై నడక అని భ్రమించరాదు. ఇందులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు కశ్మీర్‌పై ఉభయులవి పరస్పర విరుద్ధ దృక్పథాలు. ఓఐసీ మతపరమైన దృష్టి కోణం నుంచి మాత్రమే కశ్మీర్‌ సమస్యను పరికిస్తోందే తప్ప, అందులోని సంక్లిష్టతలను అర్థం చేసుకోవడం లేదని భారత్‌ భావిస్తోంది. అదే సమయంలో భేదాభిప్రాయాలను సంప్రతింపులతో పరిష్కరించుకోవచ్చని నమ్ముతోంది.

బలమైన ఆర్థిక బంధం

భారత ఆర్థిక వ్యవస్థకు, ఇంధన భద్రతకు పశ్చిమాసియా చాలా కీలకమైనది. భారతదేశ ఇంధన అవసరాల్లో 60 శాతం పశ్చిమాసియా తీరుస్తుండగా, అక్కడ పనిచేస్తున్న 70 లక్షల మంది భారతీయులు స్వదేశానికి పంపే విదేశ మారక ద్రవ్యం మనకు ఎంతో అక్కరకొస్తోంది. మహారాష్ట్రలోని రత్నగిరిలో పెట్రోకెమికల్‌ రిఫైనరీ నిర్మాణానికి సౌదీ అరేబియా, అబూదాబీ జాతీయ చమురు సంస్థలు 4,400 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నాయి. ఇరాన్‌లో చాబహార్‌ రేవు నిర్మాణానికి భారత్‌ భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ రేవు ఇరాన్‌, భారత్‌, అఫ్గానిస్థాన్‌, మధ్యాసియా రిపబ్లిక్‌ల మధ్య వ్యాపారాన్ని పెంచుతుంది. నిరుడు ఒమన్‌లో దుక్మ్‌ రేవును భారత్‌ వినియోగించుకోవడానికి అంగీకారం కుదిరింది. అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం సంచార పరిధి విస్తరిస్తుంది.

ఉగ్రవాదంపై స్పష్టత
రబాత్‌లో 46వ ఓఐసీ సమావేశం జరగడానికి ముందు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌ను సందర్శించారు. 2017లో భారత గణతంత్ర దినోత్సవ కవాతులో యూఏఈ యువరాజు మహమ్మద్‌ బిన్‌ జయాద్‌ అల్‌ నహ్యాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సల్మాన్‌ సందర్శన సమయంలో భారత్‌, సౌదీలు ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలన్న కృత నిశ్చయం ప్రదర్శించాయి. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా చేపట్టడాన్ని కొన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధానికి అవసరమైన ఒప్పందాన్ని త్వరగా చేపట్టవలసిందిగా ఐక్యరాజ్య సమితిని కోరాలని తీర్మానించాయి. చాలాకాలం నుంచి పశ్చిమాసియా మతపరమైన తీవ్రవాద భావజాలానికి, ఉగ్రవాద తండాలకు నెలవుగా మారింది. మొదట్లో ఇక్కడి దేశాలు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఇతర విధాల అండదండలు అందించినా, కాలక్రమంలో ఆ సంస్థలు తమకు పాలు పోసిన హస్తాలనే కాటేశాయి. నేడు సౌదీ, ఇరాన్‌ కూటములు వేర్వేరు ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ పరోక్ష పోరు సాగిస్తున్నాయి. రెండు కూటములతో మంచి సంబంధాలున్న భారతదేశం పశ్చిమాసియాలో సయోధ్యకు తనవంతు పాత్ర పోషించగల స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం చైనాకు కష్టమవుతుంది. పాకిస్థాన్‌ ఓఐసీ సమావేశాన్ని బహిష్కరించినా భారత్‌కు గౌరవమర్యాదలతో స్వాగతం లభించడం చూస్తే- ఇస్లామిక్‌ దేశాలు దిల్లీతో సన్నిహిత సంబంధాలు నెరపడానికే కట్టుబడి ఉన్నట్లు గోచరిస్తోంది. ఇది విశేష పరిణామం. ఇస్లాం పేరు చెప్పుకొని సంకుచిత స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్న పాకిస్థాన్‌ నిజ స్వరూపం ఓఐసీలో బట్టబయలైంది. అయితే ఓఐసీలో భారత్‌కు పరిశీలక హోదా ఇవ్వాలనుకున్నా, పాకిస్థాన్‌ వ్యతిరేకతతో అది ముందుకు సాగడం లేదు. కానీ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ముస్లిం జనాభా కలిగి, భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తూ ఆర్థికంగా దూసుకెళుతున్న భారతదేశాన్ని ఓఐసీ దూరం చేసుకోజాలదు. పాక్‌ స్వప్రయోజనాల కోసం యావత్‌ ఇస్లామిక్‌ ప్రపంచ ప్రయోజనాలను విడనాడలేదు.

కశ్మీర్‌ సమస్యపై ఓఐసీ భిన్నాభిప్రాయం వ్యక్తీకరించినా ఇతర అంశాల్లో కలిసి నడవడానికి భారత్‌ సిద్ధంగా ఉంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నిస్తున్న సమయంలో ఓఐసీని వ్యతిరేకం చేసుకోవడం మంచిది కాదని దిల్లీకి తెలుసు. అలాగని శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ అభ్యర్థిత్వాన్ని ఓఐసీ సమర్థిస్తుందని కాదు. సాటి ఈజిప్ట్‌ లేక మరేదైనా ఇస్లామిక్‌ దేశం అభ్యర్థిత్వాన్ని ఓఐసీ ప్రోత్సహించవచ్చు. అయినా సమితిలో 57 ఓఐసీ దేశాలు సభ్యులుగా ఉన్న దృష్ట్యా వాటిని ప్రసన్నం చేసుకునే యత్నాలను భారత్‌ కొనసాగిస్తూనే ఉంటుంది. అదలా ఉంచితే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం ఓఐసీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. గణనీయ ముస్లిం జనాభా కలిగిన భారత్‌ ఇందుకు అన్ని విధాలా అర్హురాలు. ఓఐసీ భారత్‌ను స్వీకరిస్తే బహుళత్వానికి గొప్ప గుర్తింపు లభించినట్లవుతుంది. ఓఐసీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటే పాక్‌ దుష్ప్రచారాన్ని అడ్డుకోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ సాధనకు ఓఐసీ మద్దతు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆలోగా ఓఐసీలో పరిశీలక హోదా లభిస్తే భారత్‌కు మరింత అండ లభిస్తుంది. కాబట్టి పాక్‌ కుయుక్తులు ఎలా ఉన్నా ఓఐసీతో మైత్రీబంధాన్ని పటిష్ఠపరచుకోవడానికి భారత్‌ కృషి చేస్తూనే ఉండాలి!

Back to top