కేంద్ర కొలువులపై అశ్రద్ధ

03/08/2019
కేంద్ర కొలువులపై అశ్రద్ధ 

దృష్టి సారించని తెలుగు రాష్ట్రాల యువత

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు యువకుల ప్రాతినిధ్యం కొరవడుతోంది. రైల్వే, బ్యాంకింగ్‌, జీవితబీమా తదితర ఉద్యోగాల్లో తెలుగువారు చెప్పుకోదగిన స్థాయిలో లేరు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి వృత్తివిద్యా కోర్సులపైనే వీరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఉంటాయి. వీటిని ఏటా భర్తీ చేస్తుంటారు. తాజాగా 1.31 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివినవారు వీటికి అర్హులు. రైల్వే ఉద్యోగాల్లో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం మూడు శాతంలోపే ఉంది. దక్షిణ మధ్య రైల్వేను మినహాయిస్తే మిగిలిన జోన్లలో వీరి ప్రాతినిధ్యం చాలా తక్కువ.

వేలల్లో నియామకాలు 
దాదాపుగా ఏ నిరుద్యోగిని అడిగినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలనే సమాధానం చెబుతారు. మంచి వేతనాలు, దేశంలో ఎక్కడైనా పనిచేసే సౌలభ్యం, సకాలంలో కరవుభత్యం, వేతనాల పెంపుదల, ప్రయాణ భత్యం, పింఛన్‌, ఆరోగ్య సేవలు తదితర సౌకర్యాలు ఉంటాయన్న నమ్మకమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో రైల్వేతోపాటు బ్యాంకులు, ఆదాయ పన్ను, భారత ఆహార సంస్థ, జీవిత బీమా సంస్థ, ఇంధన సంస్థలు, రక్షణ, పోస్టల్‌ శాఖల ఉద్యోగాల కోసం ఏటా వేల సంఖ్యలో నియామక ప్రకటనలు విడుదలవుతుంటాయి. ఈ ఉద్యోగాల సాధనలో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలూ ముందంజలో ఉన్నాయి. ఏటా జరిగే సైనిక నియామకాల్లో పాల్గొనే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తక్కువగా ఉంటున్నారు. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో పనిచేసే తెలుగు ఉద్యోగుల సంఖ్య మరీ తక్కువ. బ్యాంకుల్లో అయిదు శాతమే తెలుగువారున్నట్లు అంచనా. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారిలో ఉత్తరాదివారే ఎక్కువ. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే తెలుగువారి సంఖ్య తక్కువ. పలు శాఖల్లో తెలుగువారి జాడే ఉండదు. భాషా సమస్య ఇందుకు కొంతవరకు కారణమన్న అభిప్రాయం ఉంది. దేశవ్యాప్తంగా గల 4,443 ఐఏఎస్‌ అధికారుల్లో 15 శాతం అంటే 671 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారే. 419 మందితో బిహార్‌, 290 మందితో తమిళనాడు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన   ఐఏఎస్‌లు 269 మంది ఉన్నారు. ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి సర్వీసుల్లోనూ వీరి ప్రాతినిధ్యం పరిమితంగానే ఉంది.

కేంద్ర ప్రభుత్వ నియామకాలు హిందీ, ఆంగ్ల భాషల్లో జరుగుతుంటాయి. హిందీపై పట్టు వల్ల ఉత్తరాది రాష్ట్రాలవారు, ఆంగ్లంలో నైపుణ్యం కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల వారు ఎక్కువగా ఈ ఉద్యోగాలను సాధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ  అభ్యర్థులకు శిక్షణ సౌకర్యాలను కల్పించడంలో ముందున్నాయి. నిపుణులైనవారితో  శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తమిళనాడు వంటిచోట ఇంజినీరింగు కోర్సులు, ఐటీ రంగంపై మోజు తక్కువ. విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సులనే ఎక్కువగా అభ్యసిస్తున్నారు. వారు స్వరాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారు. రైల్వే నియామకాలు ఎక్కడ జరిగినా బిహార్‌, యూపీ, ఒడిశా, తమిళనాడు నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం ఈ రాష్ట్రాల అభ్యర్థులకు వరంగా మారింది. బిహార్‌, యూపీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం ఇలాంటి కేంద్రాలను నడుపుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోటీ పరీక్షల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసింది. పంజాబ్‌, రాజస్థాన్‌ల నుంచి ఎక్కువమంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయి.

కొన్నేళ్లుగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే శిక్షణ సంస్థల నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు యువకులు ఎంపికవుతుండటం ఆశావహ పరిణామం. బిహార్‌, తమిళనాడులతో పోలిస్తే తెలుగువారి సంఖ్య తక్కువే. ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో పేదలకు శిక్షణ అందుబాటులో లేదు. లక్షల రూపాయల్లో రుసుములు చెల్లించలేక ప్రతిభావంతులైన విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక లేదు. ఇంజినీరింగు, మెడిసిన్‌ వంటి వృత్తివిద్యా కోర్సులు చేసి మంచి వేతనాలు సాధించాలనే తపన ఎక్కువమంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉంది. మరికొంత మంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని, అక్కడే స్థిరపడాలని ఆశిస్తున్నారు. మరోవైపు శిక్షణ సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేవు. ‘స్టడీ సర్కిళ్ల’ పేరిట శిక్షణ కేంద్రాలను ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో స్టడీ సర్కిళ్లు రాజధానుల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్ల కంటే ప్రైవేటు స్టడీ సర్కిళ్లే కొంతమేరకు ఫలితాలు సాధిస్తున్నాయి.

కొరవడిన దిశానిర్దేశం 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు రాయడానికి తెలుగు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దక్షిణమధ్య రైల్వే జోన్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇతర జోన్ల పరిధిలో నియామకాలు జరుగుతున్నా అక్కడికి వెళ్లడం లేదు. బ్యాంకుల్లోనూ తెలుగు రాష్ట్రాల పరిధిలోనే పోటీ పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందేందుకు యత్నించడం లేదు. సైన్యంలో చేరేందుకు అపార అవకాశాలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. సైన్యంలో చేరడానికి వస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పటికే సుమారు పాతిక లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంజినీరింగు, ఇతర విద్యాసంస్థల ద్వారా ఏటా లక్ష మందికి పైగా నిరుద్యోగులు తయారవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగే ఉద్యోగ నియామకాలు పరిమితంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దయెత్తున ఉన్నందువల్ల యువతకు వాటిల్లో అవకాశాల కల్పనకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో నడుస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినవే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించాలి. తమిళనాడులో ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఐఏఎస్‌లు అభ్యర్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. విద్యాసంస్థల్లో, శిక్షణ కేంద్రాల్లో గ్రంథాలయాల సౌకర్యాలను విస్తరించాలి. పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులోకి తేవడం యువతకు ఉపకరిస్తుంది. ప్రస్తుతం పోటీ ప్రపంచ తీరుతెన్నులను, వివిధ విభాగాల్లోగల ఉద్యోగావకాశాలను విద్యార్థులకు  తెలియజేయాలి. ఆ మేరకు వారిలో ఆసక్తి పెంపొందించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సరైన మార్గనిర్దేశం ఉంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించగలరు!

Back to top