అంతరాలకు అంతమెన్నడు?

03/09/2019
అంతరాలకు అంతమెన్నడు? 

స్త్రీ-పురుష సమానత్వంలో దేశం వెనకంజ

జనాభాలో సుమారు సగ భాగాన్ని గాలికొదిలేసి, జాతిని సుస్థిరాభివృద్ధి బాట పట్టించగలమని ఎవరైనా భావిస్తే అంతకుమించిన అమాయకత్వం ఉండదు. మహిళాభివృద్ధితో నిమిత్తంలేని జాతి పురోగతి సాధ్యం కాదు. స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించి; మహిళల, బాలికల హక్కులకు భరోసా కల్పించినప్పుడే 2030నాటికి సాధించదలచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాకారమవుతాయి. మహిళా హక్కులకోసం పోరాటాలు చేసి, వారి తరఫున ఉద్యమశంఖం పూరించిన మహిళామణులకు దేశంలో కొదవలేదు. భిన్న రంగాల్లో మహిళాలోకం తమదైన ముద్ర చాటుతూ ముందుకు వస్తున్న తరుణమిది. ఆర్థిక, వాణిజ్య, రక్షణ, ఎయిర్‌లైన్స్‌, విద్యతోపాటు రాజకీయాలు, సాహిత్యం, కళలు, సంగీతం వంటి రంగాల్లోనూ స్త్రీజాతి విలక్షణ ప్రతిభ కనబరుస్తోంది.

సవాళ్లను అధిగమిస్తూ... 
దేశ స్వాతంత్య్రానంతరం మహిళాభివృద్ధికి సంబంధించి కొంత పురోగతి కనిపిస్తున్న మాట వాస్తవమే. ఉదాహరణకు 18 ఏళ్లలోపే పెళ్ళి చేసుకున్న 20-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల సంఖ్య 2005-06లో 47 శాతం ఉంటే- 2015-16నాటికి అది 27 శాతానికి తగ్గిపోయింది. బ్యాంకు లేదా పొదుపు ఖాతా ఉన్న మహిళల సంఖ్య ఈ కాలంలో 15 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. అక్షరాస్య స్త్రీల సంఖ్య 55 శాతంనుంచి 68 శాతానికి చేరింది. కొన్ని అంశాల్లో చెప్పుకోదగిన పురోగతి కనిపిస్తున్నా- అసమానతల నిర్మూలనకు సంబంధించి ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు స్త్రీ పురుష సమానతా సాధనలో భారత్‌ ముందున్న సమస్యలు, సవాళ్లను పరిశీలిస్తే అనేక విషయాలు బయటపడతాయి. ‘ప్రపంచ ఆర్థిక ఫోరం-2018’ విడుదల చేసిన 149 దేశాల స్త్రీ పురుష సమానతా సూచీలో భారత్‌ 108వ స్థానంలో ఉంది. ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, నికరాగువా, రువాండాలు ఈ జాబితాలో తొలి ఆరు స్థానాలు దక్కించుకున్నాయి. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళా భాగస్వామ్యం, అవకాశాల కల్పనలో 142; ఆరోగ్య పరిరక్షణ విషయంలో భారత్‌ 147వ స్థానంలో ఉంది. మరోవంక రాజకీయ సాధికారత సాధనలో భారత్‌ 19వ స్థానంలో నిలవడం విశేషం. స్త్రీ పురుష సమానతా సూచీలో భారత్‌ కంటే దిగువన జపాన్‌ 110వ స్థానంలో నిలవడం గమనార్హం. కార్మిక రంగ కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం నామమాత్రంగా ఉండటం, రాజకీయ సాధికారత సాధనలో వెనకబాటు కారణంగానే భారత్‌ కంటే జపాన్‌ దిగువ స్థానంలో నిలుస్తోంది. అయితే ఉద్యోగ, ఉపాధి, కార్మిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్‌ సైతం అట్టడుగునే కొట్టుమిట్టాడుతుండటం గమనార్హం.

కార్మిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడం ద్వారా 2025నాటికి స్థూల దేశీయోత్పత్తికి 77 వేలకోట్ల డాలర్లను భారత్‌ అదనంగా జతపరచే అవకాశాలున్నాయని మెకిన్సే నివేదిక ఇటీవల అభిప్రాయపడింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలకు చురుకైన పాత్ర కల్పించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కిచెప్పింది. అందుకుగాను ఆ నివేదిక రెండు మార్గాలను సూచించింది. డిజిటల్‌ సాంకేతికత వినియోగం, బ్యాంకింగ్‌ సదుపాయాలను స్త్రీలకు మరింత చేరువ చేయాలన్నది మెకిన్సే నివేదికలోని మొదటి సూచన. మొబైల్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాలం ద్వారా నగదు లావాదేవీల నిర్వహణ, వాణిజ్య అవకాశాలను వెలికితీయడం వంటివాటికి సంబంధించి మహిళలకు చైతన్యం కల్పించడం ద్వారా జాతి ఆర్థిక ప్రస్థానంలో వారి పాత్ర ఇనుమడిస్తుందని నివేదిక సూచించింది. మహిళలు చేస్తున్న పని విలువ లేనిదిగా మిగిలిపోతున్న స్థితిని మార్చాలని ‘మెకిన్సే’ ప్రతిపాదించింది. నాలుగింట మూడొంతుల మహిళల శ్రమ ఇంటి, వంట పనుల్లోనే వృథా పోతోంది. వారి సమయమంతా ఈ పనుల్లోనే గడిచిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అవి, పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండటం, శుభ్రమైన మంచినీరు అందుబాటులో లేకపోవడం, నాణ్యమైన వంటచెరకు చేరువలో లేకపోవడం. ఈ పరిస్థితి మారాలి. స్వచ్ఛ భారత్‌, ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన, గ్రామ జ్యోతి యోజన కింద విద్యుత్‌ కనెక్షన్లను విరివిగా ఇవ్వడం వంటి వాటి ద్వారా మౌలిక సౌకర్యాలను మెరుగుపరచి ఇంటి, వంట పనులకు మహిళలు కేటాయించే సమయాన్ని తగ్గించే చర్యలు కొంతమేరకు పట్టాలకు ఎక్కినప్పటికీ- ఆ వేగం మరింత పెరగాల్సి ఉంది. భారత మానవాభివృద్ధి సర్వేల ఆధారంగా సౌమ్య ధన్‌రాజ్‌, విద్యా మహాంబ్రేలు నిర్వహించిన అధ్యయనం ఆసక్తికర విశేషాలను బయటపెట్టింది. ఉమ్మడి కుటుంబాల్లోని గ్రామీణ మహిళలు వ్యవసాయేతర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్పంచుకోలేకపోతున్నట్లు వారి అధ్యయనం వెల్లడించింది. ఉమ్మడి కుటుంబాల్లోని కట్టుబాట్లు, పరిమితుల కారణంగా మహిళలు సేద్య కార్యకలాపాలకు మించి తమ పరిధిని విస్తరించుకోలేకపోతున్నారని- ఈ విషయంలో చిన్న కుటుంబాల్లోని మహిళలు మెరుగ్గా రాణిస్తున్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో సగటున 34 శాతం గ్రామీణ మహిళలు ఉమ్మడి కుటుంబాల్లోనే జీవిస్తున్నారు. 

నీతి ఆయోగ్‌ అష్ట సూత్రాలు

1. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని చట్టాలు, విధాన నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలి. 
2. మహిళలపట్ల దుర్విచక్షణకు అంతం పలికేందుకు వీలుగా చట్టబద్ధమైన ఏర్పాట్లను పటుతరం చేయాలి 
3. వివిధ రంగాల్లో స్త్రీ-పురుష అసమానతలకు సంబంధించిన నిర్దిష్ట గణాంకాలను సేకరించి రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించాలి 
4. పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో మహిళలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి 
5. స్థిరచరాస్తుల యజమానులుగా తీర్చిదిద్ది, మహిళలకు ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలి 
6. సేద్య రంగంలోని మహిళల మనుగడకు సానుకూల పరిస్థితులు సృష్టించాలి. 
7. స్త్రీలకు నైపుణ్యాలను నేర్పించి వారి సామర్థ్యాలకు పదును పెట్టాలి. 
8. మహిళల భద్రత, రక్షణకు తగిన వాతావరణం కల్పించాలి.

రాజకీయ భాగస్వామ్యం ప్రాతిపదికన భారతీయ మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ- అదంతా చాలావరకు పంచాయతీల్లో వారికి కోటా కేటాయించిన ఫలితమే! నిజానికి 545 సభ్యుల లోక్‌సభలో 65మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మరోవంక రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల సంఖ్య తొమ్మిది శాతమే. అయితే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడంవల్ల మొత్తంగా దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం 46శాతానికి చేరింది. పంచాయతీ పదవుల్లో మహిళల భాగస్వామ్యం పెరగడంవల్ల గ్రామీణ మహిళలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకున్నట్లు పశ్చిమ్‌ బంగ కేంద్రంగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు వివిధ మార్గాలున్నాయి. పార్లమెంటులో మహిళలకు కోటా ప్రత్యేకించడం, పార్టీలే నిర్దిష్ట ప్రాతిపదికన మహిళలకు స్థానాలు కేటాయించడం; విద్యావకాశాలను ఇనుమడింపజేసి, రాజకీయ చైతన్యం రగిలించడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని గరిష్ఠ స్థాయికి తీసుకువెళ్ళడం వంటివి అనుసరించదగిన పద్ధతులు. రాజకీయ పక్షాలే పూనుకొని మహిళలకు నిర్దిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించడం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న పద్ధతి. స్వీడన్‌, నార్వే, కెనడా, యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. భారత్‌ సైతం ఈ విధానాన్ని అనుసరిస్తే మేలు.

అడుగడుగునా అభద్రత 
ఆడబిడ్డలను పురిట్లోనే కడతేర్చే విష సంస్కృతి భారత్‌లో ఇప్పటికీ ప్రబలంగా ఉండటం బాధాకరం. దీనివల్ల స్త్రీ, పురుష నిష్పత్తి క్రమేణా కోసుకుపోతోంది. నీతి ఆయోగ్‌ గణాంకాల ప్రకారం- ప్రతి వెయ్యి మంది పురుషులకుగాను హరియాణాలో అత్యల్పంగా 831 మహిళలు ఉంటే; కేరళలో ఆ సంఖ్య అత్యధికంగా 967గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఆ నిష్పత్తి 911 కాగా- అభివృద్ధి చెందిన పంజాబ్‌ (880), గుజరాత్‌ (854), మహారాష్ట్ర (878) వంటి రాష్ట్రాల్లోనూ ఆడబిడ్డల సంఖ్య అంతకంతకూ కుదించుకుపోతుండటం ఆందోళనకు గురిచేస్తున్న పరిణామం. భేటీ బచావ్‌, భేటీ పడావ్‌ (ఆడబిడ్డను కాపాడుకుందాం... చదివించుకుందాం) వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మరింత ఊపందుకోవాల్సి ఉంది. మరోవంక మహిళలపట్ల దేశవ్యాప్తంగా హింస పెచ్చుమీరుతోంది. దేశ రాజధాని దిల్లీ నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో తాము లైంగిక, ఇతర రకాల హింసను ఎదుర్కొన్నట్లు 92 శాతం మహిళలు ఓ సర్వేలో వెల్లడించడం గమనార్హం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 31శాతం మహిళలు తాము భర్త పెట్టే హింసకు లోనైనట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ (43.2శాతం), తెలంగాణ (43.1శాతం), తమిళనాడు (40.6శాతం)లలో కుటుంబంలో భార్యపై హింస గరిష్ఠ స్థాయిలో ఉంది. పని ప్రదేశాల్లోనూ మహిళలపట్ల వేధింపులు అతి పెద్ద సమస్యగా మన ముందుంది. కొంతకాలం క్రితం ‘మీ టూ’ ఉద్యమంలో బాధిత గళాలన్నీ ఒక్కపెట్టున ముందుకు రావడంతో సమస్య తీవ్రత స్పష్టమైంది. నవ్య భారతం ఆవిష్కరణకోసం నీతి ఆయోగ్‌ ఆవిష్కరించిన వ్యూహపత్రంలో ఇందుకు ఎనిమిది మార్గాలను ప్రతిపాదించారు. వీటిని ప్రభావవంతంగా అమలు చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలి. అందుకు అవసరమైన నిధులు కేటాయించి స్త్రీ పురుష సమానత లక్ష్యాన్ని చేరుకునే వరకు అవిశ్రాంతంగా కృషి చేయాలి.

Back to top