కవిత్వానికి గుబాళింపు

03/09/2019
కవిత్వానికి గుబాళింపు

మధునాపంతుల శత జయంతి వత్సరం

పదం అర్థం భావం శయ్య పాకం... వంటి సకల కావ్య లక్షణాలు పుంజీభవించిన పుంభావభారతి, అద్యతనాంధ్ర సాహితీస్రష్టలలో- అటు విద్వత్కవిగా ఇటు సహృదయ విమర్మకుడిగా సమున్నత స్థానాన్ని సాధించిన ప్రతిభామూర్తి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ‘ఆంధ్ర పురాణం’ పేరుతో ఒక జాతి దైనందిన జీవన సరళిని ఆ జాతి సంస్కృతీస్వరూపంగా రూపొందించిన కావ్యశిల్పి మధునాపంతుల. గౌతమీతీరపు సంప్రదాయ సాహిత్య రంగంలో ఆయన తేజోమయ దీపస్తంభం. కావేరి నీళ్ళు తాగినవారికి సంగీతం, గోదావరి నీళ్ళు తాగినవారికి కవిత్వం సహజంగానే అలవడతాయంటారు. గంగను- రుషుల నదిగా, యమునను- ప్రేమికుల నదిగా, కృష్ణను- శిల్పుల నదిగా, కావేరిని- సంగీత విద్వాంసుల నదిగా అభివర్ణించిన అడవి    బాపిరాజు గోదావరిని ‘కవుల నది’ అన్నారు.  మధునాపంతుల గోదావరి ముద్దుబిడ్డ.

‘ఇరవయ్యవ శతాబ్ది తొలినాళ్లలో తెలుగున నవ్యకవిత్వం, నవ్యసాహిత్య చైతన్యం పల్లవించిన వేళలకు పల్లిపాలెం సాక్షి’ అంటూ తిరుపతి వేంకట కవులు ప్రస్తావించిన పల్లె ఆయన నోట పదో ఏట పద్యాలు పలికించింది. మలి కార్యక్షేత్రం రాజమహేంద్రవరం ఆయనను మహాకవిగా లోకానికి కానుక చేసింది. మధునాపంతుల ఖ్యాతికి కవిత్వం ఒక్కటే కారణంకాదు. ‘మెత్తని వర్తనంబు సుతి మెత్తని చిత్తము, మాటయంతకున్‌ మెత్తన’ అంటూ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మన కళ్ళకు కట్టిన మధునాపంతుల విశిష్ట వ్యక్తిత్వం- ఆయన కీర్తికి పరిమళాలద్దింది. అటు కవిత్వంలో ఇటు ప్రవర్తనలో రెండింటా తొంగి చూసే మృదుస్వభావం, వేషభాషల్లో తెలుగుదనం కవిగా ఆయనకు దక్కిన గౌరవానికి సౌరభాన్ని చేకూర్చాయి. మధునాపంతుల పుస్తకాల్లోకి మనం తలదూరిస్తే- సంపెంగ గుబురులోకి ప్రవేశించినట్లే! అలముకొనే సుగంధం, హత్తుకొనే అనుభూతి తప్ప- సంపెంగ మొగ్గ కనపడదు. గుబురంతా గుబాళించిపోతూ ఉంటుంది. ఆంధ్ర పురాణమే దానికి అందమైన ఉదాహరణ.

మధునాపంతులవారికి కుమారసంభవమ్‌ బోధించిన రోజుల్లో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ‘రామాయణ మహామాలారత్నా’నికి విగ్రహవాక్యం చెప్పమని అడిగారట. ఇది హనుమంతుడికి చెందింది కాబట్టి ‘మహాన్‌’ను పట్టుకొని పుంలింగమనో లేక రత్నాన్ని బట్టి ‘మహత్‌’తోనో బోల్తాపడటం సహజం. మధునాపంతుల ‘మాలా’ శబ్దాన్ని చప్పున గ్రహించి ‘మహతీచ సా మాలాచ- మహామాలా’ అంటూ తేల్చిచెప్పేసరికి చెళ్ళపిళ్ళ ఆనందపరవశులై ‘లింగ పరిజ్ఞానం’ బావుందని చమత్కరించారట. 
విద్యార్థి దశనుంచే అలవడిన ప్రతిభకు దరిమిలా వ్యుత్పత్తి, అభ్యాసం తోడై మధునాపంతుల మహాకవిగా ఆవిర్భవించారు. కవిత్రయాన్ని, ప్రబంధ వాఙ్మయాన్ని అవగతం చేసుకొన్న ప్రతిభామూర్తులకే మధునాపంతుల నిలువెత్తు కవితా స్వరూపం ప్రసన్నం అవుతుంది. వారి శబ్దశౌచం ఎంతటిదో తెలుస్తుంది.

ఆంధ్రి మాసపత్రిక ఆయనలోని విశిష్ట కోణాన్ని లోకానికి పరిచయం చేసింది. మధునాపంతుల ఆధునికతను జీర్ణించుకున్న సంప్రదాయవాది. మెత్తగా కనపడే గట్టిమనిషి. హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పిస్తే చెళ్లపిళ్ల దాన్ని నిరసిస్తూ పద్యాలు రాశారు. వాటిని ఆంధ్రి మాసపత్రికలో ప్రచురిస్తూనే, వాటి కింద ఘాటు వ్యాఖ్యలు రాసిన సాహసికులు మధునాపంతుల. అదే సంచికలో దళితకవి జాషువా పద్యాలను ఆప్యాయంగా ముద్రించిన ఆర్ద్ర కవిత్వ రసజ్ఞుడాయన. చెళ్లపిళ్ల పద్యాలను ప్రచురించింది- సంపాదకుడిగా! వాటిని విమర్శించింది- విశ్వమానవుడిగా! జాషువా కవిత్వాన్ని ప్రకటించింది- గొప్ప సహృదయుడైన కవితా మర్మజ్ఞుడిగా!

మనదేశం మీద చైనా దురాక్రమణ జరిపినప్పుడు విక్రమణము అని ఒక ఖండిక రాస్తూ అంతశ్శత్రువులను జయించగలిగిన పండితులం మేము, ఇప్పుడు బహిశ్శత్రువులను జయించవలసిన తరుణం వచ్చింది. దానికి వాక్‌ కృపాణధారులమై సిద్ధంగా ఉన్నామంటూ దాక్షాయణిని కటాక్షించమని ప్రార్థించారు.

అర్థపుష్టికి, చమత్కార ధోరణికి మధునాపంతుల కవిత్వం ఆటపట్టు... రాజమండ్రికి పేరు తెచ్చిన అద్భుత చిత్రకారుడు దామెర్ల రామారావు ప్రతిభను విశ్లేషిస్తూ, వారు బ్రహ్మసృష్టికి దామెర్ల దృష్టికి మధ్య తేడా చెప్పారు. ‘జీవముల్‌ పోసి బొమ్మల చేసెనతడు. బొమ్మలను వేసి జీవముల్‌ పోసె నితడు’ అన్నారు. ఈ గుప్పెడు మాటలను వ్యాఖ్యానిస్తే పెద్దగ్రంథం అవుతుంది. ఓసారి తెలుగు సంఘం ఆహ్వానంపై పుణె నగరం వెళ్లారు. ‘పునహా’ అన్న శీర్షికతో పద్యాలు చెబుతూ ‘పునఃపునా రసికత చూపు హేతువు అలరన్‌ పునహాపుర మన్న పేరు నీ దెస చరితార్థం’ అయిందన్నారు.

మార్చి అయిదున 1920లో జన్మించిన మధునాపంతుల 7.11.1992న అస్తమించారు. కవిగా జీవించి కవిగా మరణించారనడానికి గుర్తుగా వారి కావ్యాలు, ఆంధ్రి పత్రికలతోపాటు ఏటా నన్నయభట్టును స్మరించేందుకుగాను స్థాపించిన ‘శరన్మండలి’ ఇప్పటికీ సజీవంగా అలరారుతూ కార్తిక పున్నమినాడు కావ్యకౌముదులను వెదజల్లుతున్నాయి. మధునాపంతుల ట్రస్టు నేడు రాజమహేంద్రవరంలో ఆయన శత వసంతోత్సవాలకు శ్రీకారం చుట్టి సముచితంగా నిర్వహిస్తుండటం అభినందనీయం.

Back to top