స్వచ్ఛ భారతం సుదూరస్వప్నం

03/11/2019
స్వచ్ఛ భారతం సుదూరస్వప్నం

లక్ష్యాల సాధనలో వెనకంజ

మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల నాటికి భారతావనిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అక్టోబరు 2, 2014న ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహిరంగ మలవిసర్జనను అరికట్టడం, ఘన ద్రవ వ్యర్థాలను పర్యావరణ హితకరంగా తొలగించడం దీని ప్రధానోద్దేశాలు. ‘స్వచ్ఛభారత్‌ మంచి ప్రగతి సాధిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు రెండు నాటికి దేశం బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తమవుతుంది’ అని ఫిబ్రవరి 24న ప్రధాని ప్రకటించారు. స్వచ్ఛభారత్‌ ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉమాభారతి నిరుడు డిసెంబరులో లోక్‌సభలో చెప్పారు. అప్పటికి కొన్ని నెలల ముందే దేశంలోని అపరిశుభ్ర వాతావరణంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తీకరించింది. ‘స్వచ్ఛభారత్‌ లెక్కలు కాగితం మీద ఘనంగానే కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రగతి నత్తనడకన సాగుతోంది’ అని గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు తీరును సమీక్షించిన పార్లమెంటరీ స్థాయీసంఘం ఎండగట్టింది.

మౌలిక సౌకర్యాల లేమి
పారిశుద్ధ్యానికి, ప్రజారోగ్యానికి ఉన్న సంబంధం అవగాహనలోకి రావడంతో 1986లో జాతీయస్థాయిలో తొలిసారి ‘కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమం’ ప్రారంభించారు. 1999లో ఇది ‘సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం’గా మారింది. 2012లో ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’గా రూపుదాల్చింది. ఈ మూడు కార్యక్రమాలపై గత పాలకులు దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చుచేశారు. 6.1 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు అంచనా. అయినప్పటికీ జనాభాలో దాదాపు సగానికి బహిరంగ మలవిసర్జన అనివార్యమయ్యేది! ఈ ఏడాది గాంధీ జయంతి కల్లా ఈ   దుస్థితిని రూపుమాపాలని మోదీ ప్రభుత్వం సంకల్పం ప్రకటించింది. ‘నిర్మల్‌భారత్‌’ను ‘స్వచ్ఛభారత్‌’గా తీర్చిదిద్దింది. 9.72 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 అక్టోబరు నుంచి 2018 మే నాటికి ఈ కార్యక్రమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.79,392 కోట్లు ఖర్చుచేశాయి. మార్చి 6, 2019 నాటికి దేశవ్యాప్తంగా 9.23 కోట్ల గ్రామీణ గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించినట్లు, 5.54 లక్షల గ్రామాలను బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తం చేసినట్లు సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, మరుగుదొడ్ల నిర్మాణ నాణ్యత తీసికట్టుగా ఉందని పార్లమెంటరీ స్థాయీసంఘం తూర్పారబట్టింది. మరోవైపు 66.41 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు, 5.07 లక్షల సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబరు 31, 2018 నాటికి రూ.8,290 కోట్లు వెచ్చించాయి. ఈ ఏడాది మార్చి ఆరునాటికి 55.71 లక్షల గృహ, 4.7 లక్షల సామూహిక మరుగుదొడ్లను నిర్మించినట్లు, 3,500 పైగా పట్టణాల్లో బహిరంగ మలవిసర్జనను నివారించినట్లు కేంద్రం చెబుతోంది. అయితే, ‘బహిరంగ మల విసర్జన లేని దేశ నిర్మాణానికి మరుగుదొడ్లను కడితే చాలదు. జనం వాటిని వినియోగించుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలి’ అంటూ స్వచ్ఛభారత్‌ అమలుతీరులోని లోపాల్ని పార్లమెంటరీ స్థాయీసంఘం విస్పష్టంగా చెప్పింది. నీళ్లు అందుబాటులో లేక 58 శాతం ‘స్వచ్ఛభారత్‌’ మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని ఎన్‌ఎస్‌ఎస్‌వో (2015-16) సర్వేలో తేలింది. నీటికొరత, మురుగు నీటిపారుదల వ్యవస్థ లేమితో 55 శాతం గ్రామీణులు, 7.5 శాతం పట్టణ ప్రాంతీయులకు బహిరంగ మలవిసర్జన తప్పడం లేదని సర్వే ఫలితాలు స్పష్టీకరించాయి. ‘స్వచ్ఛభారత్‌’ గణాంకాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌ల్లోని నూరు శాతం పల్లెల్లో బహిరంగ మలవిసర్జన జరగట్లేదు. పరిశోధక సంస్థ ‘రైస్‌’ గతేడాది ఈ నాలుగు రాష్ట్రాల్లో చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో 44 శాతం గ్రామీణులు మరుగుదొడ్లను వినియోగించుకోలేకపోతున్నారని వెల్లడైంది. గుజరాత్‌లోని అన్ని జిల్లాలనూ బహిరంగ మలవిసర్జన జరగని ప్రాంతాలుగా ప్రకటించారు. అక్కడ మచ్చుకు ఓ 120 గ్రామ పంచాయతీలను పరిశీలిస్తే 29 శాతం ఇళ్లలో మరుగుదొడ్లు లేవని తెలిసింది.

ప్రజారోగ్యానికి చేటు
‘స్వచ్ఛభారత్‌’ అమలులోకి వచ్చేనాటికి దేశంలో 38.7 శాతం గ్రామాలకే సంపూర్ణ పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు అది 98.90 శాతానికి చేరిందని కేంద్రం నమ్మబలుకుతోంది. ఏ సమాజంలోని పారిశుద్ధ్య పరిస్థితినైనా అక్కడి ప్రజల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా మదింపు వేయాలి. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగైతే కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాల కారణంగా చుట్టుముట్టే వ్యాధుల వ్యాప్తి తగ్గాలి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ హెల్త్‌ ఇంటెలిజెన్స్‌ వెలువరించే వార్షిక జాతీయ ఆరోగ్య స్థితిగతుల నివేదికలను పరిశీలిస్తే ఇలాంటి రోగాల దాడి ఎక్కువైంది తప్ప తగ్గలేదు. దేశవ్యాప్తంగా 2014లో చికెన్‌గున్యా కేసులు 16,049 నమోదైతే, 2017లో అవి 63,679కు పెరిగాయి. డెంగ్యూ కేసులూ 40 వేల నుంచి 1.30 లక్షలకు చేరాయి. మెదడువాపు, టైఫాయిడ్‌, అతిసార వ్యాధుల బారిన పడిన రోగుల సంఖ్య అధికమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం దేశంలో ఇప్పటికీ ఏటా లక్ష మంది అయిదేళ్లలోపు చిన్నారులు అతిసారంతో కన్నుమూస్తున్నారు. తొంభై శాతం మరణాలకు రక్షిత తాగునీరు, ప్రాథమిక పారిశుద్ధ్య సౌకర్యాలు కొరవడటమే కారణం. తాగునీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేక దేశంలో ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు శిశువులు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి బృందాల నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యక్షేత్రమైన గోరఖ్‌పూర్‌లో స్థానిక పురపాలక సంస్థ ఆ మధ్య ఓ సర్వే చేసింది. నగర జనాభాలో 70.5 శాతం మంది కామెర్లు, మెదడువాపు, కలరా, అతిసారం, చర్మవ్యాధులతో బాధపడుతున్నారనే దిగ్భ్రాంతకర విషయాన్ని వెల్లడించింది.

కార్మికుల సంక్షేమానికి కోత

మానవ విసర్జితాలను శుభ్రంచేసే అమానవీయ వృత్తిలోని పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి స్వచ్ఛభారత్‌ దోహదపడటం లేదన్నది ఓ విమర్శ! మురుగుకాల్వలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రపరచే క్రమంలో గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 233 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. మరోవైపు, స్వచ్ఛభారత్‌ నిర్మాణానికి శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలపడానికంటూ ప్రధాని మోదీ ఇటీవల ఓ అయిదుగురు కార్మికుల కాళ్లు కడిగారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి వ్యక్తిగతంగా రూ.21 లక్షల విరాళమిచ్చారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వయంఉపాధి పథకానికి కేటాయింపులు భారీగా తగ్గిపోవడం గమనార్హం. 2013-14లో ఈ పథకానికి రూ.557 కోట్లు కేటాయిస్తే, ఆ మొత్తం 2017-18కి కేవలం అయిదు కోట్ల రూపాయలకు పడిపోయింది! ఈ ఏడాది బడ్జెట్లో కొంచెం పెంచి రూ.20 కోట్లు కేటాయించారు. మెరుగైన జీవన పరిస్థితుల కోసం ఇటీవల దిల్లీలో ఆందోళన చేసిన పారిశుద్ధ్య కార్మికులు ‘ప్రధాని మా కాళ్లు కడగడం కాదు కన్నీళ్లను తుడవాలి’ అని నినదించడం గమనార్హం.

‘చెత్త నిర్వహణ సరిగ్గా లేక డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి వ్యాధులతో దేశవ్యాప్తంగా చాలామంది చనిపోతున్నారు’ అని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు- 2016 అమలు తీరుపై వ్యాజ్యం విచారణ సందర్భంగా ఫిబ్రవరి, 2018లో న్యాయస్థానం కేంద్రప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు మౌలిక సదుపాయల కల్పన నిరాశాజనకంగా ఉందని పార్లమెంటరీ స్థాయీసంఘమూ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ పరిస్థితుల్లో అక్టోబరు రెండు నాటికి సంపూర్ణ స్వచ్ఛభారతం ఎలా ఆవిష్కృతమవుతుంది? ‘దేశంలోని అత్యధిక ప్రాంతాలు తీవ్ర నీటికరవుతో అల్లాడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటికి అవసరమైన నీటి వసతి కల్పన అత్యంత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి. నీళ్లు లేని మరుగుదొడ్లను నిర్మించడం దండగ’ అన్న పార్లమెంటరీ స్థాయి సంఘం విమర్శనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలోని లోటుపాట్ల మీదా దృష్టి సారించాలి. అప్పుడే ప్రపంచంలో అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమంగా పాలకులు అభివర్ణిస్తున్న ‘స్వచ్ఛభారత్‌’ విజయవంతమవుతుంది!

Back to top