అమ్మభాషతోనే చక్కని చదువు

03/11/2019
అమ్మభాషతోనే చక్కని చదువు

అన్యభాషా మాధ్యమంతో చెరుపు

ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయి. భాష అంతరిస్తే సాంస్కృతిక వైవిధ్యం తగ్గిపోతుంది. ప్రపంచ జనాభాలో నలభై శాతం వారి సొంత భాషల్లో విద్యాభ్యాసం చేయడం లేదు. తెలిసిన భాషలో చదువుకు, అన్యభాషలో విద్యకు ఎంతో తేడా ఉంటుంది. భారత్‌లో నేడు 60 శాతం విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌, నాగాలాండ్‌ల్లో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు ఆంగ్లంలోకి మారాయి. చాలా రాష్ట్రాలు ఈ దిశగా కదులుతున్నాయి. తెలివికి, ఆంగ్ల మాధ్యమానికి సంబంధం లేదు. ఆంగ్ల మాధ్యమం తెలివితేటలను పెంచదు. వాస్తవానికి ప్రాథమికంగా మాతృభాషల్లో చదువుకున్న విద్యార్థులకే బలమైన పునాది ఏర్పడుతుంది. ఇంటిభాష, బడిభాష వేరైనపుడు సమాజంపై విద్యార్థికి సరైన అవగాహన ఏర్పడదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న అనేక వృత్తులకు ఆంగ్లం అవసరం లేదు. అనేక వృత్తివిద్యలను సొంతభాషలోనే చదువుకోవచ్చు. దేశం అభివృద్ధి చెందే క్రమంలో ఆంగ్లం అవసరమైన వృత్తులు తగ్గుతూ రావాలి. కానీ మనవద్ద అన్ని విషయాల్లో ఆంగ్ల వ్యామోహం ప్రబలి అమ్మభాష ఉనికికే ముప్పు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి.

ఆంగ్లంలో మాట్లాడటమే గొప్ప అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదు. ఆంగ్లం నేర్చుకుంటే వ్యక్తిగతంగా మేలు జరగవచ్చేమో కానీ, దేశ భవిష్యత్తును అది ప్రశ్నార్థకం చేస్తుంది. సాంకేతిక శాస్త్రాల్లో ఎదగాలంటే మన భాషల్లో చదువుకోవాలి. వైద్యం, ఇంజినీరింగ్‌తో సహా సమాజంలో పనితనం పెరిగేకొద్దీ, సాంకేతికత సంక్లిష్టమయ్యే కొద్దీ మాతృభాషలోనే ఆ సమాచారమంతా లభించాలి. అన్ని శాస్త్రాలను వారి వారి భాషల్లో చదువుకుంటున్న ఫ్రాన్స్‌, జర్మనీ, స్వీడన్‌, రష్యా, జపాన్‌, చైనా, ఇటలీ, బ్రెజిల్‌ తదితర దేశాలు అభివృద్ధి చెందిన ఆంగ్లదేశాలతో పోటీ పడుతుండటం గమనార్హం. ఆయా దేశాల ఒరవడి భారత్‌కు ఆదర్శం కావాలి. అనేక భాషలకు పుట్టిల్లు భారత దేశం. వాటి ఉనికిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. దాదాపు పది కోట్ల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా విద్యార్థులకు తెలుగులో   ప్రామాణికమైన పదసంపత్తి లేకపోవడం బాధాకరం. బెంగళూరులోని నిమ్‌హాన్స్‌ సర్వే ప్రకారం భారత్‌లో 16శాతం విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం మాధ్యమ భాష. విద్యార్థుల సామర్థ్యంపై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు   జరిగాయి. ఫలితాలు సంతృప్తికరంగా లేవు.

తెలుగును పాలనలో విస్తృతంగా వాడాలని 1966లోనే ప్రభుత్వం చట్టం చేసింది. దాన్ని ప్రభుత్వ యంత్రాంగం విధిగా అమలుచేయాలి. ఎవరో ఒకరిద్దరు అధికారులు మినహా మిగిలిన వారందరూ తెలుగును నిర్లక్ష్యం చేశారన్నది చేదునిజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండ కలెక్టర్‌గా పనిచేసిన నందివెలుగు ముక్తేశ్వరరావు జిల్లాపాలనను పూర్తిగా తెలుగులో సాగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మధ్య ‘ఈ-ఫైలింగ్‌’ జరుగుతోంది. దస్త్రాన్ని కంప్యూటర్‌లోనే సిద్ధంచేసి మెరుపువేగంతో పంపవచ్చు. ఈ దస్త్రాలను తెలుగులోనూ చేయవచ్చు. ఎంతమంది ఈ పని చేస్తున్నారన్నది ప్రశ్నార్థకం. అంగళ్లు, కార్యాలయాల నామఫలకాలు తెలుగులోనే ఉండాలని చట్టం చెబుతోంది. ఈ నిబంధనను పాటించని సంస్థలపై జరిమానా విధించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే ఔషధాలపై తెలుగులో పేర్లెందుకు ఉండకూడదు? సూపర్‌ బజారుల్లో రసీదులు ఆంగ్లంలోనే ఎందుకివ్వాలి? ఉత్తరాలపై చిరునామాలు ఆంగ్లంలో రాస్తేనే బట్వాడా అవుతున్నాయా? కొద్దిపాటి ప్రయత్నంతో ఈ పరిస్థితిని చక్కదిద్దవచ్చు.

సాధ్యమైనంతవరకు ప్రాచీన ద్రవిడ పదాలను, అంతరించిన తెలుగు పదాలకు ప్రాణం పోస్తూనే, సంస్కృతం, పాళీ భాషల్లోని ప్రాకృత పదాలను సందర్భానుసారం వాడుకుంటే వైద్యం, ఇంజినీరింగ్‌తోపాటు ఇతర శాస్త్రాలనూ తెలుగులోకి తేవడం కష్టంకాదు. అప్పుడే పిల్లల కష్టాలను తీర్చినవారమవుతాం. ప్రజల్లో, విద్యార్థుల్లో పుస్తకాలు చదివే అలవాటు తక్కువగా ఉండటం తెలుగుకు ప్రథమ శత్రువు. ఆరున్నర కోట్ల జనాభా ఉన్న బ్రిటన్‌లో రోజుకు 500 పుస్తకాలు ప్రచురితమవుతున్నాయి. అంటే రోజుకు 500 మంది రచయితలు వివిధ రంగాల్లో పుస్తకాలను అందిస్తున్నారు. 130 కోట్ల జనాభా గల భారత్‌లో రోజుకు 400 పుస్తకాలు మాత్రమే ప్రచురితమవుతుండటం మన వెనకబాటును సూచిస్తోంది. అధికభాగం రచయితలు తమ పుస్తకాలను సొంతంగా ప్రచురించుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం    నెలకొంది. సాహిత్యంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అనువదించి తెలుగులో ప్రచురించాలి. ప్రపంచంలో మొదటి 50 భాషల్లో (మాట్లాడేవారి సంఖ్యను అనుసరించి కాదు) తెలుగు ఉంటుంది. దీన్ని పరిపుష్ఠం చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల ద్వారా భాషలో ఏకరూపత వస్తున్నా, సాంకేతిక పదకోశాలు, వాటి వాడుక లేనంతవరకు ఆశించిన ఫలితాలు రావు. తెలుగుతోపాటు ఆదివాసులు మాట్లాడే చెంచు, గదబ, సవర, లంబాడ తదితర స్థానిక భాషలపై విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆయా భాషల్లో బాలలకు కనీసం ప్రాథమిక విద్యను అయినా సరిగ్గా అందించాలి. అప్పుడే మాతృభాషలు కొంతవరకైనా మనుగడ సాగిస్తాయి!

Back to top