అవేకష్టాలు... ఆగనికన్నీళ్లు

03/12/2019
అవేకష్టాలు... ఆగనికన్నీళ్లు!

అన్నదాతలకు ‘మద్దతు’ ఎక్కడ?

పంటలకు మద్దతు ధర లభిస్తుందనే పూచీకత్తు లేకుండానే త్వరలో మరో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ అయిదేళ్ల పాలన కాలం ముగుస్తున్నా గిట్టుబాటు ధర అన్నదాతలకు కలగానే మిగిలింది. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సాగువ్యయానికి మరో 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించినట్లు ఈ ఏడాది ఆరంభంలో కేంద్రం ఊదరగొట్టింది. కానీ ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లు ముగిసే ప్రస్తుత తరుణంలో ఇంతవరకూ చాలా పంటలకు సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో పండిన పత్తి పంటకూ మద్దతు ధర లభించలేదు. దేశంలో కేవలం 24 రకాల పంటలకే మద్దతు ధర ప్రకటిస్తున్నారు. వాటిని ఆ ధరలకు కొనే వ్యవస్థలు సైతం సక్రమంగా లేవు. చివరకు వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో పంటలను కొంటామని ‘ఈ-నామ్‌’ పథకం ప్రారంభించి మూడేళ్లయినా ఇంతవరకూ అది బాలారిష్టాలను దాటలేదు.

మాటలకే పరిమితం
మద్దతు ధరలపై ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లకు ఎక్కడా పొంతనే ఉండటం లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో పండించే పంటలకు గత జులై నాలుగున, ప్రస్తుత రబీలో సాగుచేసిన వాటికి గత అక్టోబరు మూడున మద్దతు ధరలను కేంద్రం ప్రకటించింది. పంట సాగు వ్యయంకన్నా 50 శాతం అధికంగా ఈ ధరలున్నట్లు ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్పష్టం చేసింది. వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్వింటా వరి ధాన్యం పండించడానికి  రూ.2,625 ఖర్చవుతోందని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఈ ధాన్యానికిస్తున్న మద్దతు ధర రూ.1,770 మాత్రమే. ఇందులో 50 శాతం అధికంగా ధర ఎక్కడనేది పాలకులకే తెలియాలి. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా తన ఎన్నికల ప్రణాళికలో సాగువ్యయంకన్నా 50 శాతం అదనంగా మద్దతు ధర ఇస్తామని హామీఇచ్చింది. మళ్ళీ లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. నాటి వాగ్దానం ఆచరణలో వట్టిపోయిందనడానికి తాజా పరిస్థితులే దాఖలా. రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం. దీన్ని ప్రకటించి నాలుగేళ్లు గడిచాయి. ఇప్పటికీ రైతుల ఆదాయం పెరగకపోగా కొత్త కష్టాలు వారిని వెంటాడుతున్నాయి. మద్దతు ధర ప్రకటించినంత మాత్రాన సరిపోదని, ప్రతి పంటను పక్కాగా ఆ ధరలకు కొనేలా పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని 2018 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చెప్పారు. ఇందుకోసం నీతి అయోగ్‌, కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్రాలతో సంప్రతింపులు జరిపాయి. ఈ మేరకు ‘ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ అభియాన్‌’ (పీఎం-ఆశ) పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఉప పథకాలున్నాయి. అవి మద్దతు ధరలకు కొనే పథకం (పీఎస్‌ఎస్‌), మద్దతుకన్నా తక్కువఉంటే ఆ వ్యత్యాసాన్ని చెల్లించే పథకం (పీడీపీఎస్‌), ప్రైవేటు వ్యాపారులతో కొనిపించి నిల్వ చేసే పథకం (పీఎస్‌పీఎస్‌). మూడోదైన పీఎస్‌పీఎస్‌ను ఈ సీజన్‌లో ప్రయోగాత్మకంగా రాష్ట్రానికో జిల్లాలో అమలుచేస్తామన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కాకుండానే ఖరీఫ్‌ కొనుగోళ్లు ముగుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

పీఎం-ఆశ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రాలతో జరిపిన చర్చల్లో కేంద్రం వ్యవహరించిన తీరు, ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు భిన్నంగా ఉంది. ఒక రాష్ట్రంలో పండే దిగుబడిలో 40 శాతం మద్దతు ధరకు కేంద్రం కొనడమే పీఎం-ఆశ లక్ష్యమని చెప్పారు. కనీసం 50 శాతం కొనాలని అప్పుడే అన్నీ రాష్ట్రాలు గట్టిగా కోరాయి. తీరా గత అక్టోబరు నుంచి ఖరీఫ్‌ పంటలు మార్కెట్‌కు రావడం మొదలయ్యాక కేవలం  25 శాతమే తాము కొంటామని, మిగతాదంతా రాష్ట్రాలే చూసుకోవాలంటూ కేంద్రం చేతులెత్తేసింది. కేంద్రం 50 లేదా 40 శాతం కొంటుందన్న ధీమాతో చాలా రాష్ట్రాలు మద్దతు ధరకు కొనేందుకు సొంత బడ్జెట్లలో నిధులు కేటాయించుకోలేదు. కేంద్రం ఇప్పుడు 25 శాతమే కొని పక్కకు తప్పుకోవడం వల్ల రాష్ట్రాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇది వ్యాపారులకు పండగలా మారింది. ఈ ఏడాది తెలంగాణలో 2.85 లక్షల టన్నుల కందుల దిగుబడి వస్తుందని, కనీసం లక్ష టన్నులైనా కొనమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకుంది. కేవలం 25 శాతానికే కేంద్రం అనుమతించింది. వ్యాపారులు చాలా తక్కువ ధరకు కందులు కొంటున్నందువల్ల రైతులు నష్టపోతున్నారని మరో 30 వేల టన్నులైనా కొనమని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తెలంగాణలో ఖరీఫ్‌లో కోటి ఎకరాల్లో పంటలు సాగవగా, అందులో కందుల విస్తీర్ణం ఎనిమిది శాతంలోపే ఉంది. ఈ కొద్ది పంట కొనుగోలుకే ఇలా ఉంటే ఇక మిగతా పంటల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్క తెలంగాణలోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి పత్తి ఉత్పాదకత పడిపోయిందని ‘భారత పత్తి సలహా మండలి’ వెల్లడించింది. అయినా రైతులందరికీ మద్దతు ధర లభించలేదు. మద్దతు ధరలు ప్రకటించే పంటల పరిస్థితే ఇలా ఉంటే, జాబితాలో లేని పసుపు, మిరప, ఉల్లిగడ్డ, కూరగాయ పంటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎకరా పసుపు లేదా మిరప పంట సాగుకు లక్ష రూపాయల వరకూ పెట్టుబడి పెట్టకతప్పదు. ఖరీదైన వ్యాపారంలా మారిన ఈ పంటలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, కనీస సాగువ్యయానికి తగినట్లుగా కొనే ఏర్పాట్లు లేకపోవడం వ్యవసాయ మార్కెటింగ్‌లో డొల్లతనానికి నిదర్శనం.  ప్రపంచంలో పసుపు పంట 80 శాతం భారత్‌లోనే పండుతోంది.   అంతర్జాతీయ విపణికి అధిక పంటను అందించే దేశంగా అవకాశమున్నా ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా రైతులు రోడ్డెక్కాల్సి వస్తుంది.

ఈ-నామ్‌ ప్రభావరహితం
ఒక మార్కెట్‌కు పంట వస్తే దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో దాన్ని చూసి కొనేందుకు ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌’ (ఈ-నామ్‌) పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఇప్పటికే 585 మార్కెట్లను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసినట్లు ప్రకటించారు. కానీ ఇదంతా కాగితాల్లోనే ఉంది. ఒక విపణిలో ఉన్న వ్యాపారులు గతంలో అక్కడికొచ్చిన పంట చుట్టూ నిలబడి వేలం పాడి ధర నిర్ణయించేవారు. వారిలో వారు కుమ్మక్కై ధర తగ్గించడంతో రైతులు నష్టపోయేవారు. ఈ-నామ్‌ విధానం వచ్చాక వ్యాపారులు విపణిలో లేదా వారి దుకాణాల్లో కూర్చుని ఆన్‌లైన్‌లో ధర చెబుతున్నారు. ఇలా చేయడానికి ముందే వారంతా ఒకే మాట అనుకుని ఎక్కువ ధర ప్రకటించకుండా కుమ్మక్కవుతున్నారు.ఇలాంటి మార్కెటింగ్‌ వ్యవస్థల్లో గిట్టుబాటు ధర రావడం అసాధ్యం.
దేశంలో పండుతున్న పంటల్లో 30 శాతానికి మించి మద్దతు ధర దక్కడం లేదు. ఈ పరిస్థితి మారనంత కాలం రైతుల ఆదాయం పెరగదు. ప్రతి పంటకు అయ్యే సాగువ్యయం, ఎంత ధరకు కొంటే వారికి గిట్టుబాటు అవుతుందనే నివేదికలు సాగు ప్రారంభానికి ముందే విడుదల చేయాలి. ఏ పంట ఏ ప్రాంతంలో సాగుచేయాలనే అంశానికి సంబంధించి పంటల కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు ఈ కాలనీల్లో సాగుచేసే పంటకు ఎంత ధర ఇస్తారనేది సాగు ప్రారంభానికి ముందే ప్రకటిస్తేనే రైతులకు భరోసా దక్కుతుంది. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ధరలను ప్రతి రైతు చరవాణికి సంక్షిప్త సందేశ రూపంలో పంపే ఏర్పాటు చేయాలి. రైతుకు వంద కిలోమీటర్ల పరిధిలోని ప్రతి మార్కెట్‌ ధరలు తెలియజేయాలి. ఈ-నామ్‌లో అనుసంధానమైన మార్కెట్లను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసేలా ఆన్‌లైన్‌ సదుపాయాలు పెంచితే వ్యాపారులు కుమ్మక్కు కాకుండా అడ్డుకోవచ్చు. నిధుల కేటాయింపులు లేకుండా, మార్కెట్‌ ధరలపై సూచనలేమీ ఇవ్వకుండా, పంటలను కొంతమేరకైనా నేరుగా కొనకుండా- మద్దతుధర ఇస్తున్నామని ప్రకటించినంత మాత్రాన రైతులకు ఒరిగేదేమీ ఉండదు. వారి ఆదాయం రెట్టింపయ్యే సంగతేమో కాని, మరింత అప్పుల పాలవుతారు!

నిధులే కీలకం

పంటలను మద్దతు ధరకు కొనాలంటే ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపు ఉండాలి. దేశమంతా పంట కొనేంత నిధులు కేంద్రం ఇవ్వడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బడ్జెట్లలో ‘పంటల కొనుగోలు నిధి’ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ధరలు పడిపోయి రైతులు రోడ్లపైకి వచ్చినప్పుడు అప్పటికప్పుడు అప్పులు తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే విధానాలకు రాష్ట్రాలు స్వస్తి పలకాలి. పంట అమ్మిన 72 గంటల్లో రైతు ఖాతాలో సొమ్ము జమ చేయాలనేది కేంద్రం నిబంధన. చెరకు పంట అమ్మిన రైతులకు రెండు నెలలుగా వారి ఖాతాలో నిధులు జమ చేయకుండా చక్కెర మిల్లులు సతాయిస్తున్నాయి. అదేమంటే నిధుల కొరత అని ముఖం చాటేస్తున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కందులు అమ్మిన రైతులకూ ఇలాగే నెలల తరబడి సొమ్ము చేతికివ్వడం లేదు. ఇలాంటి విధానాలే వ్యాపారులకు వరంగా మారుతున్నాయి. తాము చెప్పిన ధరకు పంట అమ్మితే అప్పటికప్పుడు నగదు ఇస్తామని వ్యాపారులు చెబుతూ రైతుల అవసరాలతో ఆడుకుంటున్నారు. దేశంలో హెక్టారులోపు భూమి ఉన్న రైతులే సగానికి పైగా ఉన్నారు. పండించే కొద్దిపాటి  పంటను అమ్మి సొమ్ము ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేంత వెసులుబాటు వారికి ఉండదు. మద్దతు ధరకు పంటను కొంటున్నామనే పేరుతో నెలల తరబడి సొమ్ము ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎంతో కొంత చాలు, వెంటనే నగదు చేతికొస్తుంది కదా అని వ్యాపారులకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ విభాగాల ద్వారా పంటల కొనుగోలుకు నిధులు కేటాయిస్తే ఈ దుస్థితి నుంచి రైతులను ఆదుకోవచ్చు.
Back to top