నామమాత్రంగా ‘ఈ-నామ్‌’

03/14/2019
నామమాత్రంగా ‘ఈ-నామ్‌’

అడుగడుగునా లోపాలు-రైతుల పాలిట శాపాలు

ఎన్డీయే ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద మొదటి వాయిదాగా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు మార్కెట్‌ మాయాజాలంపై, పంటలధరలు పడిపోవడంపై మండిపడుతున్నారు. ఇటీవల ఎర్ర జొన్నల ధర పతనంపై నిజామాబాద్‌ రైతులు, మిర్చి ధర కోసుకుపోయి ఖమ్మం రైతులు నిరసన బాట పట్టారు. ఇలాంటి విపణి వైపరీత్యాలను నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ-నామ్‌ పథకం ఆచరణలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దేశంలోని రైతులందరికీ ఏకీకృత జాతీయ ఎలక్ట్రానిక్స్‌ వ్యవసాయ విపణిగా నిలవాల్సిన ఈ-నామ్‌ పథకానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఈ-నామ్‌లో కేవలం 54 లక్షలమంది రైతులు, 582 మండీలు మాత్రమే భాగస్వాములు. దీన్నిబట్టి స్థాపిత లక్ష్యానికి ఈ పథకం ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ-నామ్‌ను అమలులో పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు మొదట రైతులు ఎలక్ట్రానిక్‌ వేలం ద్వారా మంచి ధర పొందడానికి వీలుగా ఏపీఎమ్‌సీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రమంతటా ఒకే లైసెన్సును ప్రవేశపెట్టి, ఒక్కచోటే మార్కెట్‌ రుసుము విధించే వెసులుబాటు కల్పించాలి. ఇంతవరకు కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎమ్‌సీ చట్టానికి సవరణలు చేశాయి. ఈ-నామ్‌ కింద ఉత్తర్‌ ప్రదేశ్‌లో 100, గుజరాత్‌లో 79, మహారాష్ట్రలో 60, మధ్యప్రదేశ్‌లో 58, హరియాణలో 54, తెలంగాణలో 44 మండీలు ఏర్పాటయ్యాయి.

వైఫల్యాలమయం
ఏ రాష్ట్రంలోనూ ఒక్క మండీ సైతం పూర్తిస్థాయిలో పని ప్రారంభించలేదు. చాలా రాష్ట్రాల్లో నాణ్యతా పరీక్ష యంత్రాలు, శాస్త్రీయ గ్రేడింగ్‌ వసతులు లేవు. అంతర్జాల అనుసంధానం లోపించడం ఈ-నామ్‌ ఉద్దేశాన్నే అపహాస్యం చేస్తోంది. మహారాష్ట్రలో మౌలిక వసతులు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి.  గుజరాత్‌, మహారాష్ట్రల్లో నాణ్యతా పరీక్షాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మహారాష్ట్రలోని లాతూరు కందుల మార్కెట్‌ దేశంలోనే పెద్ద విపణి. అయినా అక్కడ ఈ-నామ్‌ వేదికపై వ్యాపారం నిర్వహించలేకపోతున్నారు. పెద్ద మండీలపరిస్థితే ఇలాఉంటే, చిన్నవాటి సంగతి గురించి చెప్పక్కర్లేదు. అంతర్జాల ఆధారిత ఈ-నామ్‌ వ్యవస్థ ద్వారా లాతూరులో కందులను అమ్మితే మంచి ధర వస్తుందని, అంతా పారదర్శకంగా నడుస్తుందని భావించి ఈ-నామ్‌ వైపు మొగ్గుచూపినా ఫలితం లేకపోయింది. మహారాష్ట్రలో అహ్మద్‌ నగర్‌, ఔరంగాబాద్‌, సాంగ్లి, అకోలా, దౌండ్‌ మార్కెట్‌ యార్డుల్లో మాత్రమే ఈ-నామ్‌ పనిచేస్తోంది. ఇతర రాష్ట్రాల పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు.

తెలంగాణలో 44 మార్కెట్‌ యార్డులు ఈ-నామ్‌ వేదికకు మారినా, వాటిలో చాలాచోట్ల గ్రేడింగ్‌, నాణ్యత పరీక్షల వసతులు లేవు.  నిజామాబాద్‌కు గతేడాది ఉత్తమ ఈ-నామ్‌ మండీ అవార్డు లభించినా అది ఏపీఎమ్‌సీ పరిధి వెలుపల ఉన్న వ్యాపారులకు అందుబాటులో లేదు. అంతర్జాలం ద్వారా పసుపు నాణ్యతను పరీక్షించే వెసులుబాటు లేకపోవడం వల్ల బయటి వ్యాపారులు దాన్ని కొనడానికి ముందుకురావడం లేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణ, రాజస్థాన్‌లలో పూర్తిస్థాయిలో అంతర్జాల మండీలు ఏర్పడలేదు. హరియాణలో పంటల నాణ్యతా పరీక్ష పరికరాల సేకరణ ప్రారంభం కాగా, రాజస్థాన్‌లో కేవలం ఆవాలు పంటకు మాత్రమే అలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాసిరకం పరికరాలు ఉండటంతో ఈ-నామ్‌ ప్రమాణాల ప్రకారం పంటల నాణ్యతను నిర్ధారించే వీలు చిక్కడం లేదు.

ఈ-నామ్‌ కింద అంతర్జాలంలో క్రయవిక్రయాలు జరపాల్సిందిగా రైతులు, వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లకు నచ్చజెప్పడం వ్యవసాయ శాఖాధికారులకు కష్టమైపోతోంది. నాణ్యతను కచ్చితంగా పరీక్షిస్తే తక్కువ ధర వస్తుందని రైతులు, అంతా పారదర్శకంగా జరిగితే ఎక్కువ పన్నులు కట్టాల్సి వస్తుందని వ్యాపారులు భయపడుతున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బందికి సాంకేతిక నైపుణ్యాలు కొరవడటంతో గ్రేడింగ్‌, నాణ్యత నిర్ధారణ వసతుల కల్పన ఆలస్యమవుతోంది. నాణ్యతా పరీక్షకు ఎలాంటి పరికరాలు అవసరపడతాయో అంచనా వేయగల సామర్థ్యమూ సిబ్బందికి లేదు. కొత్త కొనుగోలుదారులు రావాలన్నా, పోటీ వల్ల మంచి ధర లభించాలన్నా స్వయంచాలనం, మార్కెట్‌ ఏకీకరణ అవసరం. కానీ, అవి ఇప్పటికీ పూర్తిస్థాయిలో సమకూరలేదు. ఇతర మండీల నుంచి వ్యాపారులు అంతర్జాలం ద్వారా కొనుగోలుకు ప్రయత్నిస్తే స్థానిక మండీల్లోనూ ధరలు పెరుగుతాయి. కానీ, అది ఇంతవరకు జరగలేదు. వివిధ మండీలను ఏకీకరించినా, అంతర్జాలంతో అనుసంధానించినా ఉత్పత్తులరాక, ధరలు ఏమీ పెరగలేదు. కారణం- వ్యాపారులు వ్యవసాయోత్పత్తుల నాణ్యతను స్వయంగా చూసి నిర్ధారించాలనుకొంటారు తప్ప అంతర్జాలంలో చూసి తృప్తిపడాలనుకోరు. పంటల నాణ్యతా పరీక్షా పరికరాలపై ఆధారపడటం వ్యాపారులకే కాదు, రైతులకూ అయిష్టమే. ఇలాంటి పరీక్షలతో తమకొచ్చే ధర తగ్గిపోతుందని వారి భయం. పైగా ఒక్కో పంట మచ్చును పరిశీలించడానికి 10 నిమిషాలనుంచి గంట వరకు పట్టవచ్చు. ఈ లెక్కన మండీకి పెద్ద సంఖ్యలో రైతులు, వారి ఉత్పత్తులు వస్తే నాణ్యతా పరీక్షకు రోజుల తరబడి సమయం పడుతుంది. గుంటూరు, ఖమ్మం మిర్చి యార్డులు, నిజామాబాద్‌లో పసుపు, మొక్కజొన్న మండీలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. అక్కడ నిల్వకు తగినంత స్థలం లేదు. నాణ్యతా పరీక్షకు చాలినంత మంది సిబ్బంది లేరు. నాణ్యతను అంతర్జాలంలో సాధికారంగా నిర్ధారించలేక పోతున్నందువల్ల దూర ప్రాంత వ్యాపారులు ఆన్‌లైన్‌లో సరకు కొనలేకపోతున్నారు. కొత్త కొనుగోలుదారులు రాకపోతే స్థానిక దళారులమాయాజాలం యథావిధిగా కొనసాగుతుంది. కొత్తగా వచ్చిన ఈ-నామ్‌ వల్ల ఉపయోగం ఉండదు. ధర విషయంలో వ్యాపారులు కుమ్మక్కు కావడం, వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు కలిసి ఆన్‌లైన్‌ క్రయవిక్రయాలను బహిష్కరించడం ఇతర రాష్ట్రాల మండీల్లో జరిగింది. బయటి వ్యాపారులు రాకపోవడం వారికి వాటంగా ఉంది. కొన్నిచోట్ల మండీలకు వెలుపల బేరాలు కుదిరిపోయాయి. ఈ-నామ్‌ కింద రైతులకు లభించిన పంట ధరలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమూ ఇబ్బంది అవుతోంది. ఈ పద్ధతి తమ పొట్ట కొడుతుందని కమిషన్‌ ఏజెంట్లు నిరసిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల పద్ధతి కింద వారికి అమ్మకం ధరలో రెండు శాతం కమిషన్‌ మాత్రమే చెల్లించాలి. ఇది వారికి ఏ మూలకూ చాలదు. ఇంతకాలం రైతుల నుంచి సరకు సేకరించడం, నాణ్యతను నిర్ధారించడం, నిల్వ సౌకర్యాలు కల్పించడం, విక్రయానంతర సేవలు అందించడం వంటి విధులను ఏజెంట్లే నిర్వహిస్తున్నారు. సాధారణంగా వ్యాపారులు రెండు వారాల నుంచి ఆరు నెలల్లోపు కమిషన్‌ ఏజెంట్లకు చెల్లింపులు జరుపుతారు. ఏజెంట్లు రైతులకు ఒకటీ రెండు రోజుల్లో డబ్బు ముట్టజెబుతారు. గతంలో వ్యాపారులు సరకును నిరాకరిస్తే ఏజెంట్లు నష్టభయాన్ని భరించేవారు. ఈ-నామ్‌ కింద రైతులకు నేరుగా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు జరిగేట్లయితే కమిషన్‌ ఏజెంట్లు ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తుంది.

మేలుచేసే ప్రోత్సాహకాలు

వ్యవసాయ మార్కెటింగ్‌ సమస్యలను కేవలం ఎలక్ట్రానిక్‌ చెల్లింపులతో పరిష్కరించలేమన్న విషయం స్పష్టమవుతోంది. దీన్ని పూర్తిగా సాంకేతిక దృష్టి కోణం నుంచి చూసే బదులు రైతులు, ఏజెంట్లు, వ్యాపారులు ఎలక్ట్రానిక్‌ క్రయవిక్రయాలవైపు మనస్ఫూర్తిగా మారేలా ప్రోత్సహించాలి. ఇప్పటికే ఏపీఎమ్‌సీ చట్టాలను సవరించి మౌలిక వసతుల ఆధునికీకరణకు పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలకు మాత్రమే ఈ-నామ్‌ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహాయసహకారాలు లభిస్తున్నాయి. ఈ-నామ్‌ అనేది ఇంకా సాఫ్ట్‌వేర్‌ స్థాయిని దాటకపోవడం వల్ల చెప్పుకోదగిన ఫలితాలు రావడం లేదు.

సంస్థాగత సంస్కరణలు అవసరం
ఈ-నామ్‌ వ్యవస్థ గాడిలో పడాలంటే సంస్థాగత సంస్కరణలు అవసరం. రైతులు సైతం ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల పట్ల ఉత్సాహంగా లేరు. ఏజెంట్లు తమ సరకును అమ్మిపెట్టడమే కాదు, రుణాలు కూడా ఇస్తారు కాబట్టి రైతులకు వారి మీద నమ్మకం ఎక్కువే. బ్యాంకు ద్వారా పంటకు డబ్బు తీసుకోవడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. తమ ఖాతాలో డబ్బుపడగానే అంతకుముందు తాము బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీని, రుణ బకాయిలను మినహాయించుకునే బెడదా పొంచి ఉంది. ఏజెంటైతే వెంటనే డబ్బు చెల్లిస్తారన్న భరోసా ఉంటుంది. వ్యవస్థీకృత మార్కెట్‌ ఉన్న వక్కలు తదితర పంటల రైతులు మాత్రమే సహకార సంఘాలుగా ఏర్పడి ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రాలు దృఢసంకల్పం ప్రదర్శించడంతోపాటు సంస్థాగత సంస్కరణలు చేపట్టి ఈ-నామ్‌కు ఊపు తీసుకురావాలి. రైతులు, కమిషన్‌ ఏజెంట్లు ఈ-నామ్‌ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహించాలి. ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల్లో పారదర్శకత తీసుకురావాలి. కర్ణాటకలో వ్యాపారులకు రుణాలిచ్చి, వారి నుంచి రైతులకు కొంత ముందస్తు చెల్లింపులు జరిగే ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు పంట ధరలు జమ చేసే ఖాతాలకు, వారి రుణ ఖాతాలకు లంకె తెగ్గొట్టి బకాయిల బాధ నుంచి ఊరట కల్పిస్తున్నారు. ఈ సంస్కరణలకు తోడు నాణ్యతా పరీక్ష పరికరాలు, వసతుల కల్పనకు పెట్టుబడులు పెంచాలి. వ్యాపారులు ఏదో ఒక్క మండీకే పరిమితమైపోకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో అనేక మండీల్లో కొనుగోళ్లు జరిపేలా ప్రోత్సహించాలి. కేంద్ర, రాష్ట్రాలు రుణమాఫీలకు, రైతుబంధు, కిసాన్‌ సమ్మాన్‌ వంటి పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది బాగానే ఉన్నా- గిట్టుబాటు ధరలు లభించినప్పుడు మాత్రమే రైతు నిలదొక్కుకోగలడనే వాస్తవాన్ని విస్మరించరాదు!

Back to top