అవగాహనే అసలైన మందు

03/14/2019
అవగాహనే అసలైన మందు

నేడు ప్రపంచ మూత్రపిండ దినం

పరిచయం అవసరం లేని ప్రధాన అవయవాల వ్యాధుల్లో మూత్రపిండాల(కిడ్నీల) వ్యాధి ఒకటి. ఈ వ్యాధి విస్తరణకు అనేక కారణాలున్నాయి. దేశంలో ఏటా 28 శాతం పిల్లలు రెండున్నర కిలోలకంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. దీనివల్ల వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పోషకాహార సమస్యలు మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. మేనరిక వివాహాలు, చిన్న వయసులో లేదా మరీ పెద్ద వయసులో పిల్లలను కనడం వంటివీ ఈ వ్యాధి విస్తృతికి దోహదపడతాయి. పేదరికం, పారిశుద్ధ్య లోపం, వాయు, నీటి కాలుష్యం, ఆహారంలో కల్తీ... మూత్రపిండ వ్యాధులకు దారితీస్తాయి. యాభై శాతానికి పైగా కిడ్నీ బాధితులు చివరి దశలో మాత్రమే వైద్యులను సంప్రతిస్తున్నారు. ఫలితంగా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

వంద కోట్లకు పైగా జనాభాగల దేశంలో కేవలం 1,800 మంది కిడ్నీ నిపుణులు మాత్రమే ఉన్నారు. వీరిలో అధిక శాతం పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నారు. తొంభై శాతం రోగులు రక్తశుద్ధి(డయాలిసిస్‌) తీసుకొనే స్థాయి వరకు రాలేకపోతున్నారు. ఒకవేళ డయాలిసిస్‌ మొదలుపెట్టినా, అరవై శాతం మొదటి సంవత్సరంలోనే చనిపోతున్నారు. ఆర్థిక సమస్యలు, అవగాహనా లోపం ఇందుకు ప్రధాన కారణాలు. దేశంలో తొలిసారి 1971లో హెమోడయాలిసిస్‌ నిర్వహించారు. అదే ఏడాది మొదటి కిడ్నీ మార్పిడి జరిగింది. ఇరవై ఏళ్ళ తరవాత పెరిటోనియాల్‌ డయాలిసిస్‌ తొలిసారిగా చేశారు. ఇప్పటికీ డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి ప్రధానంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్లమంది మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల వల్ల సంవత్సరానికి సుమారు 24 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. అల్పాదాయ దేశాల్లోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం, గుండెజబ్బు, మధుమేహం, రక్తపోటు, ఎయిడ్స్‌, మలేరియా, క్షయ, హెపటైటిస్‌ వంటివి కిడ్నీ వ్యాధులకు కారణమవుతున్నాయి. పేదరికం, లింగ వివక్ష, అవిద్య, వృత్తిపరమైన ప్రమాదాలు, కాలుష్యం వంటి అంశాలు ఈ వ్యాధిపై ప్రభావం చూపుతున్నాయి.

మారిన పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి ఖరీదైన చికిత్సగా పరిణమించింది. మౌలిక సదుపాయాల కల్పన, వైద్యుల వృత్తిపరమైన శిక్షణకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అవయవ దాతల కొరత, దీర్ఘకాలం డయాలిసిస్‌ చేయిచుకోవలసిన అవసరం కారణంగా వ్యయం తడిసి మోపెడవుతోంది. ఇక కిడ్నీలసంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం అన్నింటికన్నా ముఖ్యం. స్వచ్ఛమైన నీరు, వ్యాయామం, మంచి ఆహారం, పొగాకు నియంత్రణ తదితర చర్యల ద్వారా కిడ్నీ వ్యాధులను, వాటి తీవ్రతను కొంతవరకైనా నివారించవచ్చు. మూత్ర, రక్త పరీక్షల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే నివారణ తేలిక అవుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ నియంత్రణ కోసం కావలసిన మందులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం 2016 బడ్జెట్లో డయాలిసిస్‌ కేంద్రాల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రభుత్వం నలభై డయాలిసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఈ సేవలు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి కేంద్రాలు పని చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో 15వేలకు పైగా రోగులు రక్తశుద్ధి చికిత్స పొందుతున్నారు. ఒక డయాలిసిస్‌కు నెలకు రూ.14,500 వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన రెండు ప్రభుత్వాలు కనీసంగా ఏటా రూ.260 కోట్లకు పైబడి వ్యయపరుస్తున్నాయి. ఇతర కిడ్నీ వ్యాధుల వ్యయం దీనికి అదనం. ప్రైవేటుగా చికిత్స పొందుతున్నవారు ఇంకా అధిక సంఖ్యలో ఉంటారు. ఇక కిడ్నీ మార్పిడి విషయానికొస్తే ఆ ఖర్చు లక్షల రూపాయల్లో ఉంటుంది. దీన్నిబట్టి మూత్రపిండ వ్యాధుల వల్ల ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందో అంచనా వేసుకోవచ్చు. కిడ్నీ వ్యాధులు మహిళలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రోగ నిర్ధారణ, చికిత్స కోసం వచ్చే మహిళలు తక్కువగా ఉంటున్నారు. డయాలిసిస్‌ చికిత్స పొందుతూ మధ్యలో మానేస్తున్నవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. కిడ్నీ మార్పిడి ఎక్కువగా పురుషుల్లోనే జరుగుతోంది. వీరికి మహిళలు దాతలుగా ఉంటున్నారు. ఖరీదైన ఔషధ వినియోగం సైతం ఆడవారిలో తక్కువగా ఉంటుంది.

అవయవ దానాన్ని దేశమంతా అవసరమైన విధానంగా గుర్తించినా అనేక రాష్ట్రాల్లో అదింకా ప్రారంభ దశలోనే ఉంది. కిడ్నీలు దెబ్బతిన్న తరవాత అందించే చికిత్స ఖర్చుతో కూడుకున్నది. డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి తరవాతా చాలామంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందలేక పోవడానికి కారణం అవగాహనాలోపం. యాభైశాతం పైగా రోగులు మొదటి ఆరు నెలల్లోనే చనిపోవడం చేదువాస్తవం. డయాలిసిస్‌ మాత్రమే రోగులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయలేదు. మంచి ఆరోగ్య లక్షణాలు, మితాహారం, వ్యాయామం వంటి అంశాలు వ్యాధి నివారణకు దోహదపడతాయి. ఆఫ్రికా లాంటి దేశాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. అనేక దేశాలు కిడ్నీ చికిత్సను అత్యంత ఖర్చుతో కూడుకున్నవిగా గుర్తించాయి. ఆరోగ్య బడ్జెట్లో అధిక మొత్తం దీనికే ఖర్చు అవుతున్న విషయాన్ని గుర్తించాయి. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించే, నివారించే విధానాలను అవి ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ విషయాల్లో జాగ్రత్త వహించడం ద్వారా వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడం ద్వారా ఆరంభదశలోనే సాధ్యమైన మేర కిడ్నీ వ్యాధులకు కళ్లెం వేయవచ్చు

Back to top