భద్రత కల్పనే చట్టం పరమార్థం

03/15/2019
భద్రత కల్పనే చట్టం పరమార్థం

ఆదివాసుల భూహక్కు తొలగింపు వివాదం-పరిష్కార విధానం

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆదివాసులు అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురైతే, సాగుచేస్తున్న అటవీ భూములనుంచి వారిని స్వాధీనం చేసుకోవాల్సిందేనా? దరఖాస్తు తిరస్కరణకు గురైనవారిని నాలుగు నెలల్లో అటవీ భూముల నుంచి తొలగించాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీంతో కేంద్రం విన్నపం మేరకు తీర్పు అమలును సుప్రీంకోర్టు నాలుగు నెలలపాటు నిలిపేసింది. ఇప్పుడు ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది చర్చనీయాంశమవుతోంది. అటవీ హక్కుల చట్టం లేదా ఎఫ్‌ఆర్‌ఏ లేదా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌గా పిలిచే షెడ్యూల్డ్‌ తెగలు, సంప్రదాయ అటవీ నివాసితుల అటవీ హక్కుల చట్టం- స్వతంత్ర భారత చరిత్రలో ఆదివాసుల అటవీ హక్కులను గుర్తించిన మొట్టమొదటి చట్టం. ఇది అమలయ్యే ముందువరకు ఆదివాసులను అటవీ భూముల ఆక్రమణదారులుగానే చూశారు. చట్టం వచ్చాకే వారికి హక్కులు దఖలుపడి, భద్రత ఏర్పడింది.

దేశవ్యాప్తంగా అటవీ భూములపై ఆదివాసులు హక్కుల కోసం దరఖాస్తు చేసుకోగా 17.32 లక్షల ఎకరాలకు సంబంధించి 18.22 లక్షల మందికి హక్కు పత్రాలు వచ్చాయి. మరో 18.92 లక్షల మంది దరఖాస్తులను తిరస్కరించారు. ఆ అటవీ భూములనుంచి వారిని తొలగించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్టం నిర్దేశించిన డిసెంబరు 13నాటికి సాగులో లేనివారు, హక్కు పత్రం పొందడానికి అర్హత లేనివారు, చట్టబద్ధంగా దరఖాస్తులు తిరస్కరణకు గురైనవారు అటవీభూమిలో కొనసాగుతుంటే వారిని తొలగించడంలో అభ్యంతరం ఉండకూడదు. కానీ, వారిలో చాలామందికి తమ దరఖాస్తును తిరస్కరించిన విషయం, అందుకుగల కారణలేమిటో తెలియదు. సాంకేతిక అంశాలే తిరస్కరణలకు ప్రధాన కారణం. అలా చేయరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు సైతం చేసింది.

ఆక్రమణదారులు కాదు...
అడవులు, అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నవారు బ్రిటిష్‌ పాలనలో, ఆ తరవాత వచ్చిన అటవీ చట్టాలవల్ల అన్యాయానికి గురయ్యారు. 2008నాటి చట్టం సాగుభూములపై వారికి హక్కులు కల్పించింది. 2005 డిసెంబరు 13నాటికి అటవీ భూమిని సాగు చేసుకుంటున్న షెడ్యూల్డు తెగలవారికి 10 ఎకరాలకు మించకుండా వారి వాస్తవ సాగులో ఉన్న భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలి. అదే ఇతర కులాలవారైతే ఆ తేదీనాటికంటే ముందు మూడు తరాలు(75 ఏళ్లు)గా ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటే హక్కుపత్రం వస్తుంది. సాగు భూమి, ఇంటి స్థలాలతో పాటు చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, ఇతర అటవీ హక్కులకూ ఈ చట్టం ద్వారా హక్కుపత్రం పొందవచ్చు. వ్యక్తిగత హక్కులకు, సామూహిక హక్కులకు గుర్తింపు పత్రాలు అడగవచ్చు. ప్రతి గ్రామంలో 15 మంది గ్రామస్తులతో ఒక అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి, హక్కుల గుర్తింపు, నిర్ధారణ చెయ్యాలి. అందుకు చట్టంలో పేర్కొన్న ఏవైనా రెండు సాక్ష్యాలను దరఖాస్తుదారుడు చూపాలి. కమిటీ నివేదిక ఆధారంగా గ్రామసభ తీర్మానం చేసి, సబ్‌ డివిజనల్‌ కమిటీకి తమ సిఫార్సులు పంపాలి. గ్రామసభ తీర్మానాలను ఈ కమిటీ పరిశీలించి జిల్లా కమిటీకి పంపుతుంది. జిల్లా కలెక్టర్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా అటవీ అధికారి హక్కుపత్రాలను జారీ చేస్తారు. దరఖాస్తును ఆరంభంలో గ్రామసభ తిరస్కరిస్తే, సబ్‌ డివిజనల్‌ కమిటీకి; సబ్‌ డివిజనల్‌ కమిటీ తిరస్కరిస్తే జిల్లా కమిటీకి అప్పీలు చేసుకోవచ్చు. జిల్లా కమిటీ నిర్ణయమే అంతిమం. సివిల్‌ కోర్టులు జోక్యం చేసుకోకూడదు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.

అటవీ హక్కుల చట్టం పట్ల కొన్ని వర్గాల వ్యతిరేకత, చట్టం అమలులోని లోపాలు, ఆదివాసులలో చట్టంపై అవగాహనరాహిత్యం... వెరసి చరిత్రాత్మక చట్టం ద్వారా వేల గిరిజన కుటుంబాలు లబ్ధి పొందలేకపోయాయి. చట్టంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి. గ్రామసభలు నిర్వహించాల్సిన అటవీ హక్కుల గుర్తింపు, నిర్ధారణ కార్యక్రమాలు ప్రభుత్వ శాఖలు అన్నీ తామై నిర్వహించాయి. గ్రామసభ ఏర్పాటు చేసిన అటవీ హక్కుల కమిటీ నామమాత్రమైంది. ఈ కమిటీలోని చాలామందికి తాము అందులో సభ్యులన్న విషయమే తెలియదు. అటవీ హక్కుల గుర్తింపు కార్యక్రమ ం అటవీ భూముల పంపిణీ కార్యక్రమంగా మారిపోయింది. అందుకే, చాలామందికి హక్కు పత్రాలు రాలేదు. వచ్చినా వారు సాగు చేసుకుంటున్న పూర్తి విస్తీర్ణానికి ఇవ్వలేదు. సగంపైన దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఆశ్చర్యకరంగా ఎక్కువ శాతం దరఖాస్తులను గ్రామసభలే తిరస్కరించాయి. గ్రామసభలకు అటవీ హక్కుల చట్టం ఇచ్చిన అధికారాల పరిధిలో వాటిని పనిచేయనిస్తే ఇలా జరిగి ఉండకపోవచ్చు. దరఖాస్తులు తిరస్కరిస్తే అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అలా అప్పీళ్లు చేసుకున్న దాఖలాలు లేవు. తిరస్కరించిన సమాచారం, తిరస్కరణకు కారణాలు తెలిస్తే కదా అప్పీలు చేసుకునేది! ఆదివాసుల అవగాహనలేమి వల్ల అప్పీలుకు వెళ్ళలేరు కాబట్టి జిల్లా స్థాయి కమిటీలే తమంత తాముగా తిరస్కరించిన దరఖాస్తులను పరిశీలించాలని కేంద్రం ఆదేశించింది. అదీ అమలు  కాలేదు. అటవీ హక్కుల చట్టంలో సాగుభూమికి, ఇంటి స్థలాలపై వ్యక్తిగత హక్కులకే కాక, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులు మేపుకొనే స్థలాలు, పూజా స్థలాలు, చేపల చెరువులు, కాలిబాటలు తదితర సామూహిక హక్కులకూ హక్కు పత్రాలు అడగవచ్చు. అటవీ రక్షణ, యాజమాన్య హక్కు చట్టం ఆదివాసులకు ఈ అవకాశం ఇచ్చింది. వివిధ కారణాల వల్ల సామూహిక హక్కులకోసం చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువశాతం ఆమోదం పొందలేకపోయాయి. ఒకపక్క చట్టం లక్ష్యాలు ఆచరణలో నీరుగారిపోతే, మరోవైపు అటవీ హక్కుల చట్టం మేరకు హక్కులు లేని లేదా హక్కులు పొందలేనివారు అటవీ రక్షణ చట్టాలను ఉల్లంఘించి అడవులను ఆక్రమిస్తున్నారు.

అటవీ హక్కుల చట్టం అమలులోకి రాగానే అది రాజ్యాంగ విరుద్ధమని వివిధ హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ చట్టం వల్ల అడవులు నాశనమవుతాయని, అందుకే దీన్ని రద్దు చెయ్యాలని కోర్టులను కోరారు. కొన్ని హైకోర్టులు ఈ చట్టం అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి. మరికొన్ని చట్టాన్ని అమలు చేయవచ్చుకాని, జారీచేసిన హక్కు పత్రాలు కోర్టు ఇచ్చే అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొన్నాయి. వివిధ హైకోర్టుల్లో ఈ చట్టంపై ఉన్న వ్యాజ్యాలనన్నింటినీ సుప్రీంకోర్టుకు బదలాయించారు. కొన్నేళ్లుగా అక్కడ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యాజ్యం 2016లో విచారణకు వచ్చినప్పుడు అటవీ హక్కులకోసం చేసుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురై, ఇంకా అటవీ భూములను అనుభవిస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటివారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాల పరిధిలోనిదని కేంద్రం పేర్కొంది. తిరస్కరించిన దరఖాస్తుదారుల వివరాలు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని అన్ని రాష్ట్రాలకు కోర్టు 2016, 2018లలో ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారంతో గత నెల 13న జరిగిన విచారణ సందర్భంగా దరఖాస్తులు తిరస్కరిస్తూ అంతిమ తీర్పు వచ్చిన తరవాతా అటవీ భూముల్లో కొనసాగుతున్నవారిని నాలుగు నెలల్లోగా తొలగించి కోర్టుకు నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీచేసిన రోజు కేంద్రం తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. ఈ ఆదేశాలను అమలుచేస్తే గిరిజనులకు నష్టం జరుగుతుందని కోర్టు తీర్పుపై పెద్దయెత్తున వ్యతిరేకత వచ్చినందువల్ల దాన్ని రద్దు చెయ్యాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ తీర్పు అమలును నాలుగు నెలలు నిలుపుదలచేస్తూ కోర్టు గత నెల 28న ఆదేశాలు జారీ చేసింది.

పునఃవిచారణ అవసరం
కోర్టు ఉత్తర్వులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో జరగాల్సిందేమిటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైనవారందరికీ హక్కులు దక్కే ప్రయత్నం రాబోయే నాలుగు నెలల్లో జరగాలి. తిరస్కరించిన దరఖాస్తుల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలి. తిరస్కరణ కారణాలను దరఖాస్తుదారుడికి రాతపూర్వకంగా ఇవ్వాలి. తిరస్కరణ దరఖాస్తులను సబ్‌ డివిజనల్‌ కమిటీ లేదా జిల్లా కమిటీ తనంత తానుగా అప్పీలుగా స్వీకరించి విచారణ జరపాలి. దరఖాస్తు చేసుకున్న పూర్తి విస్తీర్ణానికి హక్కుపత్రం దక్కనివారి విషయంలోనూ పునఃవిచారణ చేపట్టాలి. గిరిజన సంక్షేమ శాఖ గిరిజనులకు అండగా నిలబడాలి. న్యాయసేవల సంస్థల ద్వారా దరఖాస్తుదారులకు కావాల్సిన తగు న్యాయ సహాయం, సలహాలు అందించాలి. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన అటవీ హక్కుల కమిటీ ద్వారా ప్రస్తుతం అటవీ భూములను అనుభవిస్తున్నవారి వివరాలు, అందులో ఎంతమంది 13 డిసెంబర్‌ 2005 నాటికి సాగులో ఉన్నారు, ఎంతమందికి హక్కు పత్రాలు వచ్చాయన్న వివరాలను సేకరించాలి. ఈ వివరాల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. అర్హత ఉన్నవారికి హక్కు పత్రం దక్కాలి. అర్హత లేనివారిని అటవీ చట్టాల ప్రకారం తొలగించాలి. అటవీ హక్కుల చట్టం అటవీ భూములను పంచడానికి చేసింది కాదు. హక్కులు ఉండి కూడా అన్యాయానికి గురైనవారికి రక్షణ ఇవ్వడానికి చేసింది. 2005నాటికే వారికిఉన్న హక్కుల గుర్తింపే ఈ చట్టం ఉద్దేశం. హక్కుల గుర్తింపు, అంతిమంగా అడవుల రక్షణ ఈ చట్టం ఆశయాలు. అడవుల రక్షణ, హక్కుల గుర్తింపు రెండూ భిన్నధ్రువాలు కాదు. అవి ఒకే నాణానికి రెండు పార్శ్వాలు. ఈ సారాన్ని అర్థం చేసుకుంటే చట్ట నిబంధనల అమలు అర్థవంతంగా, తీర్పులు ఆదర్శంగా ఉంటాయి!

Back to top