ఔషధ ధరాఘాతం

03/16/2019
ఔషధ ధరాఘాతం

ప్రజారోగ్యానికి ఏదీ పూచీ?

పూర్వం రోగానికి మందులు లేక ప్రజలు చనిపోయేవారు. నేడు మందులు కొనలేక జనం మరణిస్తున్నారు. ప్రాణం పోయాల్సిన మందులు రోగుల ఆయువును కబళిస్తున్నాయి. రోగం కంటే ఎక్కువగా మందుల ధరలు రోగులను భయపెడుతున్నాయి. ఈ పరిస్థితి మనదేశంలోనే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఉంది. అక్కడ ప్రతి అయిదుగురు రోగుల్లో ఒకరు మందులు కొనలేక మృత్యువాత పడుతున్నారు. సంపన్న రాజ్యమైన అమెరికాలోనే పరిస్థితిలా ఉంటే ఇక మిగతా దేశాల గురించి చెప్పనక్కర్లేదు.

లాభార్జనే ధ్యేయం
ఔషధ పరిశోధనలకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో నిధులు సమకూరుస్తుంది. పరిశోధన ఫలించి మందు కనుగొంటే ఆ సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా అమ్ముకునే హక్కులు కల్పిస్తారు. మైలాన్‌ ఔషధ సంస్థ 2007లో ‘ఎపిపెన్‌’ అనే మందును విక్రయించడానికి ‘మెర్క్‌’ సంస్థ నుంచి హక్కులు కొనుగోలు చేసింది. 2009లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. నేటి వరకు దాని ధరను 50-60 డాలర్ల నుంచి 500-600 డాలర్ల వరకు పెంచేశారు. అందులో మందు మారలేదు. ఆహారానికి సంబంధించిన ‘ఎలర్జీ’ వల్ల ప్రాణనష్టం జరగకుండా ‘ఎపిపెన్‌’ అరికడుతుంది. గిలియాడ్‌, ఫార్మాస్సెట్‌ అనే కంపెనీ నుంచి మూడో దశ ఔషధ పరీక్షలో ఉన్న ‘సోవాల్డి’ అనే మందును 1,100 కోట్ల డాలర్లకు కొని; ఆహార, ఔషధ పాలన(ఎఫ్‌డీఏ) విభాగం అనుమతి పొంది అమ్మకాలు ప్రారంభించింది. ఈ మందు ‘హెపటైటిస్‌-సి’ అనే ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నయం చేస్తుంది. ఒక్క డోసు ధర వెయ్యి డాలర్లు. రోజుకు ఒక్కటి చొప్పున 12 రోజులు వేసుకుంటే స్వస్థత చేకూరుతుంది. కానీ, వెయ్యి డాలర్లు వెచ్చించి కొనడం సాధ్యమయ్యే పని కాదు. దీని అసలు ఖరీదు డాలర్‌ మాత్రమే. ‘సోవాల్డి’ అనే మందుకు సంబంధించిన ఎమొరీ యూనివర్సిటీ (అట్లాంటా)లో ప్రాథమిక పరిశోధనను ప్రజాధనంతో నిర్వహించారు. కొన్ని మంచి పరిశోధనలను శాస్త్రవేత్తలు చేశారు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వారు పేటెంట్‌ చేసుకోకుండా ఉచితంగా తమ మేధాసంపత్తిని పంచారు. ప్రజారోగ్యాన్ని కాపాడారు. 20వ శతాబ్దం మొదట్లో పాశ్చాత్య ప్రపంచాన్ని పోలియో కుదిపేసింది. పక్షవాతమూ ప్రబలింది. ఊపిరితిత్తులు బిగుసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమై పెద్దసంఖ్యలో పిల్లలు, పెద్దలు మృతి చెందారు. న్యూయార్క్‌కు చెందిన 40 ఏళ్ల అంటురోగాల వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ జోనస్‌ సాల్క్‌ 1955లో పోలియో టీకాను కనిపెట్టి ప్రజలను కాపాడారు. ఆ మందు పేటెంట్‌ హక్కులు తీసుకుంటే పెద్దయెత్తున డబ్బు వస్తుంది కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా- ‘నీ కొడుకును నువ్వు పేటెంట్‌ చేసుకుంటావా’ అని సమాధానమిచ్చారు. లాభంకన్నా రోగుల మేలే ముఖ్యమన్నది ఆయన విధానం.

ఇన్సులిన్‌ను మధుమేహ వ్యాధి కోసం 1921లో ఫ్రెడరిక్‌ బ్యాంటింగ్‌, చార్లెస్‌ బెస్ట్‌, జేమ్స్‌ కాలిప్‌ కనిపెట్టారు. ఆ పేటెంట్‌ను యూనివర్సిటీ అఫ్‌ టొరంటోకు కేవలం మూడు డాలర్లకు విక్రయించారు. ఇన్సులిన్‌ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ‘రాయల్టీ’ లేకుండా విశ్వవిద్యాలయంలో పరిశోధనకు వెచ్చించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో ‘ఎలి లిల్లి’ అనే కంపెనీతో ఉత్పత్తి, మార్కెటింగ్‌ కోసం ఒప్పందం చేసుకుంది. 1941లో ఎలి లిల్లి మరో మూడు సంస్థలు, పరిశోధనలో చిన్న మార్పులు చేసి ఇన్సులిన్‌ పేటెంట్‌ను హస్తగతం చేసుకొని జనరిక్‌ ఇన్సులిన్‌ రాకుండా అడ్డుపడ్డాయి. దశాబ్దాలుగా అవి లాభాలు గడిస్తున్నాయి. 1996లో ఇన్సులిన్‌ ధర 21 డాలర్లు. ఇప్పుడు 250 డాలర్ల పైనే. మందులో మార్పేమీ లేదు. ధర మాత్రం విపరీతంగా పెరిగింది.

ఔషధ పరిశ్రమ కొత్త మందుల కోసం ఎప్పుడూ పరిశోధనలపై ఆధారపడుతుంటుంది. ఆచార్యులు, పీహెచ్‌డీ విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఈ రంగంలో కృషి చేస్తుంటారు. పరిశోధనలను ప్రజాధనంతో నిర్వహిస్తారు. అందువల్ల ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా పేటెంట్‌ చేసుకోరు. ఈ పరిశోధన ఫలితాల ఆధారంగానే మందులను కనిపెడతారు. ఇది మొదటి తరహా పద్ధతి. నేడిది పెద్దగా అమలులో లేదు. చిన్నచిన్న జీవ సాంకేతిక(బయోటెక్‌) సంస్థలు మొదటి తరహా పద్ధతిలో మందులను ఒక పరిధి వరకు అభివృద్ధి చేస్తాయి. కంపెనీ ఆర్థిక వనరులు, పరిశోధనల పురోగతినిబట్టి మొదటి, రెండో ఔషధ దశ వరకు అభివృద్ధి చేస్తారు. అప్పటికే చిన్న సంస్థల దగ్గర వనరులు వట్టిపోతాయి. మొదటి, రెండో ఔషధ (క్లినికల్‌) పరీక్షల ఫలితాలు చూసి పెద్ద సంస్థలకు ఆశ కలుగుతుంది. ఇవి చిన్న సంస్థల నుంచి కొత్త మందు క్లినికల్‌ దశనుబట్టి ఒకేసారి కొనుక్కొంటాయి. ఆ ఆఖరి తంతు (మూడో దశ క్లినికల్‌, ఎఫ్‌డీఏ అనుమతి) ముగించి విపణిలో విచ్చలవిడి ధరలకు విక్రయిస్తాయి. ఇది రెండో పద్ధతి. ఔషధ సంస్థలు వివిధ పద్ధతుల్లో కొత్త మందులను కనుగొని, ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకొనే అధికారం ఉందా, వాటి పరిశోధనల ఫలితంగా వచ్చిన డబ్బు మొత్తం ఆ సంస్థకే చెందుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ప్రాథమిక పరిశోధన మొత్తం ప్రజాధనంతోనే జరుగుతుంది. మరి ఆ ప్రాథమిక పరిశోధనకు పేటెంట్‌ ఉండొద్దా, ఆ ప్రజాధనానికి వాటా రావొద్దా అన్నదే ఇక్కడ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు.

ఇక్కడ ‘మేధా సంపత్తి హక్కులు’ (ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌) గురించి ప్రస్తావించాలి. ఎవరైనా ఒక వ్యక్తి, సంస్థ పరిశోధన చేసి కొత్త వస్తువును, మందును, యంత్రాలను కనిపెడితే- వారే ధర నిర్ణయించి 15 నుంచి 20 సంవత్సరాలు పోటీ లేకుండా అమ్ముకునే అవకాశాన్ని ఈ ‘మేధా సంపత్తి హక్కులు’ కల్పిస్తాయి. పరిశోధనలను ప్రోత్సహించడానికి, వాటికయ్యే ఖర్చులను తిరిగి రాబట్టుకోవడానికి ప్రభుత్వాలు వ్యక్తులకు, కంపెనీలకు ఈ తరహా రక్షణ కల్పించింది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వాలియంట్‌, మైలాన్‌, టూరింగ్‌ లాంటి ఫార్మా సంస్థల కార్యనిర్వాహక అధ్యక్షులను (సీఈవోలను) అమెరికన్‌ కాంగ్రెస్‌ వివిధ సందర్భాల్లో ప్రశ్నించింది. మైలాన్‌ సీఈవో హెదర్‌ బ్రెష్‌ను ‘ఎపిపెన్‌’ ధర 50-60 డాలర్ల నుంచి 500-600 డాలర్లకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించింది. అందుకు ఆయన 66 వేల బడుల్లో ఏడు లక్షల ‘ఎపిపెన్‌’ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. మీరు ధర పెంచకపోతే వారే కొనుక్కొనేవారు కదా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. టూరింగ్‌ ఫార్మ సీఈవో మార్టిన్‌ ష్క్రేలి ‘డారాఫ్రమ్‌’ అనే యాంటీ ఇన్ఫెక్షన్‌ మందు ధర 13 డాలర్ల నుంచి 750 డాలర్లకు పెంచగా అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. రోగులు చనిపోతున్నారు, కొంచెం ధర తగ్గించమని సెనెటర్‌ కమ్మింగ్స్‌ కోరగా, ఇంకా పెంచుతానని దురుసుగా సమాధానమిచ్చారు. తరవాత కొద్దిరోజులకే సెక్యూరిటీస్‌ కుంభకోణం కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడింది. వాలియంట్‌ ఫార్మా సైతం సెక్యూరిటీస్‌ కుంభకోణం కేసులో ఇరుక్కుంది. దీంతో 330 డాలర్లు ఉన్న షేరు ధర 15 డాలర్లకు పడిపోయింది.

అడ్డగోలు వాదనలు
పరిశోధనకు చాలా ఖర్చవుతుందని, అందువల్లే ధరలు పెంచుతున్నామని ఔషధ సంస్థలు చెబుతుంటాయి. వాస్తవానికి ఈ సంస్థలు మందు గురించి చేసే ప్రచారం తక్కువే. వైద్యులను ప్రలోభపెట్టడానికి పెట్టే ఖర్చు కంటే, పరిశోధన వ్యయం చాలా తక్కువని తేలింది. ఇంతకుముందు నేరుగా మార్కెటింగ్‌కు అనుమతి లేదు. ఎఫ్‌డీఏ చాలా షరతులు పెట్టి నేరుగా మార్కెటింగ్‌కు అనుమతి ఇచ్చేది. ఆ షరతులు పూర్తి చేయడం అసాధ్యమై కొంతకాలం ఈ సంస్థలు నేరుగా మార్కెటింగ్‌ చేయలేదు. మొదటిసారి బిల్‌ క్లింటన్‌ అధ్యక్షుడైన తరవాత నేరుగా మార్కెటింగ్‌ను చట్టబద్ధం చేశారు. రోగులే వెళ్ళి నాకు ఫలానా మందు రాయండనే పరిస్థితి తీసుకువచ్చారు. ఇప్పుడున్న దాదాపు ప్రతి సంస్థ అక్రమాలకు పాల్పడి దొరికిపోయినదే. ఇప్పటివరకు అన్ని సంస్థలు కలిపి మొత్తం సుమారు 1,930 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాయి. ఈ జరిమానాలనూ వ్యాపార వ్యయం కింద లెక్కకట్టి, ధరలు పెంచి రోగుల నుంచే వసూలు చేస్తుంటాయి. నిజంగా ఈ మందుల వల్ల ప్రజల ఆరోగ్యాలు బాగుపడుతున్నాయా అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. ఈ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మందులు తయారుచేస్తాయి. అక్కడి భూమి, నీరు, గాలిని కాలుష్యమయం చేసి ప్రజలు, జంతువులు, పక్షుల, జలచరాల ఆరోగ్య పతనానికి కారణమవుతున్నాయి. ఆ మందులు అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ధరలకు అమ్ముకొని లబ్ధి పొందుతున్నాయి.

అమెరికన్‌ సెనెటర్‌ బెర్నీ సాండర్స్‌ 2016 ఎన్నికల్లో డెమొక్రాట్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌తో పోటీపడ్డారు. మళ్ళీ 2020లో పోటీ పడనున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ‘ఔషధ సంస్థల ఆగడాలకు ఏదో ఒకటి చేయాలి. అది వాషింగ్టన్‌లోనే మొదలుకావాలి. కానీ వాషింగ్టన్‌ వారి సొంతం’ అని వాపోయారు. వందలో 93 మంది సెనెటర్లు ఎన్నికల కోసం ఔషధ సంస్థల నుంచి డబ్బులు స్వీకరించినవారే అని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ఔషధ సంస్థల ప్రాధాన్యం ఏమిటో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వ్యాధి కంటే ముందు, మందు కొనలేక రోగి మృత్యుముఖంలోకి వెళ్తున్నాడు. ఒకవేళ మందులు కొంటే మిగతా కుటుంబం రోడ్డునపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదీ నేటి ప్రజారోగ్య పరిస్థితి!

* ఔషధ ధరలను ఆయా సంస్థలు గత అయిదేళ్లలో 100 నుంచి 500 శాతంపైన పెంచాయి. వాలియంట్‌ కంపెనీ (ఇప్పుడు బాష్‌ హెల్త్‌) నైట్రోప్రెస్‌ ధరను 212 శాతం, ఐసుప్రీల్‌ను 512 శాతం  అధికం చేశాయి. నైట్రోప్రెస్‌ను శస్త్రచికిత్స సమయంలో రక్తపోటు తగ్గించడానికి వాడతారు. ఐసుప్రీల్‌ను గుండె అతి నెమ్మదిగా కొట్టుకోవడానికి వాడతారు. దీనిలో మూడు స్థాయులు ఉంటాయి. ఇది మూడో స్థాయికి చేరుకున్నప్పుడు గుండెపోటు వస్తుంది. దీన్నే ఆంగ్లంలో ‘బ్రాడీకార్డియా’ అంటారు.

* ‘స్పిన్రాజా’ మందు సంవత్సరానికి సరిపోయే డోసు ఖర్చు మొదటి సంవత్సరం 7.50 లక్షల డాలర్లు (దాదాపు 5.17కోట్ల రూపాయలు), రెండో సంవత్సరం నుంచి డోసులు తగ్గుతాయి. అందువల్ల  3.50 లక్షల డాలర్లు (రూ.2.4 కోట్లు) ఖర్చవుతాయి. అరుదైన వెన్నెముక కండరాలను నియంత్రించే నరాలకు సంబంధించిన జబ్బుకు  ఈ ఔషధాన్ని వాడతారు.

Back to top