బహు విధాల వైవిధ్యభరితం

03/19/2019
బహు విధాల వైవిధ్యభరితం 

సార్వత్రిక ఎన్నికల మహాపర్వం

ఓట్ల పండగ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం. చైనాలో మనకన్నా అధిక జనాభా ఉంది. అయినప్పటికీ అది ప్రజాస్వామ్య దేశం కాకపోవడంతో ఆ ఘనత మనకే దక్కింది. ఎన్నికలు దాదాపు 90 కోట్ల మంది ఓటర్లతో, వైవిధ్యభరిత వాతావరణంలో జరగనున్నాయి. ఈసారి కోటిన్నర మంది ఓటర్లు తొలిసారి ఓటు వేయబోతున్నారు. నేరచరిత్ర గలవారు ఆ వివరాలు ప్రమాణపత్రం(అఫిడవిట్‌)లో పొందుపరచడంతోపాటు, వివరాలను స్థానిక మీడియాలో ప్రచురించాల్సి ఉంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ప్రజలు సి-విజిల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు తెలియజేసే సదుపాయం కల్పించారు. ఇది ఎన్నికల సక్రమ నిర్వహణకు, ప్రజాధికార సాధనకు ఓ ముందడుగు. అయితే ఇది దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

సహనానికి పరీక్ష 
ఎన్నికల కాలపట్టికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొన్నింటిపై ఎన్నికల సంఘం ఇప్పటికే వివరణ ఇచ్చింది. రంజాన్‌ పండగ సమయంలో ఎన్నికల నిర్వహణ వల్ల ముస్లిములు అధిక సంఖ్యలో ఓటింగులో పాల్గొనరని కొంతమంది వాదిస్తున్నారు. శుక్రవారాలు ఎన్నికలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, మొత్తం రంజాన్‌ మాసమంతా ఎన్నికలను మినహాయించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టీకరించింది. హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఒవైసీ సైతం అది పెద్ద సమస్య కాదన్నారు. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ పార్లమెంట్‌ స్థానానికి మూడు దఫాలుగా ఎన్నిక నిర్వహించనుండటం ఓ ప్రత్యేకత. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు తొమ్మిది దఫాలుగా ఎన్నికలు నిర్వహించగా ఈసారి ఏడు దఫాలకు కుదించారు. పోయినసారి మొత్తం తొమ్మిది దఫాలకు కలిపి 40 రోజుల సమయం తీసుకుంటే ఈసారి ఏడూ దఫాలకు 43 రోజులు పట్టడం విశేషం. 21వ శతాబ్దంలో ఇన్ని రోజుల ఎన్నిక ప్రక్రియ ప్రజల సహనానికి పరీక్ష లాగా ఉంది. వేగానికన్నా, లోపరహిత, నిష్పక్షపాత ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈ ఎన్నికల సమయంపై మున్ముందు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించనుండటం కొంత విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల నిర్వహణ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. భద్రతా దళాల అందుబాటు, రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులు, ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలు లాంటి అనేక అంశాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నడూ లేనివిధంగా అతి జాగ్రత్తలు తీసుకున్నారా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే విషయమై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి దఫాలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం దక్షిణ, ఈశాన్య భారతాల్లో ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో అంటే ఏప్రిల్‌ 23తో ముగియనుండటం విశేషం. ఈ రెండు ప్రాంతాలు అతితక్కువ సమయంలో తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి వచ్చినా తరవాత నెలరోజుల పాటు ఫలితాల కోసం నిరీక్షించడం పెద్ద పరీక్షే.

ఎన్నికల్లో ప్రభావిత అంశాలు ఏమిటనే దాన్నిబట్టి ఫలితాలు ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి పార్టీ తనకు అనుకూలమైన అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుత విధానంలో ఓట్ల శాతమే ప్రధానం కాదు. మెజారిటీ సీట్ల గెలుపే ముఖ్యం. ఆ మేరకు వ్యూహాలు అవసరం. కొన్ని సందర్భాల్లో పొత్తులు ఎంత ముఖ్యమో, పొత్తులు పెట్టుకోకపోవడమూ అంతే అవసరం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైకాపా, జనసేన ఈ విషయంలో ఒకే విధానాన్ని అనుసరించాయి. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌తో పొత్తుకు ఇవి సిద్ధపడకపోవటం గమనార్హం. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో రెండు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టపోతామని భావించడంవల్లే అవి దూరంగా ఉన్నాయి. ప్రధాన జాతీయ పార్టీలను అంటరాని పార్టీలుగా చూడటం స్వాతంత్య్రానంతరం ఇదే మొదటిసారేమో. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సాధించిందనే చెప్పాలి. జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలంటే భాజపాను ప్రధాన వైరి పార్టీగా చూసినా, కాంగ్రెస్‌తో కూడిన కూటమిలో చేరితే ప్రయోజనం లేదని భావించి దానిని దూరంగా పెట్టడం ఉత్తర్‌ ప్రదేశ్‌లో చూస్తున్నాం.  ఎన్నికల ప్రభావిత అంశాలపై పార్టీలు దృష్టి సారించాయి. పుల్వామా సంఘటన ముందు, తరవాతా పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని అధికార భాజపా అంచనా వేస్తుంది. అప్పటివరకు ఈ అయిదేళ్ల పాలన తీరుతెన్నులపై ప్రజల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో పుల్వామా సంఘటన చోటుచేసుకోవడం, దానికి ప్రతిగా బాలాకోట్‌పై వాయుదాడితో ఉగ్రవాదులను  మట్టుబెట్టడం కలిసొచ్చిన అంశంగా ఆ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ప్రచార పర్వంలో జాతీయ భద్రతను ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తుంది. కఠినమైన రాజకీయ నిర్ణయాన్ని తీసుకోగలిగాం కాబట్టే దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశామని, పాకిస్థాన్‌ను ప్రపంచదేశాల్లో ఒంటరిని చేయగలిగామని చెబుతోంది. దీంతోపాటు అయిదేళ్ల పరిపాలన ఫలితాలనూ ప్రచారం చేసుకుంటోంది. ఇందుకు ప్రతిగా భాజపా సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తుతోంది. ధనికుల ప్రయోజనాలకే ఆ పార్టీ పాటుపడుతోందని, నిరుద్యోగం పెరిగిందని, గ్రామీణ ప్రజానీకం పరిస్థితి అధ్వానంగా తయారవుతుందని ఆరోపిస్తోంది. రఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతిని ప్రశ్నిస్తూ, మైనారిటీలు, దళితులకు వ్యతిరేకంగా భాజపా పనిచేస్తోందని ప్రచారం చేస్తోంది. ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే స్థానిక పరిస్థితుల్ని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలచుకుని ముందుగా వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్నాయి. అందువల్ల స్థానిక అంశాలే కీలకమవుతున్నాయి. విభజన తరవాత రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రధాన ఎన్నికల అంశంగా ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేవు. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాదన్నది ఇక్కడి అధికార పార్టీ తెరాస అంచనా. అందువల్ల వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో కీలక పాత్ర పోషించాలన్నది దాని వ్యూహం. కులం, మతం, ప్రాంతం వంటి అంశాలూ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. నేటికీ 65 శాతం పైగా జనాభా గ్రామాల్లోనే ఉంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ల్లో ఎక్కువమంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. బిహార్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 89శాతం ప్రజలు కనీస సౌకర్యాలు లేని పల్లెల్లో ఉంటున్నారు.

సమస్యల సమాహారం 
దక్షిణ భారతదేశం లింగనిష్పత్తిలో మిగతా దేశం కంటే మెరుగ్గా ఉంది. కేరళలో పురుషులకన్నా మహిళలే అధికం. తమిళనాడులో దాదాపు సమానం. కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్డ్‌ కులాల జనాభా గణనీయం. పంజాబ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 32 శాతం షెడ్యూల్డ్‌ కులాల జనాభా ఉంది. తరవాత క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణా, తమిళనాడు ఉన్నాయి. ఈశాన్య భారతంలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా నామమాత్రమే. ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశాలో ఆదివాసీ జనాభా గణనీయం. ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, కేరళ, ఉత్తరాఖండ్‌లో నామమాత్రం. జమ్మూకశ్మీరుతోపాటు అసోం, పశ్చిమ్‌ బంగ, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, లక్షదీవుల్లో ముస్లిం జనాభా గణనీయ సంఖ్యలో ఉంది. ఈశాన్య భారతంలోని మిజోరాం, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లో దాదాపుగా లేనట్లే. కోటిన్నరమంది నూతన ఓటర్ల ప్రభావం సైతం ఫలితాలపై ఉంటుంది. ఉత్తర భారతం, పశ్చిమ భారతంలో గో సమస్యా ప్రభావం చూపనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లు ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ, బిహార్‌, తమిళనాడుల్లో 250 స్థానాలు ఉన్నాయి. వీటి ఒరవడినిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒక్క ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే 80 స్థానాలున్నాయి. ఎన్నికలు అభివృద్ధి అంశంపై మాత్రమే ఆధారపడి ఉండవు. సంక్షేమ పథకాలూ ప్రభావితం చేస్తాయి. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి!

Back to top