సంగీతానికే ధ్రువతార

03/19/2019
సంగీతానికే ధ్రువతార 

నేడు డీకే పట్టమ్మాళ్‌ శత జయంతి

సంగీతం భారతీయ సంప్రదాయ సంస్కృతులను పరిరక్షించుకుంటూ వస్తోంది. దేవతలకు సంబంధించిన మూలాలు ఈ కళకు ఉన్నాయి. సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పినట్లు, తాళశ్రుతి పరిజ్ఞానం కలిగిన గాయకులు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతారు. సంగీతాన్ని పూర్వకాలం నుంచీ ఎందరో గాయకులు సాధన చేస్తూ ఈ కళను సజీవ ఝరిగా ప్రవహింపజేశారు. మధ్య యుగంలో అక్కమహాదేవి, జయదేవుడు... పద్నాలుగు, పదిహేనో శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచార్యులు, క్షేత్రయ్య, పద్దెనిమిదో శతాబ్దంలో శ్యామ శాస్త్రి, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు లాంటి మహానుభావులు శుద్ధమైన మనసు కలిగి, సుస్వర భావుకులయ్యారు. ఇటీవలి కాలంలో సంగీత సాధనతో రసానుకూలమైన స్వరవిన్యాసంతో స్వభావ మధురంగా గానం చేసిన విదుషీమణి- దామల్‌ కృష్ణస్వామి పట్టమ్మాళ్‌! డీకే పట్టమ్మాళ్‌గా సంప్రదాయ సంగీత ప్రేమికులకు ఆమె సుపరిచితురాలు.

ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మి, ఎమ్‌ఎల్‌ వసంతకుమారి ఆమెకు సమకాలీనులు. కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్న త్రయంగా వీరు సుప్రసిద్ధులు. పట్టమ్మాళ్‌ తమిళనాడులోని కాంచీపురంలో ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1919 మార్చి 19న జన్మించారు. బాల్యంలో ఆమె పేరు అలమేలు. తండ్రి కృష్ణస్వామి దీక్షితార్‌, తల్లి కాంతామణి సైతం సంగీతజ్ఞులే! ఆడవాళ్ళ సంగీతాన్ని పెళ్ళి సంగీతంగానే అందరూ జమకట్టే కాలంలో వేదికనెక్కి సంగీత కచేరీలిచ్చిన మొట్టమొదటి మహిళ పట్టమ్మాళ్‌. ద్విజావంతి, రీతిగౌళ, పూర్ణ చంద్రిక, ఆరభి రాగాలు ఆమెకు ఇష్టమైనవి. ఈ రాగాలు గానం చేస్తుంటే తనకు దైవీభావనలు కలిగి హృదయం ఆర్ద్రత చెందుతుందని ఒక రేడియో ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. కర్ణాటక సంగీతంలో ఓ నూతనాధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాళ్‌. రాగం, తానం, పల్లవి కచేరీలను ప్రదర్శించిన మొదటి మహిళ ఆమె. అలంకారాలు, ధ్రువాది సప్తతాళాల్లో మిశ్రజాతి, చతురశ్రజాతి తాళాలను మారుస్తూ పక్క వాద్యాలకు ఆమె పరీక్ష పెట్టేవారట. రాగాల్లో ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ప్రేక్షకులకు లక్ష్యశుద్ధిని, సిద్ధిని కలిగిస్తూ రంజింప చేసేవారని ప్రముఖ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ ఒక సంగీత సభలో ప్రశంసించారు. పట్టమ్మాళ్‌ కర్ణాటక సంగీతంలో కొన్ని విప్లవాత్మక పోకడలను ప్రారంభించారు. అయినా ఆమె సంప్రదాయానికి పట్టం కట్టారు. తన పదమూడేళ్ల వయసులో (1932లో) మద్రాసు రసిక రంజని సభలో మొట్టమొదటి కచేరీ ఇచ్చారు. ఆ కచేరీలో ఆమె గానంచేసిన త్యాగరాయ కృతి ‘ఎందరో మహానుభావులు’(శ్రీరాగం) వింటూ సంగీతప్రియులు ఆదితాళం వేస్తూ ఆనందించారట. చెన్నై మహిళా సమాజంలో జరిగిన సంగీత సమ్మేళనంలో పాల్గొని తన పద్దెనిమిదో ఏట పట్నం సుబ్రహ్మణ్యయ్యర్‌ రాసిన కీర్తన ‘వలచివచ్చియున్న నాపై చలము సేతువేమిరా? సామి నే చెలువుడైన శ్రీ వేంకటేశ కలిసిమెలసి కౌగిలించ’ (నవరాగమాలిక) వర్ణం గానంచేసి పండితులను సైతం పరవశింపజేశారు. తొమ్మిది రాగాల మేళవింపుతో వర్ణం ఆర్ణవం చేయడం సులువైన సంగీత ప్రక్రియ కాదు.

పట్టమ్మాళ్‌కు పదేళ్ల వయసు(1929)లో తొలిసారి గ్రామఫోన్‌ రికార్డు కంపెనీకి పాడే అవకాశమొచ్చింది. త్యాగరాయ కృతులను గానం చేస్తున్నప్పుడు భావం చెడకుండా తెలుగు ఉచ్చారణా లోపం లేకుండా ఆలపించేవారు. కృతిలోని అర్థం చెడితే సంగీతం నిరర్థకం అవుతుందని ఆమె అనేవారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పాపనాశనం శివన్‌ ద్వారా ఆమె సినీ నేపథ్య సంగీత ప్రవేశం జరిగింది. త్యాగభూమి అనే చిత్రం ద్వారా 1939లో మొదటిసారిగా సినిమాలో పాడారు. సినిమాల్లో పాడినా, భక్తిగీతాలకే పరిమితమయ్యారు. శృంగార గీతాలు పాడడానికి సుముఖత చూపలేదు. ఆమె పాడిన చిట్టచివరి సినిమా పాట కమల్‌హాసన్‌ నిర్మించిన ‘హే రామ్‌’ చిత్రంలోని మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ గీతం.

పట్టమ్మాళ్‌ ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేశారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ , శ్రీలంక వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తన ఇరవయ్యో ఏట ఆర్‌.ఈశ్వరన్‌ను వివాహమాడారు. ఆమెను వరించిన బిరుదులూ సత్కారాలు అన్నీ ఇన్నీ కావు. 1961లోనే సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. సంగీత కళలో అత్యంత ఉన్నతమైన సంగీత కళానిధి బిరుదును 1970లో పొందారు. 1971లో  పద్మభూషణ, 1998లో పద్మవిభూషణ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. సంగీతం పట్ల ఆమెకు ఎంతటి నిబద్ధత ఉండేదో దిల్లీలో ఆమె కచేరీ సందర్భంగా జరిగిన సంఘటన విశదీకరిస్తుంది. అది దాదాపు అరవై ఏళ్లనాటి సంగతి. దిల్లీ ఆలిండియా రేడియో ప్రజల సమక్షంలో సంగీత సమ్మేళన్‌ కచేరీలు ఏర్పాటు చేశారు. వీటిని రికార్డుచేసి తరవాత రేడియోలో ప్రసారం చేసేవారు. 1950లో ఆలిండియా రేడియో సంగీత్‌ సమ్మేళన్‌లో పట్టమ్మాళ్‌ దేవగాంధారి రాగంలో ‘సీతా వర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ పాడుతుండగా, చిన్నగా భూమి కంపించడంతో ప్రేక్షకులు భయంతో చెల్లాచెదురయ్యారు. వాయిద్యకారులూ కంగారు పడ్డారు. ప్రకంపనలు తగ్గాక ప్రేక్షకులు లోపలికి వచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఇంకా పాడుతూనే ఉన్నారు. విషయం చెప్పగానే, ఆమె చిరునవ్వుతో- ‘భూకంపం వచ్చి నా ప్రాణం పోవాలని రాసుంటే అదెలాగూ జరుగుతుంది. ప్రాణంపై తీపితో కచేరీ చెయ్యకుండా ఇచ్చిన మాట తప్పిందన్న అప్రతిష్ఠ నాకు చావు లాంటిదే. నేను సంగీతానికే కట్టుబడి ఉన్నాను. అదే నా ఊపిరి’ అన్నారామె. సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతారగా దశాబ్దాల తరబడి కొనసాగిన దామల్‌ కృష్ణస్వామి పట్టమ్మాళ్‌ జులై 16, 2009న సంగీత సామ్రాజ్యాన్ని విడిచి గంధర్వ లోకాలకు వెళ్లిపోయారు. ఆమె సంగీత ప్రతిభ అనితరసాధ్యం!

Back to top