అంగడి సరకుగా వ్యక్తి సమాచారం

03/20/2019
అంగడి సరకుగా వ్యక్తి సమాచారం

ఈ-వాణిజ్య విధానంలో భద్రతపై కసరత్తు

సాంకేతికత, సమాచారం (డేటా) ఈ-కామర్స్‌ రథానికి జోడు గుర్రాల్లాంటివి. సాంకేతికత రోజురోజుకూ మారిపోతుంటే, సమాచార రాశి నానాటికీ విస్తృతమవుతోంది. ఈ రెండింటితో ఏర్పడే డిజిటల్‌ సీమలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ). వస్తుసేవల విక్రేతలు, వ్యాపారుల మధ్య అనుసంధానం ఏర్పడుతోంది. ఈ లంకె వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలి. అందుకోసం వారి కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే సమాచారంపై వారికే హక్కు ఉండేలా నియంత్రణ చట్రాన్ని రూపొందించాలి. స్వదేశీ వ్యవస్థాపకులు ఈ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో నిర్దేశించే నియమావళిని రూపొందించాలి. సరిగ్గా ఈ లక్ష్యాలతోనే కేంద్రం జాతీయ ఈ-కామర్స్‌ విధానాన్ని సిద్ధం చేసి ఈ నెల 29లోగా వివిధ వర్గాల నుంచి వ్యాఖ్యలు కోరింది. ఈ విధానం సమాచారాన్ని (డేటా) ఓ ఆస్తిగా పరిగణిస్తోంది. స్వదేశంలో ఉత్పన్నమయ్యే డేటా సంరక్షణకే కాకుండా, దాన్ని నిల్వచేసి, విశ్లేషించి ఉపయోగించుకోవడానికి తోడ్పడే సాధనాలకూ నియంత్రణ ప్రమాణాలను ఈ విధానంలో రూపొందించారు. అంతర్జాల వేదికల ద్వారా ఎగుమతులు పెంచడానికి, ఈ-కామర్స్‌ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి ఈ-కామర్స్‌ విధానం తోడ్పడనుంది. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం అనుక్షణం ఎంతో సమాచారాన్ని సృష్టిస్తున్నారు. వ్యక్తుల బ్యాంకింగ్‌, కార్డు లావాదేవీలు, వాహనాల సంచారం ద్వారా ఉత్పన్నమయ్యే సమాచారం ఒక ఉదాహరణ. దాని శాస్త్రీయ విశ్లేషణ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుంది. కంపెనీలు సమాచారం మీద ఆధారపడి వ్యాపార నమూనాలను రూపొందించుకొంటున్నాయి. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తుసేవల కోసం శోధించడం మొదలుపెట్టగానే సంబంధిత వ్యాపార ప్రకటనలను అతడి దృష్టిలోపడేట్లు చేసేది డేటాయే. దీని సాయంతో అతడు లేక ఆమె అభిరుచులకు నప్పే వస్తుసేవలను సిఫార్సు చేయవచ్చు కూడా. ఈ విధంగా డేటాకు అదనపు విలువ సమకూరుతోంది. అయితే, వినియోగదారుడి ఆసక్తులు, కొనుగోలు అలవాట్లు... ఇత్యాదికి సంబంధించిన సమాచారం మీద అతడికే హక్కు ఉంటుంది. అతడి అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని ఇతరులు ఉపయోగించుకొంటే కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు, సంస్థల సమాచార గోప్యతకు భరోసా ఉండాలి.

డిజిటల్‌ పెట్టుబడి
కృత్రిమ మేధ (ఏఐ) అపార సమాచార రాశిని చిటికెలో విశ్లేషించి వినియోగార్హంగా మార్చేస్తోంది. తన సమాచారం ఎప్పటికప్పుడు బ్యాంకులకు, కంపెనీలకు చేరిపోతోందని వినియోగదారుడికి తెలియనే తెలియదు కూడా. ఏకకాలంలో లక్షల మంది వినియోగదారుల సమాచారం వచ్చిపడుతుంటే, దాన్ని క్షణాల్లో విశ్లేషించి ఇచ్చే శక్తి కంప్యూటర్లు, ఏఐ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)కి ఉంది. ఈ డేటాను డిజిటల్‌ పెట్టుబడిగా పరిగణించవచ్చు. ఇది పారిశ్రామిక పెట్టుబడికి, మేధా హక్కులకు ఏమాత్రం తీసిపోదు. ఎవరి వద్ద ఎక్కువ డిజిటల్‌ పెట్టుబడి ఉంటే వారికి పోటీదారుల మీద పైచేయి లభిస్తుంది. సరైన డేటా లేని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, అంకుర పరిశ్రమలు వ్యాపారంలో నిలదొక్కుకొని ఎదగడం చాలా కష్టం. కాబట్టి ఇవి కూడా సమాచార రాశిని క్రమబద్ధంగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలి. ప్రస్తుతం అతికొద్ది సంస్థలు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ఏలుతున్నాయి. వీటి పోటీని తట్టుకొని నిలబడటం కొత్త సంస్థలకు కష్టంగా ఉంది. డిజిటల్‌ సీమలో అందరికీ సమానావకాశాలు కల్పించడం జాతీయ ఈ-కామర్స్‌ విధాన అంతస్సూత్రం కావాలి. నేడు అంతర్జాలంలో ఏ చిన్న వ్యాపార లావాదేవీ జరిపినా ఆరోగ్య, వాతావరణ, సామాజిక మాధ్యమ సమాచారాన్ని పోస్ట్‌ చేసినా విస్తృత సమాచారం ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 14 ఏళ్లు పైబడినవారు 550 కోట్లమంది ఉన్నారు. వీరిలో 250 కోట్లమంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) రేపు 5,000 కోట్ల సాధనాలను అంతర్జాలంతో అనుసంధానిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు, ఐఓటీ సాధనాల ద్వారా అనంత సమాచారం ఉత్పన్నం కానుంది. దీన్ని పరిశీలించడం ద్వారా వ్యక్తులు, సంస్థల అలవాట్లు, అవసరాలు, అభిరుచులను తెలుసుకోవచ్చు. వాటిని తీర్చగల వస్తుసేవలను విక్రయించి లాభాల పూలు పూయించవచ్చు. ఈ పని చేయగల అల్గొరిథమ్స్‌ రూపకల్పన అంకుర సంస్థలకు కల్పతరువు అవుతుంది. సామాజిక మాధ్యమాలు, సెర్చ్‌ ఇంజిన్ల ద్వారా లభించే సమాచారంతో అనువాద సేవలు, దృశ్యపరమైన గుర్తింపు ప్రక్రియ సుసాధ్యమవుతాయి.

మున్ముందు వాణిజ్యపరంగా ఉపయోగకరమైన డేటాకు భారత్‌ పెద్ద ఉత్పత్తి స్థానంగా అవతరిస్తుంది. ఒక సంస్థ ఎంత పెద్దదైతే దాని నెట్‌వర్క్‌ల ద్వారా అంత పెద్ద సమాచార రాశి అందుబాటులోకి వస్తుంది. ఇందులో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల సమాచారమూ అంతర్భాగంగా ఉంటుంది. ఈ లెక్కన మున్ముందు ఒక వ్యక్తి తన సొంత సమాచారం కోసం పెద్ద సంస్థలను అభ్యర్థించే రోజు వస్తుందా అన్నది ప్రశ్న. అదే బిగిన తన పౌరుల సమాచారం కోసం సాక్షాత్తూ ప్రభుత్వమే కార్పొరేట్లకు రుసుములు చెల్లించుకోవలసి వస్తుందా? ఈ ప్రశ్నలకు జాతీయ ఈ-కామర్స్‌ విధానం సమాధానమివ్వాలి. ఈ-కామర్స్‌తోపాటు ఆధార్‌, భీమ్‌, ఈ-కేవైసీ, జీఎస్టీ యంత్రాంగం ద్వారా కూడా పౌరుల సమాచారం సర్వర్లకు చేరిపోతోంది. ఈ సమాచారంపై పౌరులకే హక్కు కల్పించే చట్టపరమైన ఏర్పాట్లను వేగంగా చేపట్టాలి. భారతీయుల సమాచారం సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లకుండా నిరోధించే చట్టాలేమీ లేకపోవడం పెద్ద లోపం. మన సమాచారాన్ని మనమే విశ్లేషించుకుంటే అధిక విలువ గల డిజిటల్‌ ఉత్పత్తులను రూపొందించవచ్చు. ప్రస్తుతం మన ఐటీ కంపెనీలు విదేశాల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించడంతో సరిపెట్టుకొంటున్నాయి. ఈ పొరుగు సేవల ద్వారా లభించే ఆదాయమే వాటికి అండ. ఇకనైనా భారతీయులసమాచారాన్ని దేశాభివృద్ధికే ఉపయోగించాలి. కొన్ని సాధనాలు, వర్గాల నుంచి సేకరించిన సమాచారం భారత్‌ ఎల్లలు దాటి విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి చట్టపరమైన, సాంకేతికపరమైన నిబంధనల చట్రాన్ని ఏర్పరచాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లోని ఐఓటీ సాధనాలు సేకరించిన సమాచారం, ఈ-కామర్స్‌, సామాజిక మాధ్యమాలు, సెర్చ్‌ ఇంజిన్ల వినియోగదారులు ఉత్పన్నం చేసిన సమాచారం విదేశీ సంస్థలు, ప్రభుత్వాల చేతుల్లో పడకుండా చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.


 

ఉపాధికి కొత్త అవకాశాలు

భారతదేశంలో ఈ-కామర్స్‌ ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు రకరకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. వాటి బట్వాడా ద్వారా అనేకులకు ఉపాధి లభిస్తోంది. దూరప్రాంతాల్లో, మారుమూలల్లో, గ్రామాల్లో ఉన్న విక్రేతలు, ఉత్పత్తిదారులు సైతం ఈ-కామర్స్‌ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులను చేరగలుగుతున్నారు. చేతివృత్తులవారు, సంప్రదాయ వస్తు తయారీదారులు, విశిష్ట వస్తు ఉత్పత్తిదారులకూ ఈ-కామర్స్‌ వరంగా పరిణమించింది. బయటి ప్రపంచానికి తెలియని విక్రేతలు, ఉత్పత్తిదారులకు ఈ-కామర్స్‌ తక్షణ మార్కెట్‌ను అందిస్తోంది. వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్ల వంటి సేవల సరఫరాదారులూ నేరుగా ఆన్‌లైన్‌లో వినియోగదారులను కలవగలుగుతున్నారు. ఈ విధంగా ఆన్‌లైన్‌ వేదికలు నిపుణ కార్మికులకు ఉపాధి అవకాశాలు, వినియోగదారులకు సత్వర సేవలను అందిస్తున్నాయి.

సార్వభౌమ నిధి
భారతదేశంలో సమాచారాన్ని సేకరించి విశ్లేషించి విదేశాల్లో నిల్వ చేసే సంస్థలు కొన్ని నిబంధనలకు లోబడి పనిచేయాలి. అవేమంటే- విదేశాల్లో నిల్వ చేసిన భారతీయ డేటాను వినియోగదారుడి అనుమతి ఉన్నా కూడా విదేశీ సంస్థలకు అప్పగించరాదు. మూడో పార్టీకీ ఇవ్వకూడదు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ ప్రభుత్వాలకు అందించకూడదు. విదేశాల్లో దాచిన భారతీయ డేటాను భారత ప్రభుత్వం కోరిన వెంటనే అందించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించే స్వదేశీ, విదేశీ సంస్థలను కఠినంగా శిక్షించాలి. జనాభా రీత్యా ప్రపంచంలో రెండో స్థానం ఆక్రమిస్తున్న భారతదేశంలో యువజనుల శాతం చాలా అధికం. వీరి అభిరుచులు రేపటి విపణి స్వరూప స్వభావాలను తీర్చిదిద్దనున్నాయి. తద్వారా భారత్‌ వాణిజ్య సమాచార ఖనిగా మారనుంది. ఇది జాతి ఆస్తి కాబట్టి దానిపై భారత ప్రభుత్వానికి, ప్రజలకు మాత్రమే హక్కు ఉంటుంది. విదేశీయులకు అది ఉండదు. వ్యక్తుల ఆనుపానులను గోప్యంగా ఉంచినా వారి సమాచారం నుంచి లాభాలు పిండుకునే అధికారం ఇతరులకు లేదు. పౌరుల సమాచారం సామాజిక ఆస్తి. జాతీయ ఈ-కామర్స్‌ విధానం ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తుల సమాచార రక్షణకు, వారి గోప్యతకు చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. వ్యక్తిగత వినియోగదారులు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, అంకుర సంస్థలకు కూడా పెద్ద సంస్థల మాదిరిగా డేటా వినియోగంలో సమానావకాశాలు కల్పించాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో నిరంతరం వస్తున్న మార్పులకు అనువైన విధానాల రూపకల్పనకు ప్రభుత్వం అప్రమత్తత ప్రదర్శించాలి. ఈ-కామర్స్‌ వల్ల ప్రజలు, ఉత్పత్తిదారులు, వ్యాపారులు లబ్ధి పొందుతారు కాబట్టి ఈ రంగం ప్రగతి మందగించకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకొంటూ ఉండాలి. ఈ-కామర్స్‌ నియంత్రణలో పలు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి అనుభవంలో తేలిన అంశాలను బట్టి జాతీయ చట్టాన్ని రూపొందించాలి. తద్వారా ఈ-కామర్స్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందే వాతావరణం కల్పించాలి.

Back to top