నగరాలకేదీ పునరుజ్జీవం?

03/21/2019
నగరాలకేదీ పునరుజ్జీవం?

భారత్‌లోని నగరాల పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారుతోంది. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో పద్దెనిమిది- భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌లలోనే ఉన్నాయి. వీటిలో 15 భారతీయ నగరాలే కావడం గమనార్హం. గురుగ్రామ్‌, ఘజియాబాద్‌లు కాలుష్య నగరాల జాబితాలో తొలి వరసలో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ పదకొండో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ చెడ్డపేరు తెచ్చుకొంది. నగరాల తలరాత మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆకర్షణీయ నగరాల’ (స్మార్ట్‌ సిటీస్‌) కార్యక్రమం సరిగ్గా పట్టాలకెక్కలేదన్న వాస్తవాన్ని రుజువు చేస్తున్న దాఖలాలివి. ‘ఆకర్షణీయ నగరాల’ రూపకల్పన కార్యక్రమం 2015లో ప్రారంభమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలో భాజపా దీన్ని ఒక ప్రధాన అంశంగా చేర్చింది. అందులో భాగంగా 2015లో 100 నగరాలను ఈ పథకం కింద ఎంపిక చేసింది. దీని ద్వారా దేశ పట్టణ వ్యవస్థలో పలు నిర్మాణాత్మక మార్పులు సాకారమవుతాయని... పట్టణాలు, నగరాలను నవీకరిస్తే అవి సరికొత్త జవజీవాలు సంతరించుకొని అద్భుతంగా రూపాంతరం చెందుతాయన్న ప్రచారం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,041 పట్టణాలు, నగరాల్లో కేవలం వంద నగరాలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. వివిధ పట్టణాలు, నగరాల బాగుసేతకు సంబంధించి ఘనంగా ప్రకటించిన అనేక ప్రాజెక్టులు ఆచరణలో అమలుకు నోచుకోలేకపోతున్నాయి. మొదలుపెట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న పరిస్థితుల్లో ‘ఆకర్షణీయ నగరాల’ నిర్మాణం అందమైన స్వప్నంగానే మిగులుతోంది.

కాటేస్తున్న కాలుష్యం
వాయు కాలుష్యంవల్ల ఏటా దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 60 వేల మందికిపైగా మరణిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. విషధూమాల కారణంగా పిల్లల మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో; నైజీరియా, పాకిస్థాన్‌లు ఆ తరవాతి స్థానాల్లో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దేశంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాద స్థాయులకు చేరింది. ప్రపంచంలో వాయుకాలుష్యం వల్ల మరణిస్తున్నవారిలో 25శాతం భారత్‌లోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో 90శాతం అంటే సుమారు 180 కోట్ల మంది కాలుష్య ధూమాన్నే పీలుస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కాలుష్యధూమం విస్తరించడానికి ప్రధాన కారణం నగరాల్లో అడ్డూఆపూ లేకుండా పెరుగుతున్న వాహనాలు. దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లో మేలైన ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించుకోవడంలో ప్రభుత్వాల వైఫల్యమే ఇన్ని విపరిణామాలకు అంటుకడుతోందన్నది కాదనలేని సత్యం.

దేశ నగరాల్లో అత్యంత వేగంగా ప్రజల జీవన సరళి, అలవాట్లు మారిపోతున్నాయి. పట్టణాలనుంచే కాకుండా పల్లెపట్టులూ పెద్దయెత్తున నగరాలకు వలస వెళుతున్నారు. తగినంత చదువులేని యువత సమీప పట్టణాలు, నగరాల్లో అసంఘటిత కార్మికులుగా చేరుతున్నారు. వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో రైతులు సేద్యాన్ని విడిచి నగరాల బాటపడుతున్నారు. చేతివృత్తులకు ఆదరణ కొరవడటంతో కులవృత్తులు మూలనపడి ఎంతోమంది నగరాలకు కుటుంబసమేతంగా వలసపోతున్నారు. ఈ కారణాలవల్ల గడచిన అయిదేళ్లలో దేశంలోని పట్టణాలు, నగరాల్లో జనాభా కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. ‘ఆకర్షణీయ నగరాల’ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పట్టాలకెక్కించాల్సిన కీలక తరుణంలో ప్రభుత్వాధినేతల్లో ఆ స్థాయి ఉత్సాహం కనిపించకపోవడం బాధాకరం. ‘స్మార్ట్‌ నగరాల’ కింద మొత్తం నిధుల్లో 16.70 శాతాన్ని పట్టణ రవాణా పద్దుకు కేటాయించారు. అతి ముఖ్య రంగాలైన పారిశుద్ధ్య నిర్వహణకు 2.4 శాతం, మంచినీటి సరఫరాకు 5.34 శాతం, మురుగునీటి నిర్వహణకు 4.53 శాతం నిధులు కేటాయించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి 6.17 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీల్లో చేపడుతున్న ప్రాజెక్టులకయ్యే వ్యయమంతా కేంద్రం భరించదు. అయిదేళ్లలో కేవలం రూ.48 వేలకోట్లను గ్రాంటు రూపంలో ఇస్తుంది. ఇది స్మార్ట్‌ నగరాల ప్రతిపాదిత విలువలో 23.4శాతం మాత్రమే. అంటే ఒక్కొక్క నగరానికి సగటున కేంద్రం అయిదేళ్లలో రూ.480 కోట్లు ఇస్తుంది. అందుకు సమానమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/పట్టణ స్థానిక సంస్థలు భరించాల్సి ఉంటుంది. దీనికితోడు రూ.42,028 కోట్లు (21 శాతం), ఇతర మిషన్లను ఏకీకృతం చేయడం ద్వారా రూ.41,022 కోట్లు (20 శాతం) పీపీపీ పద్ధతి ద్వారా సుమారు రూ.9,843 కోట్లు (4.8 శాతం), రుణాల ద్వారా రూ.2,644 కోట్లు (1.3 శాతం), మిగిలిన మొత్తాన్ని సొంత నిధుల ద్వారా, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు.

2016నుంచి 2019 జనవరి వరకు అంటే సుమారు నాలుగేళ్ల కాలంలో కేంద్రం తన వాటా కింద వచ్చే మొత్తంలో కేవలం రూ.10,915 కోట్లు అంటే 22.73 శాతం నిధులను మాత్రమే విడుదల చేసింది. విశాఖ, తిరుపతి, కాకినాడకు రూ.198 కోట్ల చొప్పున ఇప్పటివరకు ఇచ్చింది. అమరావతికి రూ.18 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాస్తవంగా ఎంపికైన ప్రతి నగరానికీ ఏటా రూ.100 కోట్లు చొప్పున అయిదేళ్లపాటు నిధులివ్వాలి. జరుగుతున్నది అందుకు భిన్నం. రాష్ట్ర ప్రభుత్వాల వద్దగాని, స్థానిక సంస్థల వద్దగాని ‘మ్యాచింగ్‌ గ్రాంటు’కు నిధులు లేనిపక్షంలో ఆ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. తమపై పూర్తిగా ఆధారపడవద్దని, అప్పుల ద్వారా నిధులు సేకరించి పనులు పూర్తిచేసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. దాంతో స్మార్టుసిటీలకు సంబంధించిన 32శాతం ప్రాజెక్టులను పీపీపీ కింద ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పారు. లక్ష్యాలకు భిన్నంగా ఈ పథకం అమలవుతోంది. విచిత్రమేమిటంటే నగరాన్ని పూర్తిగా కాకుండా కొద్దిభాగాన్ని మాత్రమే ‘స్మార్ట్‌సిటీ’ ప్రాంతంగా ఎంపికచేసి 80 శాతంనుంచి 90 శాతం నిధులు ఆ ప్రాంతానికే ఖర్చుచేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి నగరంలోనూ అప్పటికే బాగా అభివృద్ధి చెంది, మౌలిక వసతులు పుష్కలంగా ఉండి, ధనిక వర్గ ప్రజలు నివసించే ప్రాంతాలను ఎంపిక చేశారు. మొత్తం వంద నగరాల్లో 59 నగరాల్లో 80శాతం పైబడి ప్రాజెక్టులను అంటే లక్షా అయిదువేల కోట్ల రూపాయలను కేవలం 246 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల ప్రాంతాల్లోనే ఖర్చుచేస్తున్నారు. ఈ వంద నగరాల వైశాల్యం 9,065 చదరపు కిలోమీటర్లు. అంటే దీనిలో కేవలం 2.7 శాతం చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రాంతాన్ని మాత్రమే సిసలైన స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారన్నమాట!

లక్ష్యానికి ఆమడ దూరం
స్మార్ట్‌ నగరాల్లో తొలి ర్యాంకు సాధించిన ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మూడుశాతం వైశాల్యంలో, రెండో ర్యాంకు పొందిన పుణెలో 1.3శాతం వైశాల్యంలో అలాగే విశాఖలో 0.6 శాతం వైశాల్యంలో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. 2013నాటి కంపెనీల చట్టం కింద ‘స్మార్ట్‌ సిటీ లిమిటెడ్‌ కంపెనీ’లను సమాంతరంగా పనులు నిర్వహించేందుకుగాను ప్రత్యేకంగా స్మార్టు సిటీలను రిజిస్టర్‌ చేశారు. దీనికి అనుబంధంగా ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌’ను ఏర్పాటుచేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక నగరపాలక సంస్థకు 50:50 ప్రాతిపదికన ఈక్విటీ వాటాలుంటాయి. స్థానిక నగర పాలక సంస్థల వాటాల్లో 40శాతం వరకూ ప్రైవేటు సంస్థలకు అమ్ముకొనే వెసులుబాటు కల్పించారు. దేశవ్యాప్తంగా సుమారు 50 శాతం స్మార్ట్‌ సిటీ మిషన్‌ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఇంకా టెండర్లు ఆహ్వానించే స్థాయిలోనే మిగిలిపోవడం గమనార్హం. దాదాపు 39శాతం ప్రాజెక్టులు పూర్తి అయినవో లేదా పనులు కొనసాగుతున్నవో ఉన్నాయి. 2016లో మొదటిదశలో ఎంపికచేసిన 20 నగరాలు 2019-21 మధ్యకాలంలో పూర్తవుతాయని అంచనావేస్తే, రెండో దశలో ఎంపికచేసిన 40 నగరాలు 2019-22 మధ్యకాలంలో పూర్తవుతాయని అంచనాలు వినిపించారు. కానీ పనులు ఏ దశలోనూ ఆ స్థాయిలో సాగుతున్న సూచనలు లేవు. ఇప్పటివరకూ ప్రైవేటు రంగంనుంచి నిధులు సైతం ఆశించిన స్థాయిలో సమకూరకపోవడం మరో లోపం. కేంద్రంతో సమానంగా రాష్ట్రాలు, స్థానిక సంస్థలు నిధులను సమకూర్చాలి. ఇప్పటికే ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు నిధుల కొరతతో, లోటు బడ్జెట్‌తో పయనిస్తున్నాయి. ఫలితంగా ఎంపికైన ఈ నగరాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. పర్యావరణ సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతూ, జాతి జనుల జీవన భద్రత ప్రమాదంలో పడుతున్న తరుణంలో- అయిదేళ్ల కాలావధిలో ‘ఆకర్షణీయ నగరాల’ సాకారం దిశగా మాటలకు చేతలకు పొంతలేని పరిస్థితి నెలకొనడమే ఆందోళన కలిగిస్తున్న అంశం!

Back to top