అందరికీ నీరు... అందక కన్నీరు

03/22/2019
అందరికీ నీరు... అందక కన్నీరు

నేడు ప్రపంచ జల దినోత్సవం

నీటి ప్రాముఖ్యాన్ని ప్రజలు గుర్తించాలనే లక్ష్యంతో ఏటా మార్చి 22న ‘ప్రపంచ జల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. 1994 నుంచి ఐక్యరాజ్యసమితి ఏటా ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన నీటికి సంబంధించి పూచీ ఇవ్వాల్సి’న అవసరాన్ని ఉద్బోధిస్తూ ఈ ఏడాది ‘సమితి’ ప్రపంచవ్యాప్తంగా ప్రజా చేతనకు పిలుపిస్తోంది. ప్రతి ఒక్కరికీ తాగడానికి, గృహావసరాలకు అవసరమైన నీటిని అందచేయడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలన్నీ పనిచేయాలని అది లక్ష్య నిర్దేశం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేక కోట్ల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. స్త్రీలు, పిల్లలు, శరణార్థులు, వికలాంగులు అవసరమైన మేరకు తాగునీరు లేక భారంగా బతుకులు నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఉరుముతున్న నీటి సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారాలు సూచిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ప్రపంచ జలాభివృద్ధి నివేదిక, ‘సమితి’ బాలల సాంస్కృతిక విద్యానిధి అనేక మార్గాలను ప్రతిపాదించాయి. వాటి అమలులో తగిన శ్రద్ధ కొరవడటం వల్లే దురవస్థ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 210 కోట్ల ప్రజలకు రక్షితనీరు అందుబాటులో లేని విపత్కర పరిస్థితులున్నాయి. నాలుగింట ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కొరవడింది. తాగడానికి శుభ్రమైన నీరు దొరకక కలుషిత నీటితోనే గొంతు తడుపుకొంటున్న అభాగ్యులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అపరిశుభ్ర నీటి వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజూ అయిదేళ్లలోపు వయసున్న పిల్లలు వేల సంఖ్యలో చనిపోతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి.

ప్రజారోగ్యానికి ప్రమాదం
ఇంచుమించు గ్రామాలన్నీ శుభ్రమైన నీటికి దిక్కులేని స్థితిలోనే మగ్గుతున్నాయి. వివిధ కారణాలవల్ల వలసవెళ్ళిన 6.85 కోట్ల ప్రజలకు రక్షిత తాగునీరు దుర్భర సమస్యగా పరిణమించింది. ప్రపంచంలో సుమారు 15.90 కోట్ల ప్రజలు చిన్నపాటి కుంటలు, వాగులు, ఇతర ఉపరితల వనరుల నుంచి లభ్యమయ్యే అరక్షిత నీటిని ఉపయోగించి రోగాలపాలవుతున్నారు. 2030 నాటికి దాదాపు 70 కోట్ల ప్రజలు ముమ్మరించిన నీటి కొరత వల్ల నిర్వాసితులవుతారన్న అంచనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎవరైనా, ఎక్కడున్నా నీటిని పొందటం ప్రజలందరి ప్రాథమిక హక్కు. సురక్షిత జలం అందుబాటులో ఉన్నప్పుడే ప్రజారోగ్యం సాధ్యమవుతుంది. సమాజాభివృద్ధి సాకారమవుతుంది. పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటిని ప్రపంచ ప్రజల ‘ప్రాథమిక హక్కు’గా 2010లో ఐరాస గుర్తించింది. ఈ హక్కు క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే సంపూర్ణ మానవ వికాసం సాధ్యపడుతుంది. నీటిపై ప్రాథమిక హక్కు లభించినప్పుడే ప్రజలందరూ తమ వ్యక్తిగత, పారిశుద్ధ్య, పంట పొలాలకు సురక్షిత జలాన్ని పొందగలుగుతారు.

వాతావరణ మార్పులు, జనాభావృద్ధి, వలసలవల్ల నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నీరు అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. నీటికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆయా వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి. వారి అవసరాలను తీర్చడానికి తగిన మేరకు నిధులను సమకూర్చడం అవసరం. సామాజిక మాధ్యమాల ద్వారా నీటి సంక్షోభం, దానివల్ల కలిగే ఇబ్బందులను ప్రజలకు తెలియజేస్తూ వారిని జాగృతం చేయడం వల్ల  ఫలితం ఉంటుంది. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేయాలి. సామాజిక చైతన్యంతో తాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవాలి.

నీరు లేకుండా మానవజాతి మనుగడను, నాగరికతనూ ఊహించలేం. నీరు చాలినంతగా లభించనప్పుడు భూతలమంతా దుర్గంధభూయిష్ఠమై రోగాలు విజృంభిస్తాయి. జనాభా పెరుగుదల, నాగరికత అభివృద్ధి నీటి అవసరాలను మరింతగా పెంచాయి. వనరుల లభ్యత, వినియోగం తదనుగుణంగా పెరగకపోవటంతో సమతుల్యం దెబ్బతిని నీటికి ఇబ్బంది తలెత్తుతుంది.

నీటిని ప్రకృతి ప్రసాదిస్తున్న ఉచిత వనరుగా మనిషి భావించటం వల్లనే అది దుర్వినియోగమవుతోంది. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృథా ఎక్కువగా ఉంటోంది. అతివృష్టి సమయాలలో వరదలను అరికట్టేందుకు జలాశయాలను నిర్మించి, నీటిని నిల్వచేసి కాల్వల ద్వారా మళ్లించడం వల్ల ఆయకట్టు ప్రాంతాలలో పుష్కలంగా పంటలు పండుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జలాశయాలు లేనప్పుడు భారీగా వరదలు వచ్చి తీరప్రాంతాలను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా జన, ధన నష్టం అపారంగా ఉంటోంది.
నీటి కొరత కొన్ని దేశాలలో పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ జనాభాలో సుమారు 40 శాతం కలిగిన 80 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడితో సతమతమవుతున్నాయి. అనావృష్టి ఎంత భయంకరమో గుర్తించిన ఐక్యరాజ్యసమితి ‘సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి స్థాయిలతో నిమిత్తం లేకుండా సరిపడినంత పరిమాణంలో నాణ్యమైన నీటిని పొందే హక్కు ప్రపంచ ప్రజలందరికీ ఉంది’ అని తీర్మానించింది. ‘ప్రజలకు అవసరమైన నీటి సరఫరాపై చూపే శ్రద్ధాసక్తులను బట్టి పాలకుల సామర్థ్యాన్ని నిర్ణయించవచ్చు’ అని అరిస్టాటిల్‌ ఏనాడో పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో నేటికీ గుక్కెడు నీరు దొరకని ప్రజలు ఉన్నారంటే, అక్కడి పాలకుల శ్రద్ధాసక్తులు ఎలా ఉన్నాయో అర్థమవుతాయి.

నదుల పునరుజ్జీవంపై నిర్లిప్తత

కాలుష్య విష రసాయనాల బారినపడి కుములుతున్న గంగానదిని కాచుకోవాలని డిమాండ్‌ చేసి, నిరవధిక నిరాహార దీక్షకు దిగిన 35ఏళ్ల స్వామి నిగమానంద్‌, 82 ఏళ్ల స్వామి సనంద్‌లు ప్రాణార్పణ గావించిన విషాదాన్ని గడచిన కొన్నేళ్లలో గమనించాం. నదుల అనుసంధానం, నదీమతల్లుల గొప్పతనం గురించి వినసొంపైన ఉపన్యాసాలు ఇచ్చే ప్రభుత్వాధినేతలెవరికీ ఆచరణలో నదులకు పునరుజ్జీవం పోయాలన్న సంకల్పం లేదన్న వాస్తవాన్ని నిరూపించిన ఘటనలవి. దేశ భూభాగంలో 26 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగా నది ఆయకట్టు ప్రాంతం అయిదేళ్లనాటితో పోలిస్తే కాలుష్య కారకాల బారినపడి మరింత క్షీణముఖం పట్టిందన్నది కాదనలేని వాస్తవం. మలినాలను కడిగేసి గంగతోపాటు దేశంలోని అనేక నదులను తేటపరచడం గురుతర బాధ్యతగా దాదాపుగా జాతీయ పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రణాళికల్లో అందమైన కలలను ఆవిష్కరిస్తున్నాయి. తరచి చూస్తే గుండెలను పిండేసే వాస్తవాలే వెల్లడవుతున్నాయి. ప్రకృతి పరిరక్షణను రాజ్యాంగబద్ధ బాధ్యతగా గుర్తిస్తూ 2008లో ఈక్వెడార్‌ తీర్మానం చేసుకొంది. అట్రాటో నది ఆయకట్టు జీవమున్న ప్రాణుల తరహాలో ‘రక్షణ, నిర్వహణ, పునరుద్ధరణ’ హక్కులు కలిగి ఉందని కొలంబియా రాజ్యాంగ న్యాయస్థానం వెల్లడించింది. 2017లో న్యూజిలాండ్‌ పార్లమెంటు వాంగనుయి నది తక్షణ రక్షణకు అవసరమైన చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. నదులను కాపాడుకోవడాన్ని రాజ్యాంగ, చట్టబద్ధ హక్కులుగా గుర్తిస్తున్న ఈ దేశాలు ఆ మేరకు క్షేత్రస్థాయిలోనూ తిరుగులేని నిబద్ధతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నాయి. కాగా- నదీ సంరక్షణ, ప్రజలందరికీ పరిశుభ్రమైన నీటికి భరోసా కల్పించడం వంటివన్నీ ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్న దురవస్థ మన దేశంలో నెలకొంది.

వృథాను అరికడితేనే ఊరట
జనాభా పెరుగుదల, నీటి అవసరాల మధ్య గల అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వృథాను నియంత్రించి, నీటి వనరుల అభివృద్ధిని ముమ్మరం చేయాలి. నగరాలు, పట్టణాలలో జనసాంద్రతను తగ్గించడానికి, పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలి. వర్షపాతం అన్ని ప్రాంతాలలో అన్ని రుతువులలో సమానంగా ఉండటం లేదు. జూన్‌ నుంచి అక్టోబరు వరకు అయిదు నెలల్లోనే సుమారు 67 శాతం వర్షం కురుస్తుంది. వాననీరు భూమిపై పడిన తరవాత కొంత భాగం ఇంకిపోతుంది. మరికొంత సూర్యరశ్మికి ఆవిరవుతుంది. మిగిలిన సింహభాగం భూతలంపై ప్రవహిస్తుంది. వాగులు, నదుల ద్వారా ప్రవహించే నీటిని జలాశయాల్లో నిల్వచేసుకొంటున్నాం. ఇది 40 శాతం మాత్రమే. మిగిలినదంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నేలపై ప్రవహించే వాన నీటిని వివిధ సాంకేతిక ప్రక్రియల ద్వారా నిరోధించి, భూమిలో పూర్తిగా ఇంకింపచేయాలి. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది. వర్షేతర కాలంలో దానిని వెలికితీసి ఉపయోగించుకోవాలి.ఊట చెరువులు, చెక్‌డ్యాముల వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది. జనావాసాలలో కురిసే వర్షపునీటిని నేరుగా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి. నీటిపారుదల రంగానికి సరఫరా అవుతున్న నీటిలో 63 శాతం, గృహావసరాలకు వినియోగిస్తున్న నీటిలో 16 నుంచి 25 శాతం, పరిశ్రమలలో 20 శాతం, వాణిజ్య సంస్థలు ఉపయోగించే నీటిలో 10 శాతం వృథా అవుతోంది. నీటిని సమీకరించటం ఎంత ముఖ్యమో దుబారాను అరికట్టడం సైతం అంతే అవసరం. కాలువ గట్లకు లైనింగు చేసి, ఊట రూపంలో బయటకు పోతున్న నీటికి అడ్డుకట్ట వేయవచ్చు.

ఒకసారి ఉపయోగించిన నీటిని వృథా చేయకుండా శుద్ధిచేసి (రీ సైక్లింగ్‌) మరోసారి ఉపయోగపడేటట్లు చూడాలి. వాననీరు చాలనప్పుడు కాలువ నీటిని వాడుకోవాలి. ఆయకట్టులో ఆశించిన వర్షం పడనప్పుడు, కాలువ నీరు చాలనప్పుడు మాత్రమే భూగర్భజలాన్ని వాడుకోవాలి. దీని వల్ల వ్యవసాయ రంగానికి ఉపయోగించే నీరు ఆదా అవుతుంది. తద్వారా ఎక్కువ భూమిని సేద్యం చేసే అవకాశం కలుగుతుంది. ప్రాణావసరమైన నీటిని పొదుపుగా వాడుకోవడం, కాపాడుకోవడం, వృద్ధి చేయడం కీలకం. ఈ మేరకు ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం అన్నింటికన్నా ముఖ్యం!

Back to top