ఏకాకిగా పాకిస్థాన్‌

03/22/2019
ఏకాకిగా పాకిస్థాన్‌

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం చల్లబడింది. పాక్‌ సేనానులు ప్రస్తుతానికి ఒకింత స్తబ్ధతగా ఉన్నారు. భారత్‌లో పార్టీలు ఎన్నికల రంగుటద్దాల్లో నుంచి సరిహద్దు పరిణామాలను వీక్షిస్తున్నాయి. పుల్వామా దాడికి ప్రతిదాడితో తమ విజయావకాశాలు ఇనుమడించాయని భారతీయ జనతా పార్టీ భావిస్తుండగా, ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడంలో సఫలమయ్యారు. దాయాది దేశానికి సర్వకాల సర్వావస్థల్లో అండగా నిలబడే చైనా సైతం ఈసారి ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌పై చర్య తీసుకోవాలని ఇస్లామాబాద్‌ను కోరింది. భారత్‌ అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడం వల్లనే మన పైలట్‌ అభినందన్‌ను పట్టుబడిన వెంటనే పాక్‌ విడుదల చేయవలసి వచ్చింది. ఒత్తిడి దౌత్యానికి ఇదో మచ్చుతునక. ఇంతకుముందు జరిగిన ఏ యుద్ధంలోనూ భారతీయ పైలట్లు ఈవిధంగా విడుదల కాలేదు. అయినా పాకిస్థాన్‌ ఈ పరాభవం నుంచి బుద్ధి తెచ్చుకొంటుందని ఆశిస్తే పొరపాటే. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వల్ల పరిస్థితి మారిపోతుందనుకోవడం భ్రమ. ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో పెద్ద చదువులు చదివినా, ఆధునిక దృక్పథం ఒంటపట్టించుకున్నా సైన్యం ఖాతరు చేయదు. ఆయన స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడాన్ని అది అనుమతించదు. ప్రధానమంత్రి పదవి చేపట్టగానే ఇమ్రాన్‌ ఓ ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్తను తన సలహాదారునిగా నియమించుకోవాలనుకున్నారు. కానీ, సదరు నిపుణుడు అహ్మదియా తెగకు చెందినవాడంటూ కరడుగట్టిన ఇస్లామీయులు నానాయాగీ చేయడంతో ఆయన వెనక్కు తగ్గక తప్పలేదు. దైవదూషణ నేరంపై అరెస్టయిన పాకిస్థానీ క్రైస్తవ మహిళ అసియా బీబీ నిర్దోషి అని సుప్రీంకోర్టు ప్రకటించినా ఆమెను జైలులోనే ఉంచాలన్న మత ఛాందసుల ఒత్తిడికి ఇమ్రాన్‌ తలొగ్గారు. అలాంటి వ్యక్తి సైన్యాన్ని ఎదిరిస్తారని ఎలా ఆశించగలం? గతంలో ఇలా ఎదిరించిన ఓ ప్రధాని ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఆయన పేరు నవాజ్‌ షరీఫ్‌.

గతంలో భారత్‌ పలుమార్లు పాక్‌కు శాంతి హస్తం అందించినా పాక్‌ సైన్యం వాటిని వమ్ముచేస్తూ వచ్చింది. పాక్‌ పౌర ప్రభుత్వాలకు శాంతిపై ఆసక్తి ఉన్నా సైన్యం ముందు అవి అశక్తంగా మిగిలిపోయేవి.

పాక్‌ కుయుక్తులను, ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేయడమొక్కటే ఆచరణీయ పరిష్కారం. కానీ భారత్‌, పాక్‌లు అణ్వస్త్ర రాజ్యాలు కాబట్టి యుద్ధం వస్తే సర్వనాశనమేనని నిన్నమొన్నటి వరకు భావిస్తూ వచ్చాం. దీన్ని అలుసుగా తీసుకుని పాకిస్థాన్‌ జిహాదీ మూకలను భారత్‌పైకి ఉసిగొల్పుతూ వచ్చింది. వీటిని గట్టిగా ఎదుర్కొంటే అణు యుద్ధం వచ్చిపడుతుందని హెచ్చరికలు వినవచ్చేవి. అవన్నీ వట్టి మాటలని  బాలాకోట్‌ జైష్‌ స్థావరంపై దాడి ఘటన చాటిచెప్పింది. పాక్‌ దెబ్బకు ఎదురుదెబ్బ తీస్తే బుద్ధి తెచ్చుకొంటుందని ఈ దాడి నిరూపించింది. అది ఖాయంగా పెద్ద విజయం. ఒక్క విమాన దాడిలో ఎంతమందిని చంపామనేదానికన్నా శత్రువు ధీమాను ఎంతగా దెబ్బతీయగలిగామన్నదే ముఖ్యం. రణ తంత్రంలో ఇది కీలక సూత్రం.

పాకిస్థాన్‌ ఆర్థికంగా కుదేలై ఉంది. అది భిక్షపాత్రతో ధనిక దేశాల వద్దకు వెళుతోంది. చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు తమ అనుంగు మిత్రుడికి భారీగా నిధులు అందిస్తున్నా, అవి పేదలకు అందుతాయన్న నమ్మకం లేదు. మధ్యలో సైన్యమే మింగేస్తుందని ఈ దేశాలకు బాగా తెలుసు. పాకిస్థాన్‌లో అతిపెద్ద కర్మాగారాలు, వ్యాపారాలు, వ్యవసాయ క్షేత్రాలను సైన్యమే నడుపుతోంది. నిన్నమొన్నటి వరకు పాక్‌కు భారీగా ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు క్రమంగా నిధులకు కోతపెడుతోంది. అన్నం పెట్టిన చేతిని కరిచే తత్వం పాక్‌ సైన్యం సొంతమని తెలిసిరావడమే దీనికి కారణం. గడచిన కొద్ది నెలలుగా పాకిస్థానీ రూపాయి విలువ పడిపోయింది. నేడు ఒక డాలరు కొనాలంటే సుమారు 140 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు 11,100 కోట్ల డాలర్లకు చేరింది. ఇది నెలనెలా పెరుగుతూనే ఉంది. సౌదీ అరేబియా ఇచ్చిన 2,000 కోట్ల డాలర్ల సహాయం పాక్‌ కరెంటు ఖాతా లోటు ముందు సముద్రంలో నీటి బొట్టు లాంటిది.

భారత్‌తో యుద్ధం చేసే శక్తి పాకిస్థాన్‌కు లేదు. నిత్యం అంతర్గత కల్లోలంలో మునిగితేలుతూ, జిహాదీ ఆత్మాహుతి దాడులతో అతలాకుతలమవుతున్న పాకిస్థాన్‌కు భారత్‌తో యుద్ధం వినాశకరం. ముందుగా అది విద్వేషం విడనాడాలి. అయితే పాక్‌కు ఇంత వివేకం ఉంటుందని ఆశించడం అడియాస అవుతుంది. ప్రస్తుతానికి మూలిగే నక్కలా ఓ మూలకు చేరి గాయాలు మాన్పుకోవాలని చూస్తుంది. తరవాత అదనుచూసి బరితెగిస్తుంది. భారత్‌ ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి సదా అప్రమత్తంగా ఉండాలి. బంగ్లాదేశ్‌ యుద్ధంలో పట్టుబడిన 95,000 మంది పాక్‌ యుద్ధ ఖైదీలను విడుదల చేయడం ద్వారా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద తప్పు చేశారు. తద్వారా యుద్ధంలో చిత్తుగా ఓడిన పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టోకు మళ్లీ రాజకీయ ఊపిరిలూదారు.

యుద్ధంలో గెలిచినదాన్ని సిమ్లా చర్చల్లో భారత్‌ కోల్పోయింది. అప్పట్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడానికి అంగీకరించిన భుట్టో ఆ అంశాన్ని కాగితంపై పెట్టవద్దని బతిమలాడారు. సదరు కాగితంపై సంతకం పెట్టి పాక్‌కు తిరిగివెళితే జనం తనను కొట్టి చంపేస్తారని వాపోయారు. తీరా పాక్‌కు తిరిగివెళ్లాక భారత్‌పై వెయ్యేళ్ల యుద్ధం ప్రకటించారు. పాక్‌ ధూర్తక్రీడను మోదీ సాగనివ్వకపోవడం అభినందనీయం!

Back to top