ప్రతి ఓటుకూ పక్కా లెక్క!

03/23/2019
ప్రతి ఓటుకూ పక్కా లెక్క! 

సాంకేతికత అండగా పోలింగుకు విశ్వసనీయత

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఎన్నికలకు ప్రాణాధారమనదగిన పోలింగ్‌ ప్రక్రియ లోటుపాట్లు లేకుండా ఉంటేనే ప్రజాస్వామ్యానికి సార్థకత. ఇప్పుడు అటువంటి అత్యుత్తమ పోలింగ్‌ విధానం కావాలన్న డిమాండ్లు సర్వత్రా బలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లోపరహిత పోలింగ్‌ వ్యవస్థ కోసం వివిధ స్థాయుల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో వెనకబడిన ఆఫ్రికా దేశాలు ముందుండటం విశేషం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలను ప్రజాతంత్ర కుంభమేళాగా ప్రధానిగా వాజ్‌పేయీ అభివర్ణించారు. ఎన్నికల నిర్వహణ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న మహాయజ్ఞం. సాంకేతిక పరిజ్ఞానం పురోగమించిన తరుణంలో ఓట్ల గల్లంతు, దొంగఓట్లు, రిగ్గింగ్‌ వంటి ఘటనలు ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. అర్హుడైన ప్రతి ఒక్క ఓటరూ నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం.

నేటికీ విమర్శలు 
భారత్‌లో స్వాతంత్య్రానంతరం బ్యాలెట్‌ ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేవారు. చాలాకాలం ఈ విధానమే కొనసాగింది. ఈ ప్రక్రియ ప్రహసనప్రాయమైందని, లోటుపాట్లతో కూడుకుందని కాలక్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. తరవాతి రోజుల్లో పకడ్బందీ పోలింగ్‌ లక్ష్యంతో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) ప్రవేశపెట్టారు. 2000 సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వీటిపైనా అనుమానాలు ముసరడంతో ‘వీవీప్యాట్‌’లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇవి సైతం దొంగ ఓట్లను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నాయి. వీటిపై వివిధ వర్గాలు, పార్టీల నుంచి అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. వీటి విశ్వసనీయతపైనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం, దేశరక్షణ, అంతర్గత భద్రత... లాంటి కీలక అంశాలను పర్యవేక్షించే చట్టసభ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నూరు శాతం ఎటువంటి లోటుపాట్లు లేని విధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతుల కన్నా బయోమెట్రిక్‌ విధానం (యంత్రాల ద్వారా వేలిముద్రలను సరిపోల్చడం) భేషైనదని అంతర్జాతీయ ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంలో ఓటర్లు తమ వేలిముద్ర, ఐరిస్‌ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. బయోమెట్రిక్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ ఓట్లు వేయడానికి ఎలాంటి ఆస్కారమూ ఉండదు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన భారత్‌లో ఈ ప్రక్రియను సత్వరమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాముగా మారింది. వీటికి పరిష్కారంగా వేలిముద్రల విధానంలో పారదర్శకత, కచ్చితత్వం సాధించవచ్చన్న అభిప్రాయం ఊపందుకుంటోంది. బయోమెట్రిక్‌తో ఎన్నికల నిర్వహణలో కొన్ని ఆఫ్రికా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలు ఆర్థికంగా అంతగా ప్రగతి సాధించనప్పటికీ ఎన్నికల సంస్కరణల్లో ఆదర్శంగా ఉన్నాయి. పారదర్శకత, పకడ్బందీ విధానాలు అవలంబిస్తూ ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఈ దేశాల్లో ఎన్నికల ప్రక్రియ అక్రమాలకు నెలవుగా ఉండేది. జాతీయతను నిరూపించే సరైన ధ్రువపత్రాలు, సమర్థ నిర్వహణ లేని జనన, మరణ నమోదు పట్టికలు, జాతుల ఘర్షణ, అంతర్యుద్ధాలు పారదర్శక ఎన్నికల ప్రక్రియకు అవరోధాలుగా ఉండేవి. క్రమంగా జాతుల ఘర్షణలు తగ్గడంతో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ‘ఎలక్ట్రానిక్‌’ విధానాన్ని సూచించాయి. సాంకేతికతను ఈ దేశాల్లోని ఎన్నికల సంఘాలు సమర్థంగా వినియోగించుకున్నాయి. మొదట ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లో సామూహికంగా నిర్వహించారు. ఈ శిబిరాల్లో అర్హులైన వయోజనుల నుంచి వేలిముద్రలు, ఐరిస్‌లను ముఖకవళికలను యంత్రాల ద్వారా సేకరించారు. కెన్యా, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఉగాండాల్లో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. ఇవన్నీ భారత్‌కన్నా చాలా చిన్నదేశాలు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో వెనకబడి ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌తో వాటికి పోలికే లేదు. ఓటర్ల పరంగా, ఆర్థిక వ్యవస్థ పరంగా ఏ రకంగా చూసినా ఆ దేశాలు చిన్నవే. అయినప్పటికీ అవి పోలింగ్‌పరంగా ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం. ఈ దేశాల అనుభవాలను పాటించినట్లయితే అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు.

కెన్యా, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఉగాండాల్లో ముందుగా ఓటర్ల జాబితాను జాతీయ డేటాబేస్‌లో నిక్షిప్తం చేశారు. ప్రతిఒక్క ఓటరుకు బయోమెట్రిక్‌ ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. ఒక ఓటరుకు ఒక ఓటు మాత్రమే అన్న సిద్ధాంతానికి అనుగుణంగా నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒకటి కంటే ఎక్కువగా ఓటు కలిగి ఉండటాన్ని దీని ద్వారా సమర్థంగా నివారించారు. దొంగ ఓటర్ల ప్రక్రియకు పూర్తిగా తెరపడింది. పోలింగ్‌ రోజున ఓటింగ్‌ యంత్రాలతోపాటు స్కానర్లను జాతీయ డేటాబేస్‌తో అనుసంధానం చేశారు. ఓటరు కార్డు లేకపోయినా స్కానర్‌పై వేలిని ఉంచితే వెంటనే ఎల్‌సీడీ తెరపై అతడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఎన్నికల అధికారి అనుమతితో పోలింగ్‌బూత్‌ లోపలికి వెళ్లి తనకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసేందుకు అనుగుణంగా ఓటింగ్‌ యంత్రంపై తనకు నచ్చిన గుర్తుపై మీట నొక్కుతారు. దీంతో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. అతడి ఓటు ‘లాక్‌’ కావడంతో దేశంలోని మరేప్రాంతంలో ఎవరూ దాన్ని వేసేందుకు అవకాశం ఉండదు. ‘లాక్‌’ అయినందువల్ల ఇతరులు రిగ్గింగ్‌ చేసేందుకు యత్నించినా సాధ్యంకాదు. ప్రస్తుతం మన దేశంలో కొందరి ఓట్లను ఇతరులు వేసేస్తున్నారు. కొందరి ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతవుతున్నాయి. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయోమెట్రిక్‌ విధానం అమలులోకి వస్తే ఓటరు ఎలాంటి ప్రయాసలకు లోనుకాకుండా నిర్భీతిగా ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.

ఎస్తోనియాలో ఆన్‌లైన్‌ ఓటింగ్‌

ఐరోపాలోని చిన్నదేశమైన ఎస్తోనియాలో బయోమెట్రిక్‌ కంటే మేలైన ఆన్‌లైన్‌ ఓటింగ్‌ విధానాన్ని 2005 నుంచి విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఈ విధానం ద్వారా ఎన్నిక నిర్వహించిన మొదటి దేశం ఇదే కావడం విశేషం. ఐ-ఓటింగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో దీన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఓటరు తన విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయగానే అతడి చరవాణికి నిర్ధారణ కోసం ‘కోడ్‌’ వస్తుంది. దీన్ని తిరిగి టైప్‌ చేస్తే ఓటు వేసే సౌకర్యం కలుగుతుంది. ఈ నెల మొదటివారంలో జరిగిన ఎస్తోనియా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఈ విధానం ద్వారానే ఓటు వేశారు.

భారత్‌లోనూ ప్రవేశపెట్టాలి 
సమాచార, సాంకేతిక వ్యవస్థల్లో భారత్‌ దూసుకుపోతోంది. ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత మనది. 90ల తరవాత వచ్చిన శాస్త్ర, సాంకేతిక విప్లవం దేశాన్ని పూర్తిగా మార్చివేసింది. సేవలు, జీవనవిధానం, వినోదం, మీడియా, టెలికాం, పర్యాటకం... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా దేశంలోని అనేక సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. అయితే ఎన్నికల నిర్వహణలో మాత్రం నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టలేకపోయాం. పోలింగ్‌లో చోటుచేసుకునే అక్రమాలు, అవినీతిని అరికట్టాలంటే మన దేశంలోనూ బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఒక్క దొంగ ఓటు కూడా పోల్‌కాకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఈ విధానం ద్వారా ఓటింగులో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఆధార్‌ కార్డు ప్రవేశంతో దేశ ప్రజల వేలిముద్రలు, ఐరిస్‌లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆధార్‌ను ఓటుకు అనుసంధానం చేసి ఓటింగ్‌ సమయంలో స్కానర్స్‌ ద్వారా బయోమెట్రిక్స్‌తో ఓటింగ్‌ నిర్వహిస్తే లోపాలను అధిగమించవచ్చు. ఎన్నికల ప్రక్రియలో బయోమెట్రిక్స్‌ను అత్యంత సురక్షితమైన భద్రతతో కూడిన వ్యవస్థగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య సంస్థలు అంగీకరిస్తున్నాయి. మనదేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతోంది. బయోమెట్రిక్‌ ఓటింగుతో ఎన్నికల కాలవ్యవధిని బాగా తగ్గించే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా పోలింగ్‌ పూర్తయిన వెంటనే కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వెలువడుతాయి. జాతీయ డేటాబేస్‌లో పోలింగ్‌ సమాచారం ‘ఎలక్ట్రానిక్‌’ రూపంలో ఉండటంతో ఎవరైనా అభ్యర్థులు అనుమానాలు లేవనెత్తినా సత్వరం వాటిని నివృత్తి చేయగల వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఈవీఎమ్‌లను ట్యాంపరింగ్‌ చేసినట్లు వచ్చే ఆరోపణలూ దూరమవుతాయి. ప్రపంచంలోని ఆర్థిక ప్రగతి సాధించిన మొదటి అయిదు దేశాల్లో ఒకటైన భారత్‌లో బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన నిధుల కొరత లేదనే చెప్పాలి. కాబట్టి రాజకీయ నాయకత్వం, ఎన్నికల సంఘం, పౌరసమాజం ఈ దిశగా తక్షణమే కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉంది!

Back to top