విధానలోపమే శాపం

03/25/2019
విధానలోపమే శాపం

దయనీయస్థితిలో బీఎస్‌ఎన్‌ఎల్‌

తమకు అధికారం అప్పగిస్తే ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తామని, వాటిని పూర్తిస్థాయి స్వతంత్ర సంస్థలుగా తీర్చిదిద్దుతామని గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన జాతీయ పార్టీలన్నీ గట్టి వాగ్దానాలు చేశాయి.  నిధులు సమకూర్చుకోవడంతో పాటు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వాటికి కల్పిస్తామని హామీలు ఇచ్చాయి. కానీ అయిదేళ్ల తరవాత ప్రభుత్వరంగ సంస్థల పరిస్థితి చూస్తే ఆవేదన కలగక మానదు. నిబంధనల సంక్లిష్ట చట్రంలో కూరుకుపోయిన ఈ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ఒకప్పుడు మహోజ్వలంగా వెలిగిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఇప్పుడు నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ- ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు దిక్కులు చూసే దుస్థితికి దిగజారడమే ఇందుకు ఉదాహరణ. ఈ సంస్థ చాలాకాలం పాటు ఉజ్వలంగా ఉంది. ఒకప్పుడు రూ.40వేల కోట్ల మిగులుతో దివ్యంగా వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ గతేడాది డిసెంబరుకు రూ.15వేల కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. మొదట్లో నాలుగు లక్షల మంది సిబ్బందితో కళకళలాడిన సంస్థ బలగం గతేడాది 1.7 లక్షలకు తగ్గిపోయింది. 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో సిబ్బందికి జీతాలు సైతం చెల్లించలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌ (మహానగర్‌ టెలికమ్‌ నిగమ్‌ లిమిటెడ్‌)లో కొన్ని నెలల నుంచి సిబ్బందికి జీతాలు రావడం లేదు. ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారికి మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఆరు నెలల నుంచి పైసా రాని దుస్థితి నెలకొంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఏడో కేంద్ర వేతన కమిషన్‌ (సీపీసీ) సిఫార్సుల ప్రకారం సవరించిన పింఛన్‌కు నోచుకోవడం లేదు. ముంబయి, దిల్లీలలో సేవలను అందించే మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌) లోని 22వేల మంది సిబ్బంది జీతాల కోసం రూ.171 కోట్లు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ విడుదల చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన అంతర్గత వనరుల నుంచి రూ.850 కోట్లు సమీకరించి జీతాలు చెల్లించింది.

సౌకర్యాలులేక చిక్కులు
మొదట్లో టెలీకమ్యూనికేషన్ల రంగ రారాజుగా నిలచిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంతటి దయనీయ స్థితిలో కూరుకుపోవడానికి బీజం జాతీయ టెలీకమ్‌ విధానంలోనే పడింది. దేశ ప్రజలందరికీ అందుబాటు ధరలకు సేవలను అందించాలన్న లక్ష్యంతో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి కావలసిన సాధన సంపత్తి కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖకు లేదు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు టెలికమ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (టీఎస్పీ) సంస్థలకు ప్రవేశం కల్పించక తప్పదని భారత ప్రభుత్వం భావించింది. దానికన్నా ముందు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ను విడదీసి ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పరచారు. ఆపైన ట్రాయ్‌, టీడీశాట్‌ వంటి నియంత్రణ సంస్థలను నెలకొల్పారు. తరవాత విధానపరమైన, పాలన పరమైన చర్యలతో టీఎస్పీలకు ఉత్పత్తి సాధనాల వ్యయాన్ని తగ్గించారు. వివిధ సేవలకు విడివిడి లైసెన్సుల జారీ ప్రక్రియను యూఏఎస్‌ఐ ఛత్రం కింద ఏకీకృతం చేశారు. లైసెన్సు ఫీజును తగ్గించడంతోపాటు వాటి గడువును పెంచారు. స్పెక్ట్రమ్‌ కేటాయింపు విధానాన్ని, స్పెక్ట్రమ్‌ వినియోగ రుసుములను క్రమంగా సడలించారు. చెల్లింపు గడువులను పెంచారు. వినియోగదారుల రుసుమును 30 పైసల నుంచి క్రమంగా ఆరు పైసలకు తగ్గించి, జనవరి 2020కల్లా మొత్తంగా రద్దుచేయనున్నారు. టెలికమ్‌ ఆపరేటర్లు తమలో తాము భవనాలు, విద్యుత్‌ సరఫరా, టవర్లను పంచుకోవడానికి అనుమతించారు. అమూల్యమైన జాతీయ వనరు అయిన స్పెక్ట్రమ్‌ విక్రయం, పంపకాలను అనుమతించారు. విలీనాలు, స్వాధీనాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రమాణాలను సరళీకరించి, మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీని అనుమతించారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కోసుకుపోయినా ప్రైవేట్‌ టెలికమ్‌ ఆపరేటర్లు (టీఎస్పీలు) వ్యాపారంలో నిలదొక్కుకొంటారని సర్కారు ఆశించింది.

తీరా చూస్తే ఇప్పుడు టీఎస్పీలన్నీ భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీనంతటికీ మూల కారణం వేగంగా చందాదారులను పెంచుకోవాలనే ఆరాటంలో ఛార్జీలను విపరీతంగా తగ్గించడమే. జియోకు రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తే, ఎయిర్‌ టెల్‌ రూ.1.13 లక్షల కోట్ల మేరకు, వోడాఫోన్‌ రూ.1.2 లక్షల కోట్ల మేరకు నష్టం మూటగట్టుకున్నాయని అంచనా. అదే బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్ట భారం రూ.15వేల కోట్లు మాత్రమే. టెలికమ్‌ ఆపరేటర్లు ఉచితంగానో, కారు చౌక ధరలకో కాల్స్‌ను, డేటాను అందించినందునే నష్టాలు కొండల్లా పెరిగిపోయాయి. గతంలో సీడీఎంఏ మొబైల్‌ సేవలకు దివ్యమైన భవిష్యత్తు ఉందన్న ఆశతో రంగంలో దిగిన అనిల్‌ అంబానీ ఆర్‌ కామ్‌ సంస్థ ఆ సేవలకు గిరాకీ లేకపోవడంతో రూ.45 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయి దివాలాకు దరఖాస్తు చేసింది. అంబానీ సంస్థ తన భాగస్వామి అయిన ఎరిక్సన్‌ సంస్థకు రూ.459 కోట్ల బకాయిలను తీర్చాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ అవాంఛనీయ పోటీ మధ్య బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యాపారం దెబ్బతిని ఆదాయం తరిగిపోయింది. ప్రైవేటు ఆపరేటర్లు నష్టానికి సైతం సిద్ధపడి రకరకాల ఉచిత, ముదరా పథకాలు ప్రవేశపెట్టినట్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టడం కుదరదు. అది ప్రభుత్వ సంస్థ. కాబట్టి దాని ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రైవేటు టీఎస్పీలకు పోటీగా మార్కెటింగ్‌ వ్యూహాలను చేపట్టలేరు. అలాంటి అధికారం వారికి ఉండదు. వారు ఏంచేసినా కంప్ట్రోలర్‌ అండ్‌   ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నిఘా కన్ను పడుతుంది. సీబీఐ, సీవీసీల దర్యాప్తును ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడలేకపోతోందంటే అర్థం- వ్యాపారపరంగా సమానావకాశాలు లభించడంలేదనే. నేడు ఉచిత-కారుచౌక డేటా లభ్యత వల్ల సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వాటిలో జాతి వ్యతిరేక శక్తుల ప్రచారమూ ఎక్కువై జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దడానికి టెలికమ్‌ విధానంలో తగిన మార్పులు, చేర్పులు చేపట్టాలి.

ప్రభుత్వ దన్నుతోనే పునరుజ్జీవం

ప్రభుత్వం టెలీకమ్యూనికేషన్ల రంగాన్ని వ్యూహపరంగా కీలకమైన రంగంగా గుర్తించి అందులో తానూ వాటాదారుగా మారాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుజ్జీవానికి సకాలంలో స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరిపి, తగు వనరులు అందించాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.14వేల కోట్లకు 4జి స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేయాలనుకొంటోంది. అందులో రూ.ఏడు వేల కోట్లను ప్రభుత్వం ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టాలని కోరుతోంది. వచ్చే అయిదారేళ్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 75 వేల మంది ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేయదలచే ఉద్యోగులకు రూ.6.365 కోట్ల ప్యాకేజీ చెల్లించాల్సి ఉంటుందని అంచనా. 22 వేల మంది ఉద్యోగులుగల ఎంటీఎన్‌ఎల్‌కు వీఆర్‌ఎస్‌ ప్యాకేజీ కింద రూ.2,120 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఉచితాన్ని వీడాలి
వీఆర్‌ఎస్‌ పంథాలో ఉద్యోగులను తగ్గించుకోవాలనుకునే ముందు, ఈ పద్ధతి వల్ల ప్రతిభావంతులు, కష్టించి పనిచేసేవారు అందరికన్నా ముందు బయటకు వెళ్లిపోతారని గుర్తుంచుకోవాలి. దీనికి బదులు ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్లకు తగ్గించడం మంచిది. అన్ని స్థాయుల్లో నిపుణులను, ఏక కాలంలో అనేక పనులు చేయగల ప్రతిభావంతులను అట్టిపెట్టుకోవాలి. ఈ లక్షణాలున్న కొత్త ఉద్యోగులను నియమించుకోవాలి. మారుతున్న కాలానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేని ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ తీసుకునేలా కార్మిక సంఘాలు ప్రోత్సహించాలి. గుజరాత్‌ నమూనాలో పదేళ్ల బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వీఆర్‌ఎస్‌కు వెచ్చించాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు డిప్యుటేషన్‌ మీద వచ్చిన ప్రభుత్వోద్యోగులను వెనక్కు పంపి, ఆ స్థానాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను నియమిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ వస్తువు లేదా సేవను నష్టానికి అమ్మి వ్యాపారం చేయలేమని ఆర్థిక శాస్త్రం చెబుతోంది. టెలికమ్‌ రంగంలో ఉచిత సేవలను, రాయితీ ధరలను నిలిపేయాల్సిన సమయం వచ్చేసిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉదంతం హెచ్చరిస్తోంది. మిగతా సర్వీస్‌ ప్రొవైడర్ల పరిస్థితీ ఇంతే. ఇకనైనా ఉచిత, తగ్గింపు సేవలకు తెరదించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ఖాయిలా పడిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహణ ఖర్చుల కోసం రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. సంస్థకు చెందిన భూములు, భవనాలు, ఇతర ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చుకుని నష్టాల నుంచి బయటపడటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశమంతటా సుమారు రూ.70 వేల కోట్ల విలువ చేసే స్థలాలు ఉన్నాయి. వీటిని అమ్మి బకాయిలు తీర్చేకన్నా, ఆ స్థలాలను ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు 20 ఏళ్ల లీజుకిచ్చి ఆదాయం ఆర్జించవచ్చు. ఈ మేరకు గత ఏడాది జులైలో టెలీకమ్యూనికేషన్ల శాఖకు బీఎస్‌ఎన్‌ఎల్‌ లేఖ రాసింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు గల వ్యూహపరమైన ప్రాధాన్యాన్నీ, జాతీయ భద్రత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దానికి వనరులు కేటాయించాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేయాలి. దీనిని స్థాపించినప్పుడు టెలీకమ్యూనికేషన్ల శాఖ ఉద్యోగులు చాలామంది స్వచ్ఛందంగా కొత్త సంస్థలో చేరారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థను విజయవంతం చేయడానికి కష్టించి పనిచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పింఛన్‌నూ వదులుకొని ప్రభుత్వ రంగ సంస్థకు వర్తించే ఈపీఎస్‌ పథకంలో చేరారు. ఇప్పుడు వారికి వచ్చే పింఛన్‌ అరకొరగానే ఉంది. వీరందరినీ కేంద్ర వేతన కమిషన్‌ పరిధిలోకి తెచ్చి న్యాయం చేయాలి. ఒకవేళ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లను నడపలేమని ప్రభుత్వం భావిస్తే వాటిని రద్దు చేసి ఆ రెండు సంస్థల ఉద్యోగులను మళ్లీ టెలీకమ్యూనికేషన్ల శాఖలోకి తీసుకోవాలి. టెలీకం విధానాల సరళీకరణ వల్ల వినియోగదారులు లబ్ధిపొందిన మాట నిజం. ప్రైవేటు ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్న మాటా వాస్తవమే. కానీ, ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల పాలిట శాపం కారాదు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సకల చర్యలూ తీసుకోవాలి.

Back to top