పాతాళానికి ‘గంగ’

03/25/2019
పాతాళానికి ‘గంగ’

పడిపోతున్న భూగర్భజలం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవి తీవ్రతకు భూగర్భజలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. దీంతో ప్రజలు తాగునీటి అవసరాలు తీరక తల్లడిల్లుతున్నారు. మంచినీటి అవసరాలు తీర్చడమే తమ మొదటి ప్రాథమ్యమని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే పార్టీలు తరవాత ఆ విషయాన్ని మరచిపోతున్నాయి. అరకొర చర్యలతోనే సరిపెడుతున్నాయి. ఫలితంగా ఏటా వేసవిలో తాగునీటి వెతలు అనివార్యమవుతున్నాయి.

తాగునీటి అవసరాలను తీర్చడంతో భూగర్భ జలాలది కీలకపాత్ర. భూమిలోకి నీరు ఇంకడానికి తగిన చర్యలు చేపట్టకపోవడం, మితిమీరి నీటిని తోడటం, వృథా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షపునీరు భూగర్భ పొరలలోకి చొచ్చుకుపోయి భూగర్భ జలంగా మారుతుంది. ఇది అతిపెద్ద మంచినీటి వనరు. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడం, భూ ఉపరితల జలవనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం, ఉన్నవి కూడా చాలాచోట్ల కలుషితమవడం వల్ల ఎక్కువ మంది భూగర్భ జలాల మీదనే ఆధార పడుతున్నారు. రుతు పవనాలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అన్ని సమయాలలో ఇవి అందుబాటులో ఉంటాయి. భూ ఉపరితల జలాలు మాదిరిగా భూగర్భజలాలు త్వరగా కలుషితం కావు. ఇవి తాగడానికి అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా ఈ నీటి వినియోగం నానాటికి పెరుగుతూ వస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా భూగర్భజలాల్లో తాగునీటి అవసరాల కోసం 25 నుంచి 40 శాతం, వ్యవసాయానికి 43 శాతం వాడుతున్నారు.  భారత్‌లో భూగర్భజలాల వినియోగం గ్రామీణ ప్రాంతాలలో 90 శాతం, పట్టణ ప్రాంతాలలో 50 శాతం వరకు ఉంది. ప్రపంచంలో భూగర్భజల వనరులను అత్యధికంగా వెలికితీస్తున్నది (25.26 శాతం) భారతదేశమే. ఆ తరవాత స్థానంలో చైనా (11.40 శాతం), అమెరికా (11.37 శాతం) ఉన్నాయి. భూగర్భ జలాల వినియోగం, వాటి పునరుత్పత్తి కన్నా ఎక్కువగా ఉంది. జనాభా వేగంగా పెరగడం, వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడం, వర్షపు నీరు ఇంకడానికి కావలసినంత ఖాళీ స్థలాలు లేకపోవడం, సిమెంటు నిర్మాణాలు పెరగడం, భూగర్భజలాల మీద ఆధారపడి సేద్యం చేస్తుండటంతో భూగర్భ జలాల వినియోగం నానాటికీ అధికమవుతోంది. కేంద్రీయ భూగర్భ జలబోర్డు (2018) లెక్కల ప్రకారం దేశంలో భూగర్భజల మట్టాలు 61 శాతం పడిపోయాయి.

గత రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో సాధారణ వర్షపాతం (845 మి.మీ) కన్నా తక్కువ వర్షమే (699 మి.మీ.) కురిసింది. వారంలో 24 గంటలు వ్యవసాయ పంపు సెట్లు పనిచేయడం ద్వారా అధిక మోతాదులో భూగర్భజలాలను తోడుతున్నారు. ఫలితంగా 70 శాతం మండలాల్లో భూగర్భ జలమట్టాలు నెలకు 0.25 మీటర్ల చొప్పున పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2018 జూన్‌ నుంచి 2019 మార్చి మధ్య కాలంలో పడవలసిన సాధారణ వర్షపాతం 873 మిల్లీమీటర్లు. అయితే 595 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో వెయ్యికి పైగా గ్రామాల్లోని వ్యవసాయ బావులే అక్కడి ప్రజలకు ఆధారమవుతున్నాయి. బావులను మరింత లోతు తవ్వినా ఫలితం ఉండటం లేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ ప్రాంతంలో పశువులూ నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అసహజ వాతావరణం వల్ల వర్షపాతం తగ్గిపోవడం, నీటి వినియోగం పెరగడం, పడిన వర్షాన్ని శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా రక్షించకలేకపోవడం వలన నానాటికి నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీనివల్ల తలసరి వార్షిక నీటి లభ్యతలో మార్పులు జరుగుతున్నాయి.

మారుతున్న పరిస్థితుల్లో భూగర్భజల నిల్వలు పెరగడానికి తగిన చర్యలు చేపట్టడం తప్పనిసరి. చెట్లను పెంచడం వల్ల వాయుకాలుష్యం తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి వర్షపాతం పెరగడానికి దోహదపడుతుంది. వర్షపు నీటిని కొండ దిగువ ప్రాంతాల్లో కందకాలు, గోతుల ద్వారా భూగర్భంలోకి వెళ్లేటట్లు చూడాలి. సహజ నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఆ నీటిని గుంటలు, చెరువులు, జలాశయాలలోకి, భూపొరలలోకి పంపినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నీటి వాలు ప్రాంతాల్లో వీలును బట్టి ఎక్కువగా గుంతలు, చెరువులను తవ్వించాలి. వాటిల్లో పూడిక మట్టిని తొలగించి, నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, వరద నీటిని జలాశయాలలోనికి మళ్ళించడం వంటి చర్యలను చేపట్టడం అవసరం. వర్షపు నీరు అధిక మోతాదులో భూమిలోకి ఇంకే విధంగా కట్టడాలు నిర్మించాలి. నీటిని అవసరానికి మించి వాడరాదు. పంపుల ద్వారా వృథా అవుతున్న నీటిని అరికట్టాలి. వ్యర్థ జలాలను శుద్ధిచేసి వ్యవసాయానికి వాడటం, బిందు, తుంపర పద్ధతులను ప్రోత్సహించడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది. రసాయనిక, విషపూరిత పదార్థాల నుంచి భూగర్భజలాలను సంరక్షించాలి. భూగర్భజలాలను వెలికితీయడంలో నిబంధనలను అతిక్రమించరాదు. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలి. ఈ చర్యల ద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గి వాటి మట్టాలు పడిపోకుండా ఉంటాయి. శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు భూగర్భజల సమతుల్యత గురించి ప్రజలలో అవగాహన కలిగించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సమకూరగలవు!

Back to top